ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:23 AM
విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు.
కరీంనగర్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ చాలామంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని, వారికి సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వేలాదిమంది భవిష్యత్తును సన్మార్గంలో నడిపే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు వంద శాతం పాఠశాలకు హాజరైతే విద్యార్థుల హాజరు కూడా అదేవిధంగా నమోదవుతుందని అన్నారు. పాఠశాల విద్యలో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కోరారు. అవార్డు స్వీకరించిన వారు మాత్రమేకాకుండా చాలామంది ఉపాధ్యాయులు తమ సేవలను అందిస్తున్నారని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం 43 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 17మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. గత విద్యాసంవత్సరం 10వ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించిన 95 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోడ గడియారాలను బహుమతులుగా అందజేశారు. ఈ గడియారాల్లో పాఠశాల విద్యలో అవలంబించాల్సిన 12 అంశాలను సూచికలుగా పొందుపరిచేలా కలెక్టర్ పమేలా సత్పతి సృజనాత్మకతతో రూపొందించారు. లాంగ్వేజ్ లాంటర్న్‌కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, మానకొండూర్ ఎమెమల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీఈవో చైతన్య జైనీ, విద్యాశాఖ కో-ఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.