‘తెల్ల’బోతున్నారు..
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:45 AM
పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అతివృష్టి, అనావృష్టిని తట్టుకొని పంటను కాపాడుకున్న పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అతివృష్టి, అనావృష్టిని తట్టుకొని పంటను కాపాడుకున్న పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఏటా పత్తి రైతులకు దూది పూల దుఃఖాన్ని మిగిలిస్తుంది. జిల్లాలో పత్తి రైతులు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టాన్ని చవిచూడగా, పంట చేతికొచ్చే దశలో మొంథా తుఫాన్ కూడా కలవరపెట్టి పోయింది. మిగిలిన పత్తి దిగుబడిపై ఆశలు పెంచుకున్న రైతులకు నిబంధనల కత్తి మెడపై వేలాడుతోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకుని మద్దతు ధర పొందవచ్చని ఆశపడ్డ నిరాశ మిగిలింది. సీసీఐ కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండడంతో రైతులు మళ్లీ దళారులే దిక్కా అనే అయోమయ పరిస్థితిలో పడ్డారు.
ఫ ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి కొనుగోలు కోసం జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఐదు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లాలో వేములవాడ మండలం నాంపల్లిలో లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలో లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట మండలం సుద్దాలలో శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్, ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, గాలిపెళ్లిలో శ్రీ సప్తగిరి ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్లు మొదలయ్యాయి. గతంలో లేనివిధంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్‌ను తీసుకు వచ్చింది. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిలో 8 తేమ శాతం కంటే తక్కువ ఉంటే క్వింటాలకు రూ.8110, తేమ 10 శాతం ఉంటే క్వింటాలుకు రూ.7947, తేమ 11శాతం ఉంటే రూ.7866, తేమ 12 శాతం ఉంటే రూ.7785 మద్దతు ధర చెల్లిస్తారు. గ్రామాల్లో రైతులకు స్మార్ట్‌ఫోన్లు ఉండవు. దీంతో స్లాట్ బుక్ చేసుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలోనే సీసీఐ పత్తి కొనుగోళ్లలో పరిమితి విధించడం రైతుల్లో ఆందోళన కలిగించింది. గత సంవత్సరం సీసీఐ ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. ఈసారి ఎకరానికి 7 క్వింటాళ్లకే పరిమితి విధించింది. సీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, వారికి మద్దతుగా అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ ఆధారంగానే సీసీఐ, మార్క్‌ఫెడ్ సంస్థలు పంటలను కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ శాఖ అంచనాలకు సీసీఐ కొనుగోళ్లకు పొంతన కుదరకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
ఫ జిల్లాలో 46385 ఎకరాల్లో పత్తి సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46385 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. గంభీరావుపేటలో 85 ఎకరాలు సాగు చేయగా, ఇల్లంతకుంటలో 12000 ఎకరాలు, ముస్తాబాద్‌లో 530ఎకరాలు, సిరిసిల్లలో 800ఎకరాలు, తంగళ్లపల్లిలో 870ఎకరాలు, వీర్నపలిలో 300ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3600 ఎకరాలు, బోయినపల్లిలో 6400 ఎకరాలు, చందుర్తిలో 6200 ఎకరాలు, కోనరావుపేటలో 4800ఎకరాలు, రుద్రంగిలో 2200 ఎకరాలు, వేములవాడలో 4800 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3800 ఎకరాలు సాగు చేశారు. జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలకు పత్తి నష్టపోయినా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంట దెబ్బతిన్న చేన్లలో కూడా ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీని ప్రకారం జిల్లాలో ఐదు లక్షలపైగానే పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సీసీఐ ఎకరానికి 7 క్వింటాళ్లు కొనుగోలు పరిమితి విధించడంతో మిగతా నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల పత్తి దళారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.