యాసంగిలోనూ పెరిగిన సన్నాలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:24 AM
సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుం డడంతో యాసంగి సీజన్‌లో కూడా సన్నరకం వరి సాగు పెరిగింది. 40 శాతం వరకు సన్న రకం వరి పంటను రైతులు సాగు చేశారు. ఈ సీజన్‌లో పం డించిన సన్న రకం పంట సొంత అవసరాలు, బయట మార్కెట్లకు తరలించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

- క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌తో ముందుకు
- కేంద్రాలకు లక్షా 50 వేల టన్నులు రావొచ్చని అంచనా
- గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 80 శాతం సన్నాల సాగు
- రైతులకు రూ. 101.50 కోట్ల బోనస్
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుం డడంతో యాసంగి సీజన్‌లో కూడా సన్నరకం వరి సాగు పెరిగింది. 40 శాతం వరకు సన్న రకం వరి పంటను రైతులు సాగు చేశారు. ఈ సీజన్‌లో పం డించిన సన్న రకం పంట సొంత అవసరాలు, బయట మార్కెట్లకు తరలించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో సాగు ఇలా...
జిల్లాలో వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద ఈ సీజన్‌లో 1,98,435 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో విత్తనోత్పత్తి కోసం 30,624 ఎకరాల్లో సాగు చేశారు. వీటి ద్వారా వచ్చే పంటను రైతులు ఒప్పందం చేసుకున్న ఆయా విత్తన కంపెనీలకే విక్రయిస్తారు. ఇందులో దొడ్డు, సన్న రకాలతో పాటు ఆడ, మగ వరి పంటను సాగు చేశారు. విత్తనోత్పత్తికి పోనూ, దొడ్డు రకం 92,296 ఎకరాలు, సన్న రకం 75,515 ఎకరాల్లో సాగు చేశారు. దొడ్డు రకం పంట ద్వారా 2,58,428 మెట్రిక్ టన్నులు, సన్న రకం పంట ద్వారా 1,79,347 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కొందరు రైతులు మిల్లర్లు, ఇతర వ్యాపారులకు దొడ్డు రకం పచ్చి వడ్లను విక్రయిస్తున్నారు. పంట కోసిన వెంటనే ఆ ధాన్యాన్ని వ్యాపారులు క్వింటాలుకు 2 వేల నుంచి 2,050 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దొడ్డు రకం ధాన్యం తక్కువ రావచ్చని తెలుస్తున్నది. సన్న రకం ధాన్యం 90 శాతం వరకు కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయి. సాధార ణంగా మెజారిటీ రైతులు సన్నరకం ఎక్కువగా వానాకా లం సీజన్‌లో సాగు చేస్తారు. కొంత ధాన్యాన్ని రైతులు తమ అవసరాలకు పక్కన పెట్టి మిగతా ధాన్యాన్ని మార్కెట్‌లో విక్రయిస్తారు. యాసంగి సీజన్‌లో పం డించే ధాన్యంలో నూక అవుతుండడంతో డిమాండ్ ఉండదు. దీంతో 10 శాతం కూడా సన్న రకం ధాన్యాన్ని సాగు చేయరు.
ఫ రూ. 500 బోనస్‌తో పెరిగిన సాగు..
రేషన్ వినియోగదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సన్నాలు సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నది. మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో గడిచిన వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం 2,09,567 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో రికార్డు స్థాయిలో సన్న రకం పంట 1,72,879 ఎకరాల్లో సాగు చేశారు. దొడ్డు రకం పంట 36,688 ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు 2,03,013 టన్నుల సన్నరకం ధాన్యాన్ని, 63,268 టన్నుల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 101 కోట్ల 50 లక్షల 65 వేల రూపాయల బోనస్ రైతులకు వచ్చింది. ఈ సీజన్‌లో కూడా రైతులు కనీసం లక్షా 50 వేల టన్నుల ధాన్యాన్ని విక్రయించినా 75 కోట్ల రూపాయల వరకు బోనస్ పొందే అవకాశాలున్నాయి. సన్నరకం సాగు చేసేందుకు ప్రభుత్వం బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తుండడంతో చాలా మంది రైతులు జిల్లాలో సన్నాలు సాగు చేస్తున్నారు. సన్నాల సాగు వల్ల వ్యవసాయం చేసే పట్టాదారు రైతులకే కాకుండా కౌలుదారులకు కూడా లాభం జరుగుతున్నది.