Share News

ముగిసిన సంగ్రామం

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:57 AM

పంచాయతీ సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. గత నెల 25న ఎన్నికల షెడ్యూల్‌ జారీతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు దశల్లో జరిగిన ఎన్నికలు 22 రోజులపాటు గ్రామాల్లో సందడి నింపింది. జిల్లాలో బుధవారం జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలు కూడా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ముగిసిన సంగ్రామం

- మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

- తుది విడత ఎన్నికల్లో 79.16 శాతం ఓటింగ్‌

- జిల్లాలో 260 సర్పంచ్‌, 2268 వార్డుల ఎన్నికల ప్రక్రియ పూర్తి

- 27 పంచాయతీలు..668 వార్డు ఏకగ్రీవం

- పల్లె ఓటర్లు మొత్తం 3.41 లక్షలు.. పోలైన ఓట్లు 2.76 లక్షలు

- 65199 మంది ఓటర్లు ఎన్నికలకు దూరం

- ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

- బందోబస్తుపై నిరంతరం పరిశీలనలో ఎస్పీ మహేష్‌ బి గితే

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. గత నెల 25న ఎన్నికల షెడ్యూల్‌ జారీతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు దశల్లో జరిగిన ఎన్నికలు 22 రోజులపాటు గ్రామాల్లో సందడి నింపింది. జిల్లాలో బుధవారం జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలు కూడా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొదటి విడతలో రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో 85 పంచాయతీలు,748 వార్డులు, రెండో విడతలో బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో 88 పంచాయతీలు, 758 వార్డులు, మూడో విడతలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లో 87 పంచాయతీలు, 762 వార్డులకు ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో 27 సర్పంచ్‌, 668 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 233 సర్పంచ్‌, 1597 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానాల్లో 953 మంది, వార్డు స్థానాల్లో 4,245 మంది పోటీ పడ్డారు. తమ భవితవ్యం తేల్చుకోవడానికి ప్రచారాన్ని హోరెత్తించారు. బుధవారం చివరి మూడో విడత ఎన్నికల్లో 79.16 శాతం ఓటింగ్‌ జరిగింది. మొదటి విడతలో 79.57 శాతం, రెండో విడతలో 84.42 శాతం ఓటింగ్‌ జరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ గరీమ అగర్వాల్‌, బందోబస్తును జిల్లా ఎస్పీ మహేష్‌ బి గీతేలు నిరంతరం పర్యవేక్షించారు. ఎన్నికల్లో ప్రతి విడతలో ఎన్నికల సిబ్బంది రెండు వేలకు పైగా, బందోబస్తులో 730 మందికి పైగా పోలీసులు ఉన్నారు.

జిల్లాలో ఓటేసిన 2.76 లక్షల మంది ఓటర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 లక్షల 53 వేల 351 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,70,772 మంది, మహిళలు 1,82,559 మంది ఉన్నారు. వీరిలో ఏకగ్రీవ పంచాయతీలు మినహాయిస్తే 3,41,377 మంది మిగిలారు. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2,76,178 మంది ఓట్లు వేశారు. ఇందులో పురుషులు 1,27,463 మంది, మహిళలు 1,48,704 మంది ఉన్నారు. మొదటి విడతలో 1,11,148 ఓటర్లు ఉండగా, 88,442 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 39,693 మంది, 48,739 మంది ఉన్నారు. రెండో విడతలో 1,04,905 మంది ఓటర్లు ఉండగా, 88,553 మంది ఓటు వేశారు. ఇందులో పురుషులు 42,023 మంది, మహిళలు 46,529 మంది ఉన్నారు. మూడో విడతలో 1,25,324 మంది ఉండగా 99,183 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషుల 45,747 మంది, మహిళలు 53,436 మంది ఉన్నారు. 65,199 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.

ఓటింగ్‌లో మహిళలే అధికం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మహిళ ఓటర్లే చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 3,41,377 మంది ఓటర్లు ఉండగా ఇందులో 2,76,178 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 1,48,704 మంది పురుషులు, 1,48,704 మంది మహిళలు ఉన్నారు. ఇందులో అధికంగా 21,241 మంది మహిళలు ఓటు వేశారు. మొదటి విడత లో 9,046 మంది, రెండో విడతలో 4,506 మంది, మూడవ విడతలో 7,689 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు.

