Share News

ఆగని ‘రేషన్‌’ దందా..

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:21 AM

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ దందా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగడం లేదు.

ఆగని ‘రేషన్‌’ దందా..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ దందా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగడం లేదు. గతంలో దొడ్డు బియ్యం చాలామంది వినియోగించుకోకుండా అమ్ముకోవడం, మిల్లర్లు రీసైక్లింగ్‌ చేయడం వంటి అక్రమాలు జరిగేవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేపట్టింది. వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈసారి జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను అందించాలని ఆదేశించింది. దాని ప్రకారం జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్‌ సన్న బియ్యం పంపిణీ విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలో 177851 కార్డుదారులకు 9859.786 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశారు ఒక్కో లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోల బియ్యం ఇచ్చారు. దాదాపుగా ఒక్కో కుటుంబాలు నలుగురు ఉంటే 72 కిలోలు, ఆరుగురు ఉంటే 108 కిలోల వరకు సన్న బియ్యం వచ్చాయి. దీంతోపాటు మే నెలలో ఇచ్చిన సన్న బియ్యం కూడా పేదల ఇళ్లల్లో మిగులుగానే ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు సన్న బియ్యాన్ని కూడా దొడ్డు బియ్యం మాదిరిగానే అమ్మేస్తున్నారు. జిల్లాలో బియ్యం పంపిణీ జరుగుతుండగానే గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సన్న బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో సన్న బియ్యం పంపిణీ చేసిన అక్రమాలు యథావిధిగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఇంటింటికి తిరుగుతూ..

జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పూర్తికావడంతో దళారులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం కిలో రూ 8 నుంచి రూ 10 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం సన్నబియ్యం రూ 18 నుంచి రూ 20 వరకు చెల్లించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. లబ్ధిదారులతో వ్యాపారులు బేరసారాలు ఆడుతూ కొనుగోల్లు సాగిసున్నారు. సన్న బియ్యం అమ్మకాలపై నిఘా పెట్టి దళారులను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకుంటున్న జిల్లాలో అక్రమ దందా మాత్రం ఆపలేకపోతున్నారు.

డీలర్లు గప్‌చుప్‌గా..

జిల్లాలో కొందరు రేషన్‌ డీలర్లు సన్న బియ్యం వ్యాపారం గప్‌చుప్‌గా నడిపించారని తెలుస్తోంది. కార్డుదారులు వేలిముద్ర వేస్తే బియ్యంకు బదులుగా నగదు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌ డీలర్లు వేలిముద్ర వేసిన లబ్ధిదారులకు కిలో రూ 18 వరకు చెల్లించారు. సన్న బియ్యం కూడా మళ్లీ పొరుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. కొందరు వ్యాపారులు మిల్లర్ల ద్వారా రేషన్‌ బియ్యం సేకరించి తిరిగి ప్రభుత్వానికి అమ్మకానికి సిద్ధమయ్యారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం రూ 40 నుంచి రూ 50 వరకు ధర పలుకుతోంది. రేషన్‌ బియ్యం కొనుగోలు అక్రమార్కులకు లాభదాయకంగా మారిందని చెప్పుకుంటున్నారు.

జిల్లాలో 177851 రేషన్‌ కార్డులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 345 రేషన్‌ దుకాణాలు ఉండగా, 177851 రేషన్‌ కార్డులు, 535920 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డులు 13748, ఆహార భద్రత కార్డులు 163900, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారులు 535920 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ లబ్ధిదారులు 37389 మంది, ఆహార భద్రత లబ్ధిదారులు 498324 మంది, అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు 207మంది ఉన్నారు. వీరికి మూడు నెలల కోటా 9859.786 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు.

Updated Date - Jul 07 , 2025 | 02:21 AM