భరోసా కేంద్రాల సేవలు భేష్...
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:14 AM
జిల్లాలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ అన్నారు.
కరీంనగర్ క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో రేకుర్తి- కొత్తపల్లి రోడ్డులో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ సైబర్ క్రైం, మాదక ద్రవ్యాలు, పిల్లలు, మహిళలపై వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. భరోసా కేంద్రాల్లో వైద్యం, న్యాయం, కౌన్సెలింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నందున బాధితుల్లో ధైర్యాన్ని నింపుతాయని తెలిపారు. కరీంనగర్ భరోసా కేంద్రంలో కేసులు తక్కువగా నమోదవడం మంచి విషయమన్నారు.
ఫ కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఏడాది క్రితం ప్రారంభమైన భరోసా కేంద్రం ఎన్నో మైలురాళ్లను దాటిందని తెలిపారు. అనేక కేసుల్లో మహిళలకు, చిన్నారులకు భరోసా కేంద్రం అండగా నిలిచి బాధితుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు.
ఫ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు లైంగిక వేధింపులు, హింసకు గురైన సందర్భంలో బాధితులకు ఒకే చోట వైద్యం, న్యాయం, కౌన్సెలింగ్ వంటి వివిధ సేవలను అందించేందుకు భరోసా కేంద్రం ప్రారంభించామని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 47 పోక్సో, 13 అత్యాచారం కేసులు నమోదయ్యాయన్నారు. బాధితులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మనోధైర్యాన్ని నింపడమే కాకుండా వివిధ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు శిక్షణలు ఇప్పించామన్నారు. మహిళలు, 18 సంవత్సరాలులోపు ఉన్న బాల బాలికలు ఎవరైనా నేరుగా, పోలీస్ స్టేషన్ ద్వారా భరోసా కేంద్రం సేవలను పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పోలీస్ అధికారులు, భవిత కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.