Share News

వెలమల కోటలో రగులుతున్న వేడి

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:53 AM

రాజకీయంగా వెలమల ఆధిపత్యానికి పెట్టని కోటలా ఉంటూ వస్తున్న ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో ఉన్న వెలమసామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని రాబోయే రోజుల్లో అధికారంలోకి రాకుండా చేస్తానని చేసిన శపథం ఆ సామాజిక వర్గంలో కలకలం సృష్టిస్తున్నది. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను స్థాపించిన నాటి నుంచి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉద్యమ సమయంలో, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించింది కరీంనగర్‌ జిల్లా.

వెలమల కోటలో రగులుతున్న వేడి

- హాట్‌ టాపిక్‌గా సీఎం రేవంతరెడ్డి వాఖ్యలు

- బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో కలకలం

- మూడేళ్ల ముందే నియోజకవర్గాలపై చర్చ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాజకీయంగా వెలమల ఆధిపత్యానికి పెట్టని కోటలా ఉంటూ వస్తున్న ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో ఉన్న వెలమసామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని రాబోయే రోజుల్లో అధికారంలోకి రాకుండా చేస్తానని చేసిన శపథం ఆ సామాజిక వర్గంలో కలకలం సృష్టిస్తున్నది. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను స్థాపించిన నాటి నుంచి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉద్యమ సమయంలో, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించింది కరీంనగర్‌ జిల్లా. ఉద్యమకాలంలోనే కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పలు ప్రధాన కార్యక్రమాలకు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ఇలా ఇది ఆయనకు కరీంనగర్‌ సెంలిమెంట్‌ జిల్లాగా, పట్టున్న జిల్లాగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చేసిన వాఖ్యలు బీఆర్‌ఎస్‌లోనే కాకుండా కాంగ్రెస్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి.

ఫ ఉమ్మడి జిల్లాలో నలుగు వెలమ ఎమ్మెల్యేలు

ఉమ్మడి జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మూడు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలుగురు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నలుగురు బీసీలు, ఇద్దరు ఓసీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. జగిత్యాల నుంచి గెలుపొందిన డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఇద్దరు వెలమ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో, మరో ఇద్దరు కాంగ్రెస్‌లో ఉన్నారు.

ఫ అన్ని పార్టీల్లో వారే..

కోరుట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జువ్వాడి నర్సింగారావు, వేములవాడ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చల్మెడ లక్ష్మినర్సింహారావు ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్‌ వికాస్‌రావు వెలమ సామాజికవర్గానికి చెందినవారే. కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వెలిచాల రాజేందర్‌రావు, మెన్నేని రోహితరావు, హుజూరాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించిన బల్మూరి వెంకట్‌ వెలమ సామాజికవర్గానికి చెందినవారే. వీరందరూ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉండడమే కాకుండా వీరితోపాటు మరికొందరు కూడా వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని ఆశిస్తున్నారు. వీరందరికీ తమతమ తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాలు ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చేసిన వాఖ్యలు రాష్ట్రంలో వెలమల రాజకీయ ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసినవిగా ఆ సామాజికవర్గం భావిస్తున్నది. అలాంటి సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న వెలమల పరిస్థితి ఏమిటీ, ఎంత మందికి టికెట్‌ వచ్చే అవకాశముంటుంది, లేక రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తారా అన్నది రాజకీయవర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, సీహెచ విజయరమణారావు, జగిత్యాల, పెద్దపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీరిద్దరితోపాటు కరీంనగర్‌, హుజూరాబాద్‌, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలు పార్టీలో క్రియాశీలకంగా రాజకీయాలు నిర్వహిస్తున్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెలమలకు ఎన్ని సీట్లు దక్కవచ్చు, టికెట్‌ దొరకని పక్షంలో తమ రాజకీయ భవితవ్యం ఏమిటీ అంటూ కాంగ్రెస్‌ నేతలు ఆలోచిస్తున్నారు. వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలను టార్గెట్‌ చేసుకొని రేవంతరెడ్డి రాజకీయాలు నిర్వహిస్తారా.. ఆయన వెలమలు పోటీచేసే నియోజకవర్గాలపై దృష్టి పెట్టి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి నిధులు విడుదల చేసి ఎన్నికల సమయంలో ప్రత్యేక ప్రణాళికతో పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, తమ రాజకీయ భవితవ్యం ఏమిటీ అంటూ బీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది.

