Share News

ఉపాధ్యాయుల పర్యవేక్షణకు రంగం సిద్ధం

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:07 AM

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

ఉపాధ్యాయుల పర్యవేక్షణకు రంగం సిద్ధం

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదేళ్ల సీనియార్టీ ఉన్న ఉపాధ్యాయులతో పర్యవేక్షణ కమిటీలను వేసి పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతలను ఆ ఉపాధ్యాయ బృందాలకు అప్పగించాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో జిల్లాలో 8 కమిటీలను వేయాలని నిర్ణయించిన జిల్లా విద్యాశాఖ ఆ మేరకు అవసరమయ్యే టీచర్ల ఎంపిక కోసం ఔత్సాహిక అనుభవం కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలోని 149 ఉన్నత పాఠశాలలు, 23 కేజీవీబీ, మోడల్‌ స్కూల్స్‌, 76 ప్రాథమికోన్నత పాఠశాలలు, 426 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ కోసం 8 కమిటీలను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు మూడు కమిటీలను, ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీకి ఒక కమిటీ, 426 ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణకు నాలుగు కమిటీలను వేయాలని నిర్ణయించారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నోడల్‌ ఆఫీసర్స్‌గా ఏడు సబ్జెక్టు టీచర్లతో మూడు కమిటీలు అంటే మొత్తం 27మందితో కూడిన మూడు పర్యవేక్షణ కమిటీలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్‌, ఒక ఎల్‌ఎఫ్‌ఎం హెచ్‌ఎం, ఎస్‌జీటీలతో ముగ్గురు సభ్యుల కమిటీ, ప్రాథమిక పాఠశాలలకు పిహెచ్‌ హెచ్‌ఎం నోడల్‌ అధికారిగా, ఇద్దరు ఎస్‌జీటీలు సభ్యులుగా ఉండే విధంగా ఈ కమిటీలను రూపొందించాల్సి ఉంది. అయితే హైస్కూల్‌ పర్యవేక్షణ బృందాలకు మ్యాథ్స్‌ టీచర్లు ముగ్గురు అవసరం కాగా ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, సోషల్‌ సబ్జెక్టులో ముగ్గురుకి బదులుగా నలుగురు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సర్వశిక్ష అభియాన్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. 10 సంవత్సరాల అనుభవం, ఆర్‌పీగా, ఎమ్మార్పీగా సేవలందించిన, రిసోర్సుపర్సన్‌గా, కంప్యూటర్‌ నాలెడ్జి, రైటింగ్‌ స్కిల్స్‌ వంటివి పరిశీలించి పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా నియమిస్తారని చెబుతున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ కమిటీ నియామక ప్రక్రియను పూర్తిచేసి 42 మంది సభ్యులకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, ఇంకా పర్యవేక్షణ కమిటీ సభ్యులకు బోధనేతర బాధ్యతలను అప్పగించడంతో విద్యాబోధనపై ప్రభావం పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు కమిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కమిటీల పర్యవేక్షణలో విద్యాబోధనతో పాటు వసతుల కల్పనపై దృష్టిసారించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నది.

Updated Date - Oct 24 , 2025 | 01:07 AM