పల్లె ప్రకృతి వనాలపై ‘నిర్లక్ష్యం’ నీడ
ABN , Publish Date - May 17 , 2025 | 01:12 AM
గ్రామాల్లో జరిగే పండుగలు, సంబురాలకు వేది కగా ఉండాలని భావించి ఏర్పాటుచేసిన పల్లె ప్ర కృతివనాలు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నా యి.. ఎండిపోయిన మొక్కలు, చెట్లు, విరిగిన గేట్ల తో కళావిహీనంగా మారి పల్లెప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యాన్ని వెక్కిరిస్తు న్నాయి.
- ఎండిపోయిన చెట్లు.. పేరుకుపోయిన చెత్తాచెదారం
- రూ.3.53 కోట్లతో 267 గ్రామాల్లో ఏర్పాటు
- ఆహ్లాదం పంచని పల్లెప్రకృతి వనాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/నెట్‌వర్క్)
గ్రామాల్లో జరిగే పండుగలు, సంబురాలకు వేది కగా ఉండాలని భావించి ఏర్పాటుచేసిన పల్లె ప్ర కృతివనాలు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నా యి.. ఎండిపోయిన మొక్కలు, చెట్లు, విరిగిన గేట్ల తో కళావిహీనంగా మారి పల్లెప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యాన్ని వెక్కిరిస్తు న్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 12అనుబంధ గ్రామాలను గుర్తించి రూ.3.53కోట్లు ఖర్చుచేసి 267 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. బోయినపల్లిలో 26, చందుర్తిలో 19, ఇల్లంతకుంటలో 39, గంభీరావుపే టలో 22, కోనరావుపేటలో 28, ముస్తాబాద్‌లో 22, రుద్రంగిలో 10, తంగళ్లపల్లిలో 32, వీర్నపల్లిలో 17, వేములవాడ 17, వేములవాడరూరల్ 11, ఎల్లారెడ్డి పేటలో 24ప్రకృతి వనాలను ఏర్పాటుచేసి వాటిలో దాదాపు 5లక్షల మొక్కలు నాటారు. సీతాఫలం, జామ, నిమ్మ, అల్లనేరేడు. నేరేడువంటి పండ్ల మొ క్కలతోపాటు పూలమొక్కలను నాటారు. ప్రస్తుతం సాధారణ మొక్కలు మాత్రమే ఉన్నాయి. వర్షాకా లంలో పచ్చదనం కనిపించినా ప్రస్తుత వేసవితో నీటిని పోసేవారే లేకపోవడంతో ప్రకృతివనాలు నిర్జీవంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లోని పల్లె ప్రకృ తి వనాలపై మొదట్లో ఆసక్తి ఉన్నా ఇప్పుడు అటు వైపు వెళ్లేవారే కరువయ్యారు. ఆలనాపాలనా లేక పల్లె ప్రకృతి అధ్వానంగా మారిన తీరును ‘ఆంధ్ర జ్యోతి’ శుక్రవారం విజిట్ చేసింది. పల్లె ప్రకృతి వనాలను నిర్లక్ష్యంగా వదిలివేసిన తీరుపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
శాపంగా మారిన నిర్వహణ లోపం
ఇల్లంతకుంట : మండలంలోని పలు గ్రామాలలోని పల్లె ప్రకృతి వనాలకు నిర్వహణ లోపం శాపంగా మారింది. 33 గ్రామపంచాయతీల్లో గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశారు. రెండు సంవత్సరాలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పరిధిలో ఉండటంతో మొక్కలు బాగున్నాయి. అనంతరం గ్రామపంచాయతీ ఆధీనంలోకి పల్లె ప్రకృతి వనాలు వెళ్లాయి. పల్లెప్రకృతి వనాలను పట్టించుకోకపోవడంతో నీరు లేక ఎండిపోతున్నాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసిన అనంతరం అటువైపు చూసేవారు కరువయ్యారు. ప్రతి పల్లెప్రకృతి వనానికి దాదాపు రూ.2 లక్షల వరకు వెచ్చించారు. కొందరు గ్రామపంచాయతీ నిధులు సైతం ఖర్చుచేసి మొక్కలు కొనుగోలు చేసి తీసువచ్చి నాటారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీరు అందించి పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని కోరుతున్నారు.
