నిబంధనలు కఠినతరం
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:13 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
జగిత్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో తేమ శాతం నిర్ధారణ, సన్న, దొడ్డు రకం వడ్లను గుర్తించడం, ట్రక్ షీట్ల జారీ తదితర విషయాల్లో లోపాలు వెలుగు చూశాయి. కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా కొనుగోలు కేంద్రాల్లో ఇటు రైతులను, అటు ప్రభుత్వాన్ని మోసం చేసి అందినంత దండుకున్నారన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. గతేడాది వానాకాలం సీజన్‌లోనే సాంకేతిక యంత్రాలు వినియోగించాలని సూచించినప్పటికీ సకాలంలో అన్ని కేంద్రాలకు యంత్రాలు అందలేదు. ఈ ఏడాది ఖచ్చితంగా యంత్రాలు వినియోగించి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఫవ్యవసాయ శాఖ సర్వేనే ప్రామాణికం..
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేశారు. వ్యవసాయ శాఖ అందించిన సర్వేను ప్రామాణికంగా తీసుకొని పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వ్యవసాయ శాఖ చేపట్టిన సర్వేలో వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం 3.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు నమోదు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 7.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఫరైతులకు మేలు జరిగేలా..
ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలతో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు నిజమైన రైతులకు మేలు జరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రైతులందరూ బ్యాంకు ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకొని రైతుబంధు పథకం పొందుతుండడంతో ఎలాంటి సమస్య లేకుండా ధాన్యం కొనుగోలు డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు. కొత్త నిబంధనలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రైతుల ఐరిస్ ఆధారంగా గన్నీ బ్యాగులు ఇచ్చి సాగు చేసే రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ఫసన్నాలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాలు
సన్నధాన్యం గుర్తించడానికి ప్రతి కొనుగోలు కేంద్రానికి గ్రెయిన్ కాలిపర్ యంత్రాన్ని అందజేస్తున్నారు. సన్నరకం ధాన్యం వచ్చే కేంద్రాలకు రెండు పరికరాలను అందజేస్తారు. ఈ యంత్రం సహాయంతో బియ్యం పొడవు, వెడల్పు కొలుస్తారు. పొడవు 6మిల్లీమీటర్ల తక్కువ, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సన్నాల కొనుగోళ్లలో ప్యాడి హల్లర్ యంత్రం సేవలు ఉపయోగించు కుంటారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రెండు యంత్రాలను అందజేయ నున్నారు. ఈ యంత్రం సహాయంతో సన్నరకం వడ్లను ఒలుస్తారు. గుప్పెడు వడ్లు తీసుకొని ఈ యంత్రంలో పోసి తిప్పితే పొట్టు ఊడిపోయి బియ్యం గింజలు బయటకు వస్తాయి. ఈ విధంగా బయటకు వచ్చిన బియ్యాన్ని కొలతల ఆధారంగా అవి సన్న రకమో కాదో నిర్ధారిస్తారు.
ఫప్రతి గన్నీ బ్యాగ్‌పై..
కొనుగోలు చేసిన ధాన్యం సంచులపై కోడ్ వేస్తున్నారు. ప్రతి ధాన్యం సంచిపై కొనుగోలు కేంద్రం కోడ్ ధాన్యం రకం వివరాలు నమోదు చేస్తారు. సన్నరకం ధాన్యం అయితే ఎరుపు రంగుతో కొనుగోలు కేంద్రం నంబర్, ధాన్యం రకం వద్ద ఎస్ అని రాస్తారు. దొడ్డు రకం అయితే సంచులపై ఆకుపచ్చ రంగుతో డీ అని రాస్తారు. సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరు వాహనాల్లో రవాణా చేస్తారు. ఇక్కడ సన్నరకం ధాన్యాన్ని సంబంధిత ఏఈవోలు ధ్రువీకరిస్తారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే కొనుగోళ్లు
-జితేంద్రప్రసాద్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏఈవోలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగు వివరాలను నమోదు చేశారు. సమగ్ర పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాం. వరి పంటకు సంబంధించిన రైతుల వివరాలను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచింది. వరి పంట సాగు చేసిన రైతుల వివరాల ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నాం. నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను పొందాలి.