Share News

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం నిర్వీర్యం....

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:05 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం నిర్వీర్యమైందని టీపీసీసీ సమన్వయకర్త మహమ్మద్‌ ఖాజా ఫక్రుద్దీన్‌ అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జిలుగా నియమితులైన ఖాజా ఫక్రుద్దీన్‌, ఆడమ్‌రాజ్‌ మొదటిసారి మంగళవారం డీసీసీ కార్యాలయానికి వచ్చారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం నిర్వీర్యం....

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం నిర్వీర్యమైందని టీపీసీసీ సమన్వయకర్త మహమ్మద్‌ ఖాజా ఫక్రుద్దీన్‌ అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జిలుగా నియమితులైన ఖాజా ఫక్రుద్దీన్‌, ఆడమ్‌రాజ్‌ మొదటిసారి మంగళవారం డీసీసీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్‌ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖాజా ఫక్రుద్దీన్‌ మాట్లాడుతూ 4న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామన్నారు. టీపీసీసీ సమన్వయకర్త ఆడమ్‌ రాజ్‌ మాట్లాడుతూ కులగణన విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు. హైదరాబాద్‌ సభకు పెద్దఎత్తున కాంగ్రెస్‌శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులతో 4న నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు, సుడాచైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌తోపాటు జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి జులై 4న ఎల్‌బీ స్టేడియంలో జరుగనున్న సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ శవాలపై ప్యాలాలు ఎరుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిందన్నారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాంరెడ్డి, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజ్‌హుస్సేన్‌, బెజ్జంకి మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్‌, బెజ్జంకి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పులి కృష్ణ, మోహనాచారి, వెన్న రాజమల్లయ్య పాల్గొన్నారు.

ఫ ఇందిరమ్మ కమిటీలెక్కడ?

ఇందిరమ్మ కమిటీల ఏర్పా చేయకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ విలేకరులు ప్రశ్నించగా ఇన్‌చార్జి మంత్రి అనారోగ్యం, మరిన్ని కారణాలతో జాప్యం జరిగిందని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇందిరమ్మ కమిటీల కోసం రెండు జాబితాలు ఇన్‌చార్జి మంత్రి వద్దకు చేరిన విషయం నిజమేనన్నారు. ఇంటిరమ్మ కమిటీల ఏర్పాటుపై కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు కొందరు వేదిక కింద నుంచి ప్రశ్నించగా వారిని నాయకులు అడ్డుకున్నారు. ముందుగా కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి నియామకం చేయాలంటూ కొందరు నినాదాలు చేశారు. విలేకరుల సమావేశం అనంతరం బహిరంగ సభ సన్నాహక సమావేశంలోనూ కొందరు కాంగ్రెస్‌పార్టీ గ్రామ, మండల నాయకులు ఈ రెండు అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించగా సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సన్నాహక సమావేశంలో కేవలం సభకు సంబందించినదని, ఇతర విషయాలు లేవనెతొద్దని సూచించారు.

ఫ ప్రతి ఒక్కరూ భాద్యతగా సభకు తరలిరావాలి...

హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ స్టేడియంలో జులై 4న జరిగే సభకు ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త బాధ్యతగా తరలిరావాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్‌ ఖాజాఫక్రుద్దీన్‌, ఆడమ్‌రాజ్‌ అన్నారు. సభ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:05 AM