ఫ అసంతృప్తిలో రెడ్డి సామజికవర్గం

మరోవైపు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంలో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నది. బీఆర్‌ఎస్‌లో తమకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయిందని, కాంగ్రెస్‌లోనూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేయడానికి అవకాశం కల్పించారని ఆ సామాజికవర్గం అసంతృప్తితో ఉన్నది. రేవంతరెడ్డి చేసిన వాఖ్యల నేపథ్యంలో తమకేమైనా ఎక్కువ సీట్లు దక్కే పరిస్థితి ఉంటుందా అన్నది రెడ్డి సామాజికవర్గంలో చర్చకు తెరతీసింది. ప్రస్తుతం బీసీలకు అవకాశాలు లేకుండా పోయాయని, 50 శాతానికి మించి జనాభా ఉన్న తమ వర్గానికి అందుకు అనుగుణంగా స్థానాలు కేటాయించాలని ఆ వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే బీసీ నేతలు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఈ మూడు సామాజికవర్గాల మధ్య సీట్ల పంపకం అన్ని పార్టీలకు కొంత సమస్యగానే మారే అవకాశమున్నది.

ఫ నియోజకవర్గాల వారిగా..

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని గెలిపించుకోలేక పోయింది. ఈ నాలుగు ఎన్నికల్లో బీసీ నేత గంగుల కమలాకర్‌ ఒకసారి టీడీపీ నుంచి మూడుసార్లు బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే ఆ పార్టీ అభ్యర్థిగా ఉండడం ఖాయం. కాంగ్రెస్‌ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, వి నరేందర్‌రెడ్డి, కె నరేందర్‌రెడ్డి టికెట్‌ కోసం పోటీ పడే అవకాశముంది.

- కోరుట్ల నుంచి సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కి పోటీగా కాంగ్రెస్‌ నుంచి జువ్వాడి నర్సింగారావు పోటీ పడతారు.

- జగిత్యాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవనరెడ్డి నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆయనకే అవకాశముండవచ్చని భావిస్తున్నారు.

- హుజూరాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి వొడితల ప్రణవ్‌ (ఓసీ), బల్మూరి వెంకట్‌, పత్తి కృష్ణారెడ్డి పోటీ ఉండే అవకాశం ఉంది.

- సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కేకే మహేందర్‌రెడ్డి, సంగీతం శ్రీనివాస్‌ (బీసీ) నాగుల సత్యనారాయణ (బీసీ) టికెట్‌ కోసం పోటీ పడే అవకాశం ఉంది.

- వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందిన ఆది శ్రీనివాస్‌కు పార్టీలో పోటీ లేదు. బీఆర్‌ఎస్‌ నుంచి చల్మెడ లక్ష్మినర్సింహారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి టికెట్‌ కోసం పోటీ ఉండే అవకాశముంటుంది.

- మంథని సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్‌బాబుకు పోటీగా బీఆర్‌ఎస్‌ నుంచి పుట్టమధు (బీసీ) బరిలోకి దిగే అవకాశముంది.

- పెద్దపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీహెచ విజయరమణారావుకు బీఆర్‌ఎస్‌ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మక్కానసింగ్‌కు బీఆర్‌ఎస్‌ నుంచి కోరుకంటి చందర్‌ మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయి.

- హుస్నాబాద్‌ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సతీష్‌బాబు, ప్రవీణ్‌రెడ్డిలో ఒకరు పోటీ పడవచ్చు.

ఫ సమన్యాయం సాధ్యమేనా..?

ఇరుపార్టీల్లో పోటీపడే అవకాశాలున్నవారిని పరిశీలిస్తే కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా వెలమలనే పోటీలో నిలపాల్సిన పరిస్థితి ఉన్నది. మంథని నుంచి శ్రీధర్‌బాబు (ఓసీ), హుజూరాబాద్‌ నుంచి వొడితెల ప్రణవ్‌ కానీ పక్షంలో బల్మూరి వెంకట్‌కు, పత్తి కృష్ణారెడ్డికి ఎవరికి ఇచ్చినా అవి ఓసీ సీట్లుగానే మిగిలిపోతాయి. ఆది శ్రీనివాస్‌, పొన్నం ప్రభాకర్‌, మక్కానసింగ్‌ ఠాకూర్‌ సీట్లలో వారే నిలిచే అవకాశం ఉన్నందున బీసీలకు ఆ మూడు స్థానాలు కేటాయిస్తే జిల్లాలో రాజకీయప్రాబల్యం అధికంగా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి కేటాయించే సీట్లు రెండుగానే భావించాల్సిఉంటుంది. కరీంనగర్‌, సిరిసిల్ల లాంటి పోటీ తీవ్రంగా ఉండే నియోజకవర్గాల్లో మాత్రమే తమకు అవకాశమిస్తే కాంగ్రెస్‌లో కొనసాగి ఏమి ప్రయోజనమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల చర్చల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు సామాజికవర్గాల సమీకరణాలతో ముడిపడి ఉన్నందున రెండు పార్టీలకు ఇది తలనొప్పిగానే ఉంటుందని అనుకుంటున్నారు. ఈలోగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరుగడంతోపాటు రిజర్వేషన్లు మారితే ప్రస్తుత సమీకరణాల్లో తేడాలు రావచ్చని అప్పటి పరిస్థితిని బట్టి అవకాశాలు మళ్లీ మారచ్చని అనుకుంటున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 01:53 AM