పల్లె ఎన్నికలపై నిరంతరం నిఘా

జిల్లాలో ముగిసిన పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా భారీ పోలీసు బందోబస్తుతో నిరంతరం నిఘా ఉంచారు. జిల్లాలోని 260 పంచాయతీల్లో ముందుగానే 160 సాధారణ పంచాయతీలు, 49 సున్నిత పంచాయతీలు, 53 సమస్యాత్మక పంచాయతీలుగా గుర్తించి బందోబస్తు నిర్వహించారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌, కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు 730 మంది పోలీసులతో పాటు 33 రూట్‌ మొబైల్‌ బృందాలు, ఏడు జోనల్‌ బృందాలు, మూడు క్విక్‌ రియాక్షన్‌ బృందాలు, రెండు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు ఇతర పోలీసులు పని చేశారు. ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేసే దిశలో జిల్లాలో రూ 23.28 లక్షల నగదు, 93 కేసుల్లో 1,523 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌ చేశారు. 224 కేసుల్లో 782 మందిని బైండోవర్‌ చేశారు. నిరంతరం పల్లెల్లో నిఘాను పెంచి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే విధంగా చర్యలు చేపట్టారు.

ప్రలోభాల జాతర..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రలోభాల జాతర నడిపించారు. జిల్లాలో 260 పంచాయతీల్లో 27ఏకగ్రీవంతో 233 సర్పంచ్‌ స్థానాలకు 953 మంది. 2,268 వార్డులో 671 మంది ఏక గ్రీవం కాగా 1,597 వార్డులకు 4,245 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి రూ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. వార్డు సభ్యులు సైతం రూ 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో ప్రతిరోజు మద్యం, విందు దావతులు కొనసాగించారు, పోలింగ్‌ జరుగుతున్నంత వరకు ఓటుకు నోటుగా రూ 2 వేల నుంచి రూ3 వేల వరకు పంపిణీ చేశారు. ప్రతిరోజు మటన్‌, చికెన్‌, మహిళలకు కూల్‌ డ్రింక్స్‌, పురుషులకు మద్యం అందించారు. గ్రామాల నుంచి ఉపాధి, ఉద్యోగం, చదువులరీత్యా ముంబాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఉన్నవారిని రప్పించడానికి రవాణా ఖర్చులు భరించారు. దీంతో పాటు వారి సెలవుల వల్ల నష్టాన్ని కూడా భరిస్తూ రప్పించారు.

జిల్లాలో మూడుదశల్లో పోలైన ఓట్ల వివరాలు

మొదటి విడతలో..

మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు శాతం

చందుర్తి 28,094 21,823 9,544 12,279 77.68

కోనరావుపేట 34,641 28,420 13,099 15,321 82.04

రుద్రంగి 11,096 7,987 3,230 4,757 71.98

వేములవాడ 18,492 14,687 6,855 7,822 79.42

వేములవాడ రూరల్‌ 18,825 15,525 6,965 8,560 82.47

----------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 1,11,148 88,442 39,693 48,739 79.57

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------

రెండో విడతలో

మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు శాతం

బోయిన్‌పల్లి 30,505 25,858 12,200 13,658 84.77

ఇల్లంతకుంట 35,932 30,584 14,604 15,980 85.47

తంగళ్లపల్లి 38,468 32,111 15,219 16,891 83.47

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 1,04,905 88,553 42,023 46,529 84.42

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మూడో విడతలో

మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు శాతం

గంబీరావుపేట 36,135 28,816 1,3142 15,674 79.75

ముస్తాబాద్‌ 3,7711 30,434 1,4379 15,980 80.70

వీర్నపల్లి 11,066 9,065 4,208 16,891 8192

ఎల్లారెడ్డిపేట 40,412 30,868 14,018 16,850 76.38

------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 1,25,324 99,183 45,747 53,436 79.16

------------------------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 18 , 2025 | 01:57 AM