నైరుతి వచ్చేసింది..
ABN , Publish Date - May 28 , 2025 | 01:11 AM
రోహిణీ కార్తె వచ్చిందంటే ఎండ వేడికి మాడు పగిలిపోయేది. రోహిణిలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనే నానుడిని వెనక్కి నెడుతూ నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాను పలకరించాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
రోహిణీ కార్తె వచ్చిందంటే ఎండ వేడికి మాడు పగిలిపోయేది. రోహిణిలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనే నానుడిని వెనక్కి నెడుతూ నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాను పలకరించాయి. మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో కుండపోతగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. తొలకరి పలకరింపుతో జిల్లా ప్రజలకు ఊరట కలిగినా.. మెరుపులు, ఉరుములు, పిడుగులతో భయానికి గురిచేసింది. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో పశువుల కాపరి దాసరి లక్ష్మణ్(35) పిడుగుపాటుకు మృతిచెందాడు. సిరిసిల్లతో పాటు పలు గ్రామాల్లో చెట్లు నేలకూలాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురవడంతో ప్రజలు ఊరట చెందగా, రైతులు ఖరీఫ్ సాగుకు ఇబ్బంది ఉండదనే ఆశలతో ఉన్నారు. మూడు, నాలుగు రోజులుగా మోస్తరు వర్షాలు పడుతుండగా మంగళవారం భారీ వర్షం కురిసింది. మండలాల్లోని ఒర్రెలు, వాగులకు జలధార వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలో సరాసరి 57.27 మిల్లీమీటర్ల వర్షం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరాసరి 57.27 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా వేములవాడలో 102.5 మిల్లీమీటర్లు, చందుర్తిలో 81.5, కోనరావుపేటలో 72.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోయినపల్లిలో 63.0, ముస్తాబాద్‌లో 56.3, వేములవాడ రూరల్‌లో 52.8, వీర్నపల్లిలో 52.3, సిరిసిల్లలో 52.0, ఇల్లంతకుంటలో 30.5, ఎల్లారెడ్డిపేటలో 22.0, తంగళ్లపల్లిలో 21.5, రుద్రంగి 21.5, గంభీరావుపేటలో 3.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు వరుసగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.
2009లో రోహిణీ కార్తెలో...
రోహిణీ కార్తెలో ఈసారి రోళ్లు పగలకుండా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళకు ముందు వచ్చినా తెలంగాణలో మాత్రం జూన్‌లో మాత్రమే వర్షాలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా వర్షాలు కురవని పరిస్థితి ఉండేది. 2009లో రోహిణీ కార్తెలో కుండపోతగా వర్షాలు మొదలు కాగా మళ్లీ 16 సంవత్సరాల తరువాత రోహిణీ కార్తెలో వర్షాలు కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మే నెలలో జిల్లాలో 45 గరిష్ఠ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఈసారి 43 నుంచి 44 గరిష్ఠ డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వానాకాలం సాగును రైతులు ముందస్తుగానే మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
ఫ జిల్లా కేంద్రం జలమయం..
జిల్లా కేంద్రంలో కుండపోతగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. సిరిసిల్ల చేనేత చౌక్, గోపాల్‌నగర్, మార్కెట్ ఎరియా, అనంతనగర్, సంజీవయ్యనగర్, శాంతినగర్, పెద్దబజార్, బీవైనగర్, గణేష్‌నగర్, సుందరయ్యనగర్‌లాంటి లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయంగా మారాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాలిదుమారంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఫ రైతుల్లో ఇబ్బందులు..
జిల్లాలో ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు హైరానా పడ్డారు. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తికాగా 144 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 2.46 లక్షల ధాన్యం సేకరించారు. కాంటా వేయని ధాన్యం దాదాపు ఇంకా 50వేల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 28,841 మంది రైతుల నుంచి రూ 438.40 కోట్ల విలువైన 1,88,967 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సింగిల్ విండోల ద్వారా 7,003 మంది రైతుల నుంచి రూ 114.71 కోట్ల విలువైన 49,445 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 390 మంది రైతుల నుంచి రూ 6.33 కోట్ల విలువైన 2,726 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 700 మంది రైతుల నుంచి రూ 12.90 కోట్ల విలువైన 5,559 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 36,934 మంది రైతుల నుంచి రూ 572.34 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా 31,059 మంది రైతుల ఖాతాల్లో రూ 431.71 కోట్లు జమ చేశారు. వర్షాలు మొదలు కావడంతో రైతులు హైరానా పడుతున్నారు. కొనుగోళ్ల పక్రియను వేగవంతం చేయాలనే రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం మొలకెత్తి ఇబ్బందులకు గురవుతున్నారు.