పల్లె ఓటరు జాబితా రెడీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:24 AM
ఏ క్షణంలో ‘పల్లె’పోరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. ఎన్నికల నిర్వహణకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. సెప్టెంబరు 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఏ క్షణంలో ‘పల్లె’పోరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. ఎన్నికల నిర్వహణకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. సెప్టెంబరు 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా కొత్త ఓటర్ జాబితాను రూపొందించారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా, ఒక్కొక్క గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. దీంతోపాటు గ్రామంలోని ఓటర్లను వార్డుల వారీగా విభజించారు. ఒక వార్డులో ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లు ఒక చోట ఉండే విధంగా వార్డు జాబితాలు తయారు చేశారు. టీ-పోల్ పోర్టల్‌లో జాబితాలను అప్‌లోడ్ చేశారు. ఎన్నికల కమిషన్ పబ్లిషింగ్ చేయడానికి జిల్లాలోని పంచాయతీ అధికారులు జాబితాలను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
ఫ జిల్లాలో 260 సర్పంచ్‌లు, 2268 వార్డు స్థానాలకు ఎన్నికలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 260 సర్పంచ్, 2268 వార్డు మెంబరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఓటరు జాబితాలు సిద్ధం చేయగా, అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తిచేశారు. 2268 గ్రామపంచాయతీలో ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. సర్పంచ్ ఎన్నికలకు పెద్ద బాక్సులు, వార్డు సభ్యులకు చిన్న బ్యాలెట్ బాక్సులు జిల్లాకు వచ్చాయి. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. 2268 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉన్నవరకు 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్న పంచాయతీల్లో 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతకుమించి ఓటర్లు ఉంటే రెండవ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉంటే ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమిస్తారు. ప్రస్తుతం తయారైన ఓటర్ జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. గతంలో ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 260 గ్రామపంచాయతీల పరిధిలో 3 లక్షల 46 వేల 259 ఓటర్లు ఉన్నట్లు గతంలో లెక్కతేల్చారు. ఇందులో పురుషులు 1,67,686 మంది, మహిళలు 1,78,553 మంది ఓటర్లు ఉన్నారు. 20 మంది జెండర్ ఓట్లు ఉన్నాయి. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ఈసారి 33 వేల 765 ఓటర్లు పెరిగారు. గత ఎన్నికల్లో 312,494 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,52,942 మంది ఉండగా ఈసారి 14,744 మంది పెరిగారు. మహిళలు గత ఎన్నికల్లో 1,59,535 ఉండగా ఈసారి 19,018 మంది పెరిగారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం 3,46,259 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలే 1,78,553 మంది ఉన్నారు. పురుషులు 1,67,686 మంది ఉన్నారు. మహిళలే అధికంగా 10,867 మంది ఉన్నారు.
ఫ రిజర్వేషన్లపైనే ఆసక్తి..
హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో జిల్లాలోని ఆశావహులు రిజర్వేషన్లపైనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 42శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావించిన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా పల్లెల్లో పట్టు సాధించే దిశగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలోకి చెందిన ఆశావహులు పల్లెబాట పట్టారు. తమ మద్దతుదారులను అప్రమత్తం చేస్తున్నారు. పోటీల్లో ఉంటున్నట్లుగా ఆశావహులు మద్దతు కూడగట్టుకోవడంతో పల్లెలు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయించారు. సర్పంచ్‌లకు సంబంధించి ఫింక్ కలర్ బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.