నెరవేరని సొంతింటి కల
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:37 AM
పేద వారి సొంతింటి కల కలగానే మిగులుతోంది. ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని, స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేనివారికి ఐదు లక్షలను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కరీంనగర్ టౌన, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పేద వారి సొంతింటి కల కలగానే మిగులుతోంది. ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని, స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేనివారికి ఐదు లక్షలను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో వేలాది మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరు కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేవారిని ఎల్-1, అసలు స్థలం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎల్-2 కేటగిరీగా విభజించారు. ఇంటి స్థలం లేని పేదలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 28 వేల మంది ఎల్-2 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయలేదు. ఈ కేటగిరీలో లబ్ధిదారులకు ఇచ్చేందుకు పద్మనగర్‌లో 660 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఇళ్లను ఎప్పడు కేటాయిస్తారోనని దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు.
ఫ ఆంక్షలు, నిబంధనలతో ఇబ్బందులు
ఎల్-1 కేటగిరీలో ఇంటి స్థలం ఉండి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తే ఇళ్లు నిర్మించుకునేందకు ఆనలైనలో అనేక మంది దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. ఎల్-1 కేటగిరిలో 1,700 మందికి ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, కార్పొరేషన పరిధిలో 1,700 ఇళ్లు మంజూరయ్యాయి. నిబంధనల మేరకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటి వరకు 1,510 మందికి ఐదు లక్షలను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్‌ను జారీ చేశారు. పెరుగుతున్న ఇంటి నిర్మాణ వ్యయం అనుగుణంగా ఐదు లక్షల రూపాయలు సరిపోవడం లేదు. ఇళ్ల నిర్మాణాలకు అనేక ఆంక్షలు, నిబంధనలు పెడుతున్నారు. దీంతో 110 మంది దరఖాస్తుదారులు మాకు ఈ ఇళ్లు వద్దంటూ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరించారు. 1,391 మంది ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించగా కొందరు డబ్బులు, నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకోలేక ఇబ్బందిపడుతున్నారు. తిరస్కరణకు గురైన 110తోపాటు మరో 200 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్థలం ఉండి ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే వారు ఇంటి నిర్మాణ ఏరియా 400 ఎస్‌ఎఫ్‌టీకి తక్కువ కాకుండా 600 ఎస్‌ఎఫ్‌టీకి మించకుండా నిర్మించుకోవలసి ఉంటుంది. ఇంటి చుట్టూ రెండు ఫీట్ల కంటే ఎక్కువ స్లాబ్ వేయరాదు. ముందు వైపు ఆరు ఫీట్ల వరకు మాత్రమే స్లాబ్ ఉండాలి. స్లాబ్‌పైన పిల్లర్లు నిర్మించవద్దు. మెట్ల నిర్మాణం కూడా ఇంతే ఉండాలంటూ ఆంక్షలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం పెంచాలని, నిబంధనలు సడలించాలని, స్థలం లేని వారికి వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.