Share News

పోలీసుల త్యాగం మరువలేనిది

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:58 PM

శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన త్యాగం మరువలేనిదని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ‘ఫ్లాగ్‌ డే’ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

పోలీసుల త్యాగం మరువలేనిది
మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

- ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

కరీంనగర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన త్యాగం మరువలేనిదని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ‘ఫ్లాగ్‌ డే’ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమంతా ప్రజలు కుటుంబ సభ్యులతో పండుగలు జరుపుకుంటున్న సమయంలోనూ పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షణ కల్పిస్తారని తెలిపారు. అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సీపీ గౌస్‌ఆలం మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి జిల్లా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని, ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితంగానే ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో 47 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 191 మందికి పైగా అన్ని విభాగాల పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాలు ఎప్పటికీ వృఽథా సీపీ అన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా, శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. అమరుల కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిని స్మరించుకుంటూ ఈ నెల 31 వరకు 10 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అమరవీరుల విగ్రహానికిసాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. సీపీ, ఇతర పోలీస్‌ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీపీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు వెంకటరమణ, భీం రావులతో పాటు కమీషనరేట్‌లోని పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:58 PM