స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:39 PM
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని సీపీ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని సీపీ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో సీపీ అధ్యక్షతన పోలీసు అధికారులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అనుభవజ్ఞులైన అధికారులను, సిబ్బందిని కేటాయించామని తెలిపారు. ఈ సెల్ కమిషనరేట్ వ్యాప్తంగా అధికారులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు. త్వరలో ఆరు అంతర్‌జిల్లా చెక్ పోస్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఈ చెక్ పోస్టుల వద్ద ముమ్మర వాహన తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల నేరస్థులను, రౌడీ షీటర్లను ఆయా రెవెన్యూ అధికారుల ఎదుట బైండ్ ఓవర్ చేయాలన్నారు. సరైన ఆధారాలు లేకుండా 50 వేలకంటే ఎక్కువ నగదును వెంట తీసుకువెళ్లరాదని, ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఆ మొత్తాన్ని సీజ్ చేయాలని సీపీ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ సూచించారు. ఎన్నికల హ్యాండ్‌బుక్‌లోని ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని, అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు కేటాయించే పోలీసు అధికారులకు అవసరమైతే శిక్షణ అందిస్తామని చెప్పారు.
ఫ దసరా, దుర్గా దేవి నిమజ్జనానికి పట్టిష్ట బందోబస్తు
దసరా పండుగ సందర్భంగా కమిషనరేట్ వ్యాప్తంగా రాంలీలా మైదానాలు, దుర్గా దేవి నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినందున, రాజకీయ అల్లర్లు జరగకుండా నివారించడానికి అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.