వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:24 AM
కరీంనగర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం తెలిపారు. వినాయక చవితి సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లపై సీపీ కమిషనరేట్ కేంద్రంలో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం తెలిపారు. వినాయక చవితి సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లపై సీపీ కమిషనరేట్ కేంద్రంలో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు, రూట్ మ్యాపింగ్, విద్యుత్ వైర్లు సంబంధిత జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిమజ్జనం జరిగే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల మళ్లింపు చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ విగ్రహాలను కేటాయించిన రూట్లలో మాత్రమే తరలించాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించి నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, జి విజయకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.