వైభవంగా రుగ్వేద, యజుర్వేద ఉపాకర్మలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:26 AM
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని రుగ్వేద, యజుర్వేద బ్రాహ్మణులు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు.
వేములవాడ కల్చరల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని రుగ్వేద, యజుర్వేద బ్రాహ్మణులు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని అద్దాల మంటపంలో రుగ్వేద బ్రాహ్మణులు, నాగిరెడ్డి మంటపంలో యజుర్వేద బ్రాహ్మణులు ఆలయ స్థానాచార్యలు నమిలికొండ ఉమేష్ ఆధ్వర్యంలో ఉపాకర్మను ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన అగ్రహారంలోని 128 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు సంప్రదాయ పద్ధతిలో ఆలయానికి చేరుకుని యజ్ఞోపవీతంలో పాల్గొన్నారు. యజ్ఞోపవీతంలో భాగంగా ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్, అర్చకులు మామిడిపల్లి శరత్ గోపన్నగారి గణేష్, చందుల ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలు వేదమంత్రాలతో మార్మోగాయి. ఈ కార్యక్రమానికి 300కు పైగా బ్రాహ్మణులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప రామకృష్ణ, రవిందర్, ప్రతాప చంద్రమౌళి, మామిడిపల్లి రాజన్న, గర్శకుర్తి వెంకటేశ్వర్లు, పురాణం రాము, చొప్పకట్ల భాను, మల్లికార్జున్, గోపి, కృష్ణచంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాజన్నను దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు చర్యలు చేపట్టారు.