Share News

ఈసారి మిగులు లేదు..

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:53 AM

రేషన్‌ లబ్ధిదారుల్లో దొడ్డు బియ్యం ఈసారి మిగులకుండా తీసుకున్నారు.

ఈసారి మిగులు లేదు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రేషన్‌ లబ్ధిదారుల్లో దొడ్డు బియ్యం ఈసారి మిగులకుండా తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతినెలా దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో 4లక్షల 11 వేల 751 కిలోల బియ్యం మిగిలిపోయేవి. ప్రభుత్వం సన్నబియ్యానికి శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారులు పోటీపడి తీసుకున్నారు. జిల్లాలో 345 రేషన్‌దుకాణాల పరిధిలో 1,73,578 కార్డులు ఉన్నాయి. ఇందులో 1,54,678 కార్డుదారులు బియ్యాన్ని పొందారు. జిల్లాకు 32 వేల 753 క్వింటాళ్ల సన్నబియ్యం లబ్ధిదారులకు సరఫరా చేయగా 30వేల 178 క్వింటాళ్ల బియ్యం తీసుకున్నారు. రేషన్‌ దుకాణాల వద్ద బారులుతీరి బియ్యం లబ్ధిదారులు పొందడంతో అదనంగా మూడు రోజుల గడువు కూడా పొడిగించారు. ప్రతినెలా 15వ తేది వరకు బియ్యం పంపిణీ జరిగేది. లబ్ధిదారుల ఆసక్తి చూసి 18 సాయంత్రం వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్‌ బియ్యం పొందడంతో రికార్డు నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంతగా 90 శాతం వరకు ఇప్పటికే సన్నబియ్యం పొందారు. శుక్రవారంతో పూర్తిస్థాయి రేషన్‌ తీసుకుంటారని అంచనాలు వేస్తున్నారు. జిల్లాలో రేషన్‌ సన్నబియ్యం పంపిణీ ఏప్రిల్‌ 1న బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాలతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలు పంపిణీ చేశారు. వీరితో పాటు వరుసగా కాంగ్రెస్‌ నాయకులు మండలాల్లో పంపిణీ చేయడంతో పాటు కలెక్టర్‌తో సహా పేదవారితో కలిసి వారి ఇళ్లలో సన్నబియ్యం భోజనం చేయడంతో జిల్లాలో సన్నబియ్యంపై ఆసక్తి పెరిగింది. సన్నబియ్యం కూడా నాణ్యతగానే రావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తం అయింది. గతంలో దొడ్డు రకం బియ్యం నెమ్మదిగా పంపిణీ జరిగేది. ఈసారి పది రోజుల్లోనే చివరి దశకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. దొడ్డు బియ్యం సీజ్‌చేసి ఈ ఏప్రిల్‌ కోటా పూర్తిస్థాయిలో బియ్యం కోటాను జిల్లాకు అలాట్‌ చేశారు.

జిల్లాలో 5,02,714 మంది లబ్ధిదారులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతినెలా 5,02,714 మంది లబ్ధిదారులకు 32,758 క్వింటాళ్ల వరకు బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 1,73,578 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 13,754, ఆహార భద్రత కార్డులు 1,59,621 కార్డులు, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో 5,02,714 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ లబ్ధిదారులు 37,184 మంది, ఆహారభద్రత లబ్ధిదారులు 4,65,324 మంది, అన్నయోజన లబ్ధిదారులు 206 మంది ఉన్నారు. వీరికి సన్నబియ్యం 32,75,364 కిలోలు కేటాయించారు. ఇందులో ఈనెల 1,73,578 కార్డుదారుల్లో 1,54,678 కార్డుదారులు 30,17,899 కిలోల బియ్యాన్ని పొందారు.

మిగులు లేదు...

గతంలో జిల్లాలో దొడ్డు బియ్యం పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు ఆసక్తి చూపేవారు కాదు. సగం మంది దొడ్డుబియ్యంతో అన్నం వండుకోవడానికి తీసుకొని వెళితే, మరికొందరు పిండి వంటల కోసం వాడుకునే వారు. మిగతా వారు దళారులకే బియ్యాన్ని అమ్మి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ రేషన్‌ దుకాణాల్లో దొడ్డు బియ్యం మిగిలిపోయేవి. ఇలా మిగిలిన బియ్యం లెక్కల ఆధారంగా మిగులు కలుపుకొని బియ్యం సరఫరా చేసేవారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 4,716 క్వింటాళ్ల బియ్యం మిగిలేది. మిగులు దొడ్డు బియ్యంలో బోయినపల్లి మండలంలో 32,891కిలోలు, చందుర్తిలో 23,501, గంభీరావుపేటలో 25,207, ఇల్లంతకుంట 37,144, కోనరావుపేట 40,718, ముస్తాబాద్‌ 31,658, రుద్రంగి 11,793, సిరిసిల్ల 1,07,436, తంగళ్లపల్లి 28,445, వీర్నపల్లి 12,133, వేములవాడ 64,869, వేములవాడ రూరల్‌ 21,608, ఎల్లారెడ్డిపేట 34,226 కిలోల బియ్యం మిగులుగా ఉండేది. ప్రస్తుతం ఈ బియ్యాన్ని ఆయా రేషన్‌ దుకాణాల్లోనే సీజ్‌ చేశారు.

సన్నబియ్యం పొందిన కార్డుదారులు

మండలం రేషన్‌షాపులు కార్డులు బియ్యం పొందిన కార్డుదారులు

బోయినపల్లి 25 11,911 9,742

చందుర్తి 19 10,912 9,359

గంభీరావుపేట 29 15,556 1,3193

ఇల్లంతకుంట 33 14,385 12,611

కోనరావుపేట 35 13,919 11,599

ముస్తాబాద్‌ 29 14,417 12,250

రుద్రంగి 08 4,850 4,394

సిరిసిల్ల 49 26,782 25,800

తంగళ్లపల్లి 34 14,151 13,226

వీర్నపల్లి 09 4,208 3,618

వేములవాడ రూరల్‌ 16 7441 6,214

వేములవాడ 30 19,392 17,795

ఎల్లారెడ్డిపేట 29 15,654 13,877

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 345 173,578 1,54,678

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Apr 18 , 2025 | 12:53 AM