కూరలు కుతకుత..
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:07 AM
కార్తీక మాసంలో కూరగాయల సహజంగా పెరుగుదల కనిపిస్తుంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కార్తీక మాసంలో కూరగాయల సహజంగా పెరుగుదల కనిపిస్తుంది. దీనికి మొంథా తఫాన్ తోడు కావడంతో పది రోజుల్లోనే కూరగాయల ధరలు మూడింతల పెరిగాయి. కోడిమాంసం ధర తగ్గుతూ పెరుగుతుండగా, గుడ్డు ధర మాత్రం పెరిగింది. దీంతో కూరగాయలు కొనుగోలు చేయడానికి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ 80 నుంచి రూ 200 వరకు ధర పలుకుతోంది. మొంథా తుఫాను ప్రభావంతో కూరగాయల పంటలు దెబ్బతిని ధరలు పెరుగుదలకు తోడుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు పప్పుదినుసులతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి బోయిన్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, మండలాలతో పాటు సిద్ధిపేట, జిల్లాల నుంచి కూరగాయలు అమ్మకానికి రైతులు తీసుకవస్తారు. దీనితో పాటు ఆంధ్రాలోని అనంతపూర్, కర్నూల్, మహారాష్ట్రలోని లాతురూ, నాందేడు, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూరగాయల దిగమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు.
ధరల పెరుగుదలతో అదనపు భారం..
జిల్లాలో కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలకు అదనపు భారంగా మారింది. ఒక కుటుంబానికి అదనంగా వెయ్యి రూపాయలపైనే భారం పడుతుంది. ఈ ఏడాది విభిన్నమైన వాతావరణ పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు సరిగా పడకపోవడంతో కూరగాయల పంటలు ఎండిపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. తర్వాత ఆగస్టు మూడో వారం నుంచి తరచూ అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడడంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరులోను భారీగా వర్షాలు పడగా అక్టోబరులో మొంథా తుఫాన్ కూరగాయల రైతులను మరింత కుంగదీసింది. కూరగాయల చేలల్లో ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉండడంతో మొక్కలు చనిపోయి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. పది రోజుల్లోనే కూరగాయల ధరలు ఒక్కసారిగా మూడింతలు పెరిగాయి వారం రోజుల క్రితం కిలో రూ 20 ఉన్న టమాటా రూ40కి చేరింది. పచ్చిమిర్చి కిలో రూ80 ధర పలుకుతోంది. సొరకాయలు ఒకటి 40నుంచి రూ50 వరకు అమ్ముతున్నారు. ఆకుకూరల ధరలు మరింత పెరిగింది. పాలకూర కిలో రూ200 నుంచి రూ 250. మెంతికూర రూ 200, కొత్తిమీర రూ 150 ఇతర అన్ని ఆకుకూరలు రూ 100 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. చిక్కుడుకాయ రూ 100, గోరు చిక్కుడు రూ 150, బీరకాయ రూ 120, కాకర రూ 80, దొండకాయ రూ 80, క్యారెట్ రూ 100, అలసంద రూ80, మునగకాయలు రూ 200, కాలీఫ్లవర్ రూ 80, వంకాయలు రూ 100, ఉల్లిగడ్డ రూ 40, బెండకాయలు రూ 80 బీట్రూట్ రూ 80 చేరుకుంది. కార్తీక మాసం కావడంతో ప్రతి ఇంట్లోనూ రోజూ పూజా కార్యక్రమాలతో పాటు కూరగాయల వంటలు చేసుకుంటారు. కార్తీకమాసం ఈనెల 19 వరకు ఉండడంతో కూరగాయల ధరలు ఇలాగే కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
వ్యాపారులకు ఇబ్బంది...
కూరగాయల ధరలు పెరగడంతో సిరిసిల్ల మార్కెట్‌లో వ్యాపారాలు తగ్గిపోయి చిరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. హోల్‌సేల్ వ్యాపారుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి అమ్ముకునే వ్యాపారులు ధరలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు జరగడం లేదని ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూరగాయల అమ్మకాలను కూడా తగ్గించుకోవాల్సి వస్తుందని పలువురు వ్యాపారులు తెలిపారు.
కోడిగుడ్డు మరింత ప్రియం
పేద కుటుంబాలు సైతం కోడిగుడ్డు కూరతో సరిపెట్టుకుంటారు. పదిహేను రోజులుగా కొడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కార్తీక మాసంలో పూజల కారణంగా కొడిగుడ్డు ధర రూ 5 వరకే ఉండగా ప్రస్థుతం రూ 7 వరకు పెరిగింది. చలి కాలంలో ఇదే ధర ఉండే అవకాశం ఉంది. చికెన్ ధర కూడా పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం కిలో రూ 220 ఉంది. ధరల పెరుగుదలతో సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
తుఫాన్‌తోనే దిగుబడి పడిపోయింది..
- కూరపాటి శ్రీశైలం, అధ్యక్షుడు హోల్‌సెల్ కూరగాయల వ్యాపారుల సంఘం, సిరిసిల్ల
తుఫాన్ ప్రభావంతో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెప్పిస్తున్నాము. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల రావడంతో రవాణా చార్జీల భారం కూడా పడుతుంది. దీంతోపాటు కార్తీక మాసం కావడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. మరో 10 రోజులపాటు కూరగాయల ధరలు పెరుగుదల ఉండే అవకాశం ఉంది.