Share News

తీరనున్న ఎంపీడీవోల కొరత

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:06 AM

గ్రామీణ పరిపాలనలో కీలక పాత్ర పోషించే మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) కొరత ఎట్టకేలకు తీరనుంది. ఇటీవల గ్రూప్‌-1లో ఉద్యోగం సాధించిన వారిలో ఎనిమిది మందిని జగిత్యాల జిల్లాకు కేటాయించారు.

తీరనున్న ఎంపీడీవోల కొరత

జగిత్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పరిపాలనలో కీలక పాత్ర పోషించే మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) కొరత ఎట్టకేలకు తీరనుంది. ఇటీవల గ్రూప్‌-1లో ఉద్యోగం సాధించిన వారిలో ఎనిమిది మందిని జగిత్యాల జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న వీరంతా 15 రోజుల అనంతరం వారికి కేటాయించిన మండలాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. జగిత్యాల జిల్లాకు కొత్తగా కేటాయించిన ఎంపీడీవోల్లో అంజుమ, ఇనగంటి ప్రేమ్‌సాగర్‌, చిప్ప గణేష్‌, శ్రీరాం క్రిష్ణ చైతన్య, అలువాల శ్రీకాంత్‌, మోట్కూరి సురేశ్‌, పాడి వెంకటప్రసాద్‌, సుమంత్‌ ఉన్నారు. వీరందరినీ ఆయా మండలాలకు కేటాయించారు.

ఫభర్తీ కానున్న ఖాళీలు..

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసమని గతంలో పలు మండలాల్లో పంచాయతీ అధికారులు, మండల కార్యాలయ సూపరింటెండెంట్లకు ఎంపీడీవోలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించి పాలన నెట్టుకొస్తున్నారు. ఉపాధిహామీ, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ ఇతరత్రా పనులన్నీ ఎంపీడీవోల ఆధ్వర్యంలో కొనసాగుతాయి. దీనికి తోడు సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, కమ్యూనిటీ హాల్స్‌ తదితర పనులను ఇతరత్రా పనులను ఈ అధికారులే పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఫఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పర్యవేక్షణ..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షిస్తూ తరచూ నివేదికలు పంపాల్సి ఉంటుంది. మండలాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాలను సమీక్షించాలి. కీలకమైన బాధ్యతలను నిర్వర్తించే ఈ పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా కొత్త పోస్టుల కేటాయింపుతో సమస్య దూరం కానుందని భావిస్తున్నారు.

ఫజిల్లాలో ఖాళీలు ఇలా..

జిల్లాలోని 20 మండలాల్లో కొత్తగా ఏర్పడిన భీమారం, ఎండపల్లి మండలాలకు ఇంకా ఎంపీడీవో పోస్టులు మంజూరు కాకపోవడంతో అక్కడ ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. మిగిలిన 18 మండలాల్లో 8 చోట్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇక్కడ ఇన్‌చార్జి అధికారులు పనిచేస్తున్నారు. మిగిలిన మండలాల్లో రెగ్యులర్‌ అధికారులు ఉన్నారు. జిల్లాలో వెల్గటూరు, బుగ్గారం, సారంగాపూర్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, మేడిపల్లి, పెగడపల్లి మండలాల్లో ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఫఆయా మండలాలకు కేటాయింపు

జిల్లాకు కేటాయించిన కొత్త ఎంపీడీవోలకు ఆయా మండలాలను కేటాయిస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కొత్త ఎంపీడీవోలు హైదరాబాద్‌లో శిక్షణలో ఉండడంతో నియామక పత్రాలను జడ్పీ సిబ్బందే రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి తీసుకువచ్చారు. అయితే ఇందులో ఇరువురి నియామక పత్రాలు, జాయినింగ్‌ రిపోర్టులు జడ్పీ సిబ్బంది తీసుకొని రాలేదని తెలిసింది. వారివురు ప్రస్తుతం ఇతర డిపార్ట్‌మెంట్‌లలో పని చేస్తుండడం వల్ల, సంబంధిత శాఖలో వారు రిలీవ్‌ కాకపోవడంతో తాత్కాలికంగా పత్రాలు అందనట్లు జడ్పీ వర్గాలు అంటున్నాయి. కొత్తగా ఎంపికయిన ఎంపీడీవోలు శిక్షణ పూర్తయిన అనంతరం విధుల్లో చేరనున్నారు.

కొత్త ఎంపీడీవోల రాకతో ఖాళీలు భర్తీ

-గౌతమ్‌రెడ్డి, జడ్పీ సీఈవో

జిల్లాకు ఎనిమిది మంది కొత్త ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. గ్రూప్‌-1లో ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించిన పలువురు అభ్యర్థులకు ఎంపీడీవో పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. కొత్త ఎంపీడీవోలకు మండలాల కేటాయింపు పూర్తయింది. శిక్షణ అనంతరం వారికి కేటాయించిన మండలాల్లో కొత్త ఎంపీడీవోలు బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో జిల్లాలో ఎంపీడీవోల ఖాళీల సమస్య తీరనుంది.

Updated Date - Oct 15 , 2025 | 01:06 AM