Share News

రామగుండానికి ఆధ్యాత్మిక శోభ

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:03 AM

రామగుండం నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది.

రామగుండానికి ఆధ్యాత్మిక శోభ

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది. ఇప్పటికే చారిత్రాత్మక రాముని గుండాలు, పురాతన త్రిలింగ రాజరాజేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. వీటితోపాటు గోదావరి తీరంలోని సమ్మక్క-సారలమ్మ జాతర మేడారం తరువాత అతిపెద్ద జాతరగా వెలుగొందుతోంది. రామగుండం ప్రాంతంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చర్యలు చేపట్టారు. రామునిగుండాల సమీపంలో ఆంజనేయస్వామి పురాతన విగ్రహాలు బయటపడడంతో అదే గుట్టపై సుమారు రూ.20కోట్ల నిధులతో పంచముఖ హనుమాన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 54అడుగులు ఫౌండేషన్‌, 108అడుగుల ఎత్తుతో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు కానున్నది. ఫౌండేషనే మూడు అంతస్థుల్లో జరుగనున్నది. 5000అడుగుల వైశాల్యంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌, రెండవ ఫ్లోర్‌లో 15అడుగుల 8హనుమాన్‌ విగ్రహాలు, 3వ ఫ్లోర్‌లో 11అడుగుల పుష్పం, 4వ ఫ్లోర్‌ నుంచి 108అడుగుల పంచముఖ హనుమాన్‌ విగ్రహ నిర్మాణం జరుగనున్నది. ఇప్పటికే గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి రెండు అంతస్థుల నిర్మాణం పూర్తయ్యింది. ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా దక్షిణ భారతదేశంలో రామగుండంకు ఆధ్యాత్మికంగా గుర్తింపు లభించనుంది. చారిత్రక రామునిగుండాలను మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా చేస్తున్నారు. ఇక గోదావరితీరంలోని సమ్మక్క- సారలమ్మ జాతర ప్రాంగణంలో సుందిళ్ల బ్యారేజీలో ముంపునకు గురి అవుతుండడంతో సుమారు రూ.6కోట్ల వ్యయంతో పునర్‌ నిర్మాణ పనులు చేపట్టారు. సింగరేణి సంస్థ రూ.3కోట్లు, ఎన్‌టీపీసీ రూ.57లక్షలు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ రూ.35లక్షల నిధులు కేటాయించింది. జాతర ప్రాంగణంలో మొత్తం మట్టితో ఎత్తు పెంచడం, గద్దెల ఎత్తు పెంచడం, రాజీవ్‌ రహదారి నుంచి గద్దెల వరకు రోడ్డును అభివృద్ధి చేయడం, ప్రత్యేక గదుల నిర్మాణాలు చేపట్టారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో జరుగనున్న జాతరకు ముందే అన్ని వసతులు కల్పించేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా గోదావరి ఖనిలోని కోదండరామాలయం అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. రూ.50లక్షలతో గాలిగోపురం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మెయిన్‌ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయానికి సుమారు రూ.40లక్షలు, రామగుండం పట్టణంలోని రామాలయంలో మండప నిర్మాణానికి రూ.25 లక్షలు, రామగుండం పట్టణంలోని పోచమ్మ దేవాలయానికి రూ.25లక్షలు, బుగ్గ రామస్వామి దేవాలయానికి రూ.25లక్షలు కేటాయించారు. పురాతన జనగామ త్రిలింగరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి రూ.3కోట్లు కేటాయించారు. పురావస్తుశాఖ క్లియరెన్స్‌ ఇవ్వగానే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి దేవాలయ పనులు పూర్తిచేయడంతో పాటు రహదారులు, ఇతర నిర్మాణాలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రామగుండంలో రూ.50కోట్లతో ఆలయాల అభివృద్ధి

మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, రామగుండం ఎమ్మెల్యే

రామగుండంలో రూ.50కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. బుగ్గగుట్ట వద్ద రూ.2కోట్లతో దారి మైసమ్మ ఆలయం, రామునిగుండాలపై 108అడుగుల ఆంజనేయవిగ్రహం, రూ.6కోట్లతో దక్షిణకాశీగా పేరుపొందిన జనగామ త్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, చౌరస్తాలో పోచమ్మ ఆలయానికి రూ.1కోటి, సమ్మక్క-సారలమ్మ జాతరను మేడారంలా తలిపించే విధంగా రూ.6కోట్ల సింగరేణి నిధులతో గద్దెలతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోదండ రామాలయంలో రూ.50లక్షలతో గాలిగోపురం, పవర్‌హౌస్‌కాలనీలోని కాశీవిశ్వేశర ఆలయం లో తోరణానికి రూ.10లక్షలతో పాటు వివిధ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మరిన్ని నిధులు తీసుకువచ్చి కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్‌ లో కాలనీవాసులకు పోచమ్మ ఆలయాలను నిర్మిస్తాం.

సమ్మక్క-సారలమ్మ జాతర సమయానికి సకల సౌకర్యాలు

శ్రీనివాస్‌రెడ్డి, జాతర కమిటీ అధ్యక్షుడు

ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ప్రత్యేకదృష్టితో గోదావరి ఒడ్డున సమ్మక్క- సారలమ్మ జాతర ప్రాంగణాన్ని రూ.6కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. డిసెంబర్‌ 31నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగరేణి యాజమాన్యం పనులను వేగవంతంగా చేస్తోంది.

Updated Date - Nov 10 , 2025 | 01:03 AM