లెక్కలు ఉండవు.. నిబంధనలు పాటించరు
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:31 AM
రామగుండం నగరపాలక సంస్థలో కీలకమైన స్టోర్‌లలో లెక్కలు లేవు..
కోల్‌సిటీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో కీలకమైన స్టోర్‌లలో లెక్కలు లేవు.. నిబంధనలు లేవు.. అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. స్టోర్‌ల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రభుత్వ స్టోర్‌లకు సంబంధించి 10, 20ఏళ్ల సామగ్రి, యంత్రాలకు సంబంధించి స్టాక్ రిజిష్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో స్టోర్ నిర్వహణ ఉంటుంది. సిబ్బంది, అధికారులు మారినప్పుడల్లా చార్జ్ సర్టిఫికెట్, టేక్ ఓవర్, హ్యాండ్ ఓవర్ రిజిష్టర్లు నిర్వహించాలి. అధికారులు ఎవరు మారినా కూడా స్టోర్‌ల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరా, ఎలక్ర్టికల్, శానిటేషన్‌కు సంబం ధించిన స్టోర్‌లు ఉన్నాయి. ప్రతి స్టోర్‌కు ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి ఇన్‌చార్జిగా, ఇంజనీర్లు, ఇతర అధికారులు మానిటరింగ్ అధికారులుగా ఉంటారు. కానీ రామగుండంలో స్టోర్‌ల నిర్వహణ గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి. గతంలో సమ్మక్క - సారలమ్మ జాతరలో సీసీ కెమెరాల బిగింపునకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. జాతర ఆ తరువాత అవి స్టోర్‌లోకి చేరాల్సి ఉంది. కానీ స్టోర్‌లలోకి రాలేదు. దీనితో మళ్లీ జాతరకు కొనుగోలు చేసి బిగించాల్సి వచ్చింది. ఎలక్ర్టికల్ విభాగంలో కొనుగోళ్లకు, నిర్వహణకు పొంతనే ఉండదు. ఎప్ప టికప్పుడు స్టోర్ ఖాళీ అనే పరిస్థితే ఉంటుంది. ఎలక్ర్టికల్ పర్చేస్‌కు సంబంధించి గోల్‌మాల్ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. శానిటేషన్ విభాగంలోనైతే వరుస ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. శానిటేషన్ స్టోర్‌లలో సున్నం, బ్లీచింగ్, దోమల కెమికల్, పనిముట్లు, సబ్బులు, బెల్లంపల్లి, నూనె, తదితర కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. సున్నం, బ్లీచింగ్ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వస్తూనే ఉన్నా యి. గతంలో స్టాక్ బుక్ అడ్జెస్ట్‌మెంట్లు జరిగేవనే ఆరోపణలున్నాయి. సాధారణంగా స్టాక్ వచ్చిన సమయంలో అధికారులు పరిశీలించి స్టోర్ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో స్టాక్ రిజిష్టర్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాడకాన్ని కూడా రిజిస్టర్‌లో పేర్కొనాలి. కార్పొరేషన్‌లో బెల్లం, బ్లీచింగ్ పౌడర్, రెయిన్ కోట్లు, చెప్పుల కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. కార్మికుల సంఖ్యకు సరిపడా సామగ్రి రాలేదని, కొంత మంది కార్మికులకు ఇవ్వకపోవడంతో విమర్శలు వచ్చా యి. బెల్లాన్ని కార్మికులకు ఇవ్వకుండా దొడ్డిదారిన తరలించడం, వాటిని పశువు లకు పెట్టామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మంచినీటి సరఫరా స్టోర్‌ది అయితే ఏళ్ల తరబడి లెక్కలే లేవు. ప్రతియేడు మంచినీటి సరఫరా విభాగంలో కాంట్రాక్టర్ల ద్వారా లక్షల విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. నిర్వహణకు అవసరమైన సామగ్రి స్టోర్‌లలో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. వీటితో పాటు పైప్‌లు, వాల్వ్‌లు, ఇతర మెటీరియల్ స్టోర్‌లలో ఉంటుంది. స్టోర్ ఇన్‌చార్జిలు, అధికారులు, స్టాక్ రిజిష్టర్లు, చార్జి సర్టిఫికెట్లు వంటి నిబంధనలు అమలైన పరిస్థితి లేదు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి తెప్పించిన పైపులు, కవర్లకు సంబంధించి లెక్కలే లేవు. ఈ మెటీయల్ తెచ్చిన కాంట్రాక్టర్లే మళ్లీ తమ అవసరాల కోసం తరలించుకుపోయారనే విమర్శ లున్నాయి. గతంలో స్ర్కాప్ విషయంలో నలుగురు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పుడు పోలీస్ విచారణను ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్ విచారణలో ఇప్పటికే చర్యలకు నివేదించింది. ఈ పరిస్థితుల్లో స్టోర్‌ల వ్యవస్థకు బాధ్యులను పెట్టి గాడిలో పెట్టకపోతే మరిన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.