Share News

‘పొగ’బారుతున్నారు..

ABN , Publish Date - May 31 , 2025 | 12:47 AM

సరదా కోసం కాల్చే సిగరెట్‌ అలవాటుగా మారుతోంది.. క్రమంగా వ్యసనంగా మారి చివరకు ప్రాణాలనే హరిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగ క్షయకు వారధిగా మారుతోంది.

‘పొగ’బారుతున్నారు..

- జిల్లాలో పెరుగుతున్న క్షయ వ్యాధిగ్రస్థులు

- 5 నెలల్లో 447 మంది రోగుల గుర్తింపు

- ధూమపానంతో ప్రాణాంతక వ్యాధులు

- నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సరదా కోసం కాల్చే సిగరెట్‌ అలవాటుగా మారుతోంది.. క్రమంగా వ్యసనంగా మారి చివరకు ప్రాణాలనే హరిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగ క్షయకు వారధిగా మారుతోంది. గత సంవత్సరం జిల్లాలో క్షయకు గురైనవారు 1013 మంది క్షయతో చికిత్స పొందారు. ఈ సంవత్సరం ఐదు నెలల్లోనే 447 మంది క్షయ వ్యాధి బారిన పడ్డారు. జిల్లాలో ప్రస్తుతం 540 మంది చికిత్స పొందుతున్నారు. మగధీరులకు మా అద్భుత సిగరేట్‌.. అంటూ కంపెనీల ప్రచారం విని నాలుగు దమ్ములు ఎక్కువగా లాగితే తాగేవారికి కాదు.. వారి పక్కనున్న వారి ఊపిరి తిత్తులు కూడా శక్తిని కోల్పోతున్నాయి. చలాకీగా ఉండే ఎంతో మంది పొగాకుకు బలై ఊపిరి తిత్తులు పాడై ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పొగలో ఉండే తారు, నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కాడ్మియం, నత్రజని ఆక్సైడ్‌, ఆమోనియా, బెంజిన్‌, ఫార్మల్‌ డిహైడ్‌, సీసం ఇవి ఊపిరి తిత్తుల్లోకి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని పాడు చేయడమే కాకుండా నికోటిన్‌ అనే పదార్థానికి పొగ తాగటానికి, పొగ తాగటం మానేస్తే ఉండలేక పొగ వైపు మనస్సును లాగేస్తూ బానిసగా మార్చే శక్తి ఉంటుంది. పొగ తాగటం వల్ల ఊపిరి తిత్తుల వాపు, అస్తమా, జలుబు, దగ్గు, క్యాన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తలనొప్పి దగ్గు, ఆయాసం, కళ్ల మంటలు, తుమ్ములు, బొంగురు గొంతు, వికారం, వాంతులు, గొంతునొప్పి, కళ్లు తిరగడం మొదలైన ఇబ్బందులు కూడా వస్తాయి. పొగ తాగేవారితో పాటు భార్యలకు కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ముందుగా టీబీకి గురవుతున్నారు. చుట్ట వెనక్కి తిప్పి కాల్చే వారికి పుట్ట కురుపు క్యాన్సర్‌ వస్తుంది. బీడీ తాగటం మరింత ప్రమాదకరంగా ఉంటుంది.

ఐదు నెలల్లో 447 మంది బాధితులు

వస్త్రపరిశ్రమ కేంద్రంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతంలో టీబీతో బాధపడుతున్న వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువగా బీడీ, సిగరెట్లు తాగడంతోనే టీబీ బారిన పడుతున్నట్లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ, గంభీరావుపేటలో టీబీ యూనిట్లతో పాటు మరో ఏడు పరీక్షా కేంద్రాల ద్వారా టీబీతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం తెమడ పరీక్షలు నిర్వహించగా 1013 మందికి క్షయ నిర్ధారణ అయింది. వీరికి చికిత్సను అందించారు. ఈ ఏడాది ఐదు నెలల్లోనే 447 మంది టీబీకి గురైనట్లు గుర్తించి చికిత్సలు అందించారు.

పొగాకు వ్యతిరేక దినోత్సవం నేపఽథ్యం..

ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. ఇలాంటి నష్టాలను దృష్టిలో పెట్టుకొని పొగాకుపై అవగాహన కల్పించడానికి 1987లో ఒక తీర్మానం చేశారు. దాని ద్వారా ఏప్రిల్‌ 7న ప్రపంచ నో టోబాకో డేను జరపాలని నిర్ణయించారు. 1987లో చేసిన మరో తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం మే 31వ తేదిన ఈ దినాన్ని పాటించాలని నిర్ణయించారు. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా పొగాకు వాడకం వల్ల జరుగుతున్న మరణాలపై ప్రచారం చేస్తున్నారు.

పొగాకు నియంత్రణ చట్టాలు..

ప్రతి సంవత్సరం పొగాకు మరణాలను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2003లో పొగాకు ఉత్పత్తుల నిషేద చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. సెక్షన్‌ 4 ప్రకారం పొగ తాగటం నిషేధం. సెక్షన్‌ 5 ప్రకారం సిగరేట్‌, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రచారంపై నిషేధం, సెక్షన్‌ 6ప్రకారం 18సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా సంస్థల ఆవరణ నుంచి వంద గజాల దూరం వరకు వస్తువుల అమ్మకం నిషేధం విధించారు. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలు కూడా ముద్రించాలని చట్టాలు రూపొందించారు. 2008లో బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధం వంటివి తీసుకవచ్చారు. ఆరోగ్య సంక్షేమ శాఖ జీవో నంబర్‌ 113 ప్రకారం పొగ తాగేవారికి రూ 500 వరకు జరిమానా విధించే అవకాశం పోలీస్‌ శాఖకు కల్పించారు. కానీ చట్టాలు అమల్లోకి రావడం లేదు.

కోట్ల రూపాయలను కాల్చేస్తున్నారు..

జిల్లాలో సిగరేట్‌, నిషేధించిన గుట్కా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దాదాపు రూ.8 కోట్ల వరకు వ్యాపారం సాగుతోందని అంచనా వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, యువకులు రహస్యంగా పొగ తాగడానికి అలవాటుపడుతున్నారు. టీ సెంటర్‌లు, బస్టాండ్‌ ప్రాంతాల్లో నిత్యం పొగ తాగుతూ అనేకమంది దర్శనమిస్తున్నారు. ఒకవ్యక్తి రోజుకు 2 ప్యాకెట్లు తాగేవారు ఉన్నారు. రోజుకు రూ.65 నుంచి రూ 350 వరకు సిగరేట్లకు ఖర్చు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నవారు కూడా ఉన్నారు.

జిల్లాలో ఐదు నెలల్లో క్షయవ్యాధిగ్రస్థులు..

ఆరోగ్య కేంద్రం ఐదు నెలల్లో.. గత సంవత్సరం

గంభీరావుపేట 40 81

ఎల్లారెడ్డిపేట 52 106

పోత్గల్‌ 41 82

వేములవాడ 55 132

చందుర్తి 38 90

బోయినపల్లి 13 32

కొదురుపాక 08 19

విలాసాగర్‌ 10 16

తంగళ్లపల్లి 29 61

నేరేళ్ల 12 38

చీర్లవంచ 19 39

ఇల్లంతకుంట 33 89

కోనరావుపేట 36 98

పీఎస్‌నగర్‌ 32 69

ఏబీనగర్‌ 29 61

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 447 1013

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - May 31 , 2025 | 12:47 AM