పట్టింపు కరువు..
గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలో పల్లె ప్రకృతి వనాలపై పట్టింపు కరువైంది. మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో ఆకులు రాలిపోయాయి. ఎండిన మొక్కలు దర్శనమిస్తున్నాయి. పచ్చదనం జాడేలేదు. కొన్ని మొక్కలు చెట్లుగా పెరిగినా వాటికి కావాల్సిన నీరు లేక ఎదగడం లేదు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
మందు బాబులకు అడ్డాగా...
వీర్నపల్లి: మారుమూల గ్రామీణ ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ సరిగా లేక పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోయాయి. విష పురుగులు ఉంటాయని అందులోకి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రకృతి వనంలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ బాటిళ్లు, బీరు సీసాలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఎండిన మొక్కలు..
తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలంలో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండిపోయాయి. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటైన ఏడాది వరకు నిర్వహణ బాగానే ఉండేది. ఉపాధిహామీ ఫీల్ట్ అసిస్టెంట్ల తొలగింపుతో నిర్వహణ బాధ్యత కార్యదర్శులపై పడింది. దీంతో అదనపు బాధ్యతలు ఉండడంతో పల్లె ప్రకృతి వనాల నిర్వహణపై నిర్లక్ష్యం నీడలు కమ్ముకున్నాయి. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తవ్వడంతో మండలంలో 30 గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల్లో నిర్వహణ సక్రమంగా లేక సుమారు 50శాతం మొక్కలు ఎండిపోయాయి. ఉన్నాతాధికారులు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నప్పటికి క్షేత్ర స్థాయిలో అమలు సక్రమంగా జరగడం లేదు.
చెత్తాచెదారంతో నిండిపోయి..
కోనరావుపేట : పల్లెప్రకృతి వనాల సంరక్షణ సరిగా లేకపోవడంతో చెట్లన్నీ ఎండిపోవడమే కాకుండా చెత్తాచెదారంతో నిండిపోయాయి. మండలంలో 28 గ్రామపంచాయతీల్లో 28 ప్రకృతివనాల ఏర్పాటుకు భూమి కేటాయించి సుమారు మూడు లక్షల రూపాయల నిధులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రతి గ్రామంలో పకృతి వనాలను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులపాటు ప్రకృతి వనాల్లో ఏర్పాటు చేసిన మొక్కలను కాపాడుతూ వచ్చారు. ప్రకృతి వనాలపైన అధికారులు దృష్టి సారించకపోవడంతో పెరిగిన చెట్లు ఎండిపోవడమే కాకుండా చెట్లు విరిగిసోయి చెత్తాచెదారంతో నిండిపోయాయి. అధికారులు స్పందించి ప్రకృతి వనాలపై దృష్టి సారించి వేసవిలో నీళ్లు పడుతూ శుభ్రం చేయాలని మండల వాసులు కోరుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా..
ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని పల్లె ప్రకృతి వనాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మండలంలోని 23 గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. అల్మాస్‌పూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. గ్రామాలకు దూరంగా ఉండడంతో వాటిని పట్టించుకునేవారు కరువయ్యారు. పలు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మొక్కలను సంరక్షించేవారు లేకపోవడం వల్ల ఆహ్లాదం అందకుండా పోతోంది. పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో పశువులు చేరుతున్నాయి. పల్లె ప్రకృతి వనాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఇబ్బందిగా మారుతోందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అధ్వానంగా వనాలు..
చందుర్తి : పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. పచ్చని మొక్కలు, చెట్లతో మినీ పార్కును తలపించేలా పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం ప్రభుత్వం సంకల్పించింది. ప్రకృతి సహజంగా పండ్లు, పువ్వులు లభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పూనుకుంది. అయితే ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సరైన నిర్వహణ లేక పల్లె వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. అధికారులు పట్టింపు లేకపోవడం, కొన్ని నెలల క్రితం సర్పంచుల పాలన ముగియడంతో నిర్వహణ కొరవడి చాలాచోట్ల మొక్కలు ఎండిపోతున్నాయి.