Share News

రెండో విడతలోనూ హస్తం హవా

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:41 AM

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తన అధిక్యతను ప్రదర్శించింది.

రెండో విడతలోనూ హస్తం హవా

కరీంనగర్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తన అధిక్యతను ప్రదర్శించింది. కాంగ్రెస్‌ పార్టీకి ఈ విడతలో ఎక్కువ సీట్లే వచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీ పలు గ్రామాల్లో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఇచ్చింది. ఈ విడతలో 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 46 పంచాయతీల్లో కాంగ్రెస్‌ తన జెండాను ఎగుర వేసింది. 38 స్థానాలతో బీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలవగా ఇండిపెండెంట్లు 20 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తన అభ్యర్థులను సర్పంచులుగా గెలుపించుకుంది.

ఫ మండలాల వారీగా..

జిల్లాలోని మానకొండూర్‌ నియోజక వర్గ పరిధిలోని తిమ్మాపూర్‌ మానకొండూర్‌, గన్నేరువరం, శంకరపట్నం, హుస్నాబాద్‌ నియోజక వర్గంలోని చిగురుమామిడి మండలాల్లో ఈ విడత ఎన్నికలు జరిగాయి.

- చిగురుమామిడి మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా తొమ్మిది చోట్ల బీఆర్‌ఎస్‌, 7 పంచాయతీల్లో కాంగ్రెస్‌, ఒక గ్రామంలో బీజేపీ విజయం సాధించింది.

- మానకొండూర్‌ మండలంలో కాంగ్రెస్‌కు 18, బీఆరెస్‌కు 9, బీజేపీకి రెండు పంచాయతీలు దక్కాయి.

- తిమ్మాపూర్‌ మండలంలో కాంగ్రెస్‌ు ఆరు, బీఆర్‌ఎస్‌ తొమ్మిది, ఇండిపెండెంట్లు ఏడు, బీజేపీ అభ్యర్థులు ఒక పంచాయతీలో గెలుపొందారు.

- శంకరపట్నం మండలంలో కాంగ్రెస్‌ ఏడు, బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ 3 పంచాయతీల్లో ఇండిపెండెంట్లు 6 పంచాయతీల్లో విజయం సాధించారు.

- గన్నేరువరం మండలంలో కాంగ్రెస్‌ ఎనిమిది, ఇండిపెండెంట్లు ఏడు, బీజేపీ రెండు పంచాయతీల్లో విజయం సాధించాయి.

ఫ ప్రశాంతంగా ఎన్నికలు

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఈ విడతలో 113 గ్రామపంచాయతీల్లో సర్పంచు పదవులు, 1046 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యాఇంది. గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, గోపాల్‌పూర్‌ గ్రామాల సర్పంచ్‌లు, వివిధ పంచాయతీల్లోని 152 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆదివారం 111 సర్పంచ్‌, 894 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,60,184 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఐదు మండలాల్లో కలిపి 86.58 శాతం పోలింగ్‌ నమోదైంది. శంకరపట్నం మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 37,867 మంది ఓటర్లకుగాను 33,334 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 88.03 పోలింగ్‌శాతం నమోదైంది.

- మానకొండూర్‌ మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో 56,922 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 49,328 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 86.66శాతం పోలింగ్‌ నమోదైంది.

- తిమ్మాపూర్‌ మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో 38,414 మంది ఓటర్లు ఉండగా 32,589 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో 34,370 మంది ఓటర్లు ఉండగా 29,498 మంది ఓటు వేశారు. ఈ మండలంలో 85.82శాతం పోలింగ్‌ నమోదైంది.

- గన్నేరువరం మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో 17,430 మంది ఓటర్లు ఉండగా 15,435 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 88.55 పోలింగ్‌శాతం నమోదైంది. ఈ విడతలో అత్యధికంగా గన్నేరువరం మండలంలో 88.55శాతం పోలింగ్‌ జరుగగా మిగిలిన మూడు మండలాల్లోనూ 85శాతానికి పైగానే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగా తిమ్మాపూర్‌ మండలంలో 84.84శాతం పోలింగ్‌ నమోదైంది.

ఫ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు

పోలీస్‌ బందోబస్తు మధ్య బ్యాలెట్‌బాక్సులను ఒకచోటుకు తరలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. సర్పంచు, వార్డుసభ్యుల బ్యాలెట్‌లను వేరు చేసి ముందుగా వార్డుసభ్యుల ఓట్లను లెక్కించిన అనంతరం అన్ని వార్డుల్లోని సర్పంచు బ్యాలెట్‌ పేపర్లన్నిటిని కలిపి 25 ఓట్ల కట్టలు కట్టి బ్యాలెట్లను లెక్కించారు. చెల్లని ఓట్లను వేరుగా లెక్కించిన తర్వాత మొత్తం ఓట్లను లెక్కించి అత్యధికంగా ఓట్లు వచ్చిన వారితోపాటు అభ్యర్థులందరి సంతకాలను తీసుకొని విజేతల పేర్లను ప్రకటించారు.

ఫ లక్ష్మీపూర్‌లో రీ కౌంటింగ్‌

మానకొండూర్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామంలో ఇద్దరు సర్పంచు అభ్యర్థుల మధ్య ఐదు ఓట్లు తేడా ఉండడంతో ఐదు సార్లు బ్యాలెట్‌ పేపర్లను పరిశీలించి, రీకౌంటింగ్‌ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన స్వగ్రామమైన మండలంలోని పచ్చునూరు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోగా, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ మానకొండూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

ఫ రెండు గ్రామాలు...152 వార్డులు ఏకగ్రీవం

గన్నేరువరం మండలంలోని పీచుపల్లి సర్పంచ్‌గా సామ రాజిరెడ్డి (బీజేపీ), గోపాల్‌పూర్‌ సర్పంచుగా ఆకుల కవిత (కాంగ్రెస్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 43 వార్డులు, శంకరపట్నం మండలంలో 48 వార్డులు, మానకొండూర్‌ మండలంలో 10 వార్డులు, తిమ్మాపూర్‌ మండలంలో 38 వార్డులు, చిగురుమామిడి మండలంలో 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

ఫ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళి పరిశీలన

రెండో విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఆదివారం తిమ్మాపూర్‌ మండలంలోని జోగయ్యపల్లి, రామకృష్ణకాలనీ, చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించి పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల సిబ్బంది, ఓటర్లతో మాట్లాడారు. అనంతరం ఈ విడత ఎన్నికలు జరిగే 162 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కలెక్టరేట్‌ నుంచి స్ర్కీన్‌ల ద్వారా పరిస్థితిని కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రిటర్నింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌ వెంకటేశ్వర్లు శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్‌, గన్నేరువరం, చిగురుమామిడి మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.

Updated Date - Dec 15 , 2025 | 01:41 AM