Share News

నిర్మాణ బాధ్యతలు లబ్ధిదారులకే..

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:52 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. మొదటి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఇచ్చారు.. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కొన్ని పూర్తిచేసి పంపిణీ చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిని కూడా బీఎల్‌సీ( బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో పూర్తిచేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

నిర్మాణ బాధ్యతలు లబ్ధిదారులకే..
వేమువాడలో అసంపూర్తిగా డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు

- డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై బీఎల్‌సీ విధానం

- ఇందిరమ్మకు తోడుగా ‘డబుల్‌’ ఆశలు

- అసంపూర్తిగా మిగిలిన డబుల్‌ ఇళ్ల కేటాయింపుపై కసరత్తు

- జిల్లాకు రెండు విడతలుగా 7,846 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. మొదటి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఇచ్చారు.. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కొన్ని పూర్తిచేసి పంపిణీ చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిని కూడా బీఎల్‌సీ( బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో పూర్తిచేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు లబ్ధిదారులను ఎంపిక చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు నిధులు కేటాయించి లబ్ధిదారుడే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులు 1,07,398 ఉన్నాయి. ఇందులో ఎల్‌-1,2,3 కేటగిరిగా విభజించారు. ఎల్‌ 1లో 4,653 దరఖాస్తులు, ఎల్‌ 2లో 1,415 దరఖాస్తులు, ఎల్‌ 3లో 3,287 దరఖాస్తులను గుర్తించి ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యతగా నిరుపేదలు, దళితులు, గిరిజనులు వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లకు ప్రాధాన్యం ఇచ్చారు. లబ్ధిదారుల్లో దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ మైనార్టీలకు 50 శాతం, జనరల్‌ కేటగిరీ కింద 15 శాతం చొప్పున ఇళ్లను కేటాయించారు. ఇంటి నిర్మాణంలో పునాది స్థాయిలో రూ లక్ష, రెండవ దశలో రూ 1.25 లక్షలు, మూడవ దశలో స్లాబ్‌కు రూ 1.75 లక్షలు, ఫినిషింగ్‌, ఇతర దశలకు రూ లక్ష చోప్నున అందించనున్నారు. ఇందులో ఎల్‌ - 1 దరఖాస్తుదారులకు మొదటి ప్రాధాన్యం కల్పించారు. సొంత స్థలం ఉండి గుడిసె, రేకుల షెడ్డు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. మొదటి, రెండవ దశలో జిల్లాలో 7,846 ఇల్లు మంజూరు చేయగా, 4,110 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోశారు. ఇందులో 203 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి. ఎల్‌ -2లో స్థలం లేక అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని చేర్చారు. ఎల్‌ -2లో ఉన్న వారికి అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్‌ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. బీఎల్‌సీ విధానంతో లబ్ధిదారులు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల వరకు గరిష్టంగా నిధులు ఇవ్వనున్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లపై ఇంకా మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై లబ్ధిదారుల్లో ఆసక్తి ఏర్పడింది.

జిల్లాకు 6,886 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి 6,886 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. ఇందుకోసం రూ 374.41 కోట్ల నిధులు వ్యయంగా నిర్ణయించారు. ఇందులో 5,437 ఇళ్లకు మాత్రమే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. 4,248 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, 3,546 ఇళ్లు పూర్తి చేశారు. ఇందులో 3,448 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. రూ 188.49 కోట్లు ఖర్చు చేశారు. 702 ఇళ్లు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. కొన్ని ఇళ్లు దాదాపు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేక పంపిణీకి నోచుకోవడం లేదు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోనూ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా అనేక వివాదాల మధ్య అందించడం లేదు. పూర్తయిన ఇళ్లు కేటాయింపులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా అసాంఽఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో సిరిసిల్ల మండలంలో 2,052 ఇళ్ల లక్ష్యాన్ని పూర్తిచేశారు. ముస్తాబాద్‌లో 702 ఇళ్లకు 429 ఇళ్లు, తంగళ్లపల్లిలో 549 ఇళ్లకు 110 ఇళ్లు, ఎల్లారెడ్డిపేటలో 490 ఇళ్లకు 320 ఇళ్లు, గంభీరావుపేటలో 476 ఇళ్లకు 371 ఇళ్లు, వీర్నపల్లిలో 160 ఇళ్లు మంజూరు కాగా 50 ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఒకటి కూడా పూర్తికాలేదు. ఇల్లంతకుంటలో 340 ఇళ్లకు 184 పూర్తి చేశారు. వేములవాడ రూరల్‌ మండలంలో 1080 ఇళ్లకు 80 ఇళ్లు పూర్తికాగా, వేములవాడ అర్బన్‌లో 800 ఇళ్లకు ఇప్పటి వరకు ఒకటి కూడా పూర్తి కాలేదు. కోనరావుపేట మండలంలో 92, చందుర్తిలో 45, రుద్రంగిలో 35 ఇళ్లు, బోయినపల్లిలో 65 ఇళ్లు మంజూరైనా ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాకుండానే లబ్ధిదారుల్లో నిరాశ నింపింది. ప్రధానంగా వేములవాడ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిరాశనే కల్పించింది. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే సగం కూడా పూర్తి కాలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు ప్రారంభం కాని ముస్తాబాద్‌లో 175 ఇళ్లు, తంగళ్లపల్లిలో 178 ఇళ్లు, ఎల్లారెడ్డిపేటలో 106 ఇళ్లు, గంభీరావుపేటలో 43 ఇళ్లు, వీర్నపల్లిలో 87 ఇళ్లు, ఇల్లంతకుంటలో 156 ఇళ్లు, వేములవాడ రూరల్‌లో 1000 ఇళ్లు, వేములవాడ అర్బన్‌లో 656 ఇళ్లు, కోనరావుపేటలో 92 ఇళ్లు, చందుర్తిలో 45 ఇళ్లు, రుద్రంగిలో 35 ఇళ్లు, బోయినపల్లిలో 65 ఇళ్లు టెండర్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.

Updated Date - Jun 19 , 2025 | 12:52 AM