స్పందన అంతంతే..
ABN , Publish Date - May 07 , 2025 | 01:29 AM
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)కు గడువు పొడిగిస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో అధికారులు కదలరు.. దరఖాస్తుదారులు ముందుకు రారు.. అన్నట్లుగానే మారింది. నాలుగోసారి గడువు పొడిగిస్తూ మే 31వరకు ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)కు గడువు పొడిగిస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో అధికారులు కదలరు.. దరఖాస్తుదారులు ముందుకు రారు.. అన్నట్లుగానే మారింది. నాలుగోసారి గడువు పొడిగిస్తూ మే 31వరకు ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా దాదాపు రూ.40 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా మే 3 వరకు ఇచ్చిన గడువు మేరకు జిల్లాలో రూ.19 కోట్ల వరకు మాత్రమే ఆదాయం లభించింది.
ఫ సాంకేతిక సమస్యలే...
భూముల క్రమబద్ధీకరణతో ఆదాయం సమకూరుతుందని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించినా జిల్లాలో అనుకున్న మేరకు స్పందన లభించలేదు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. యూజర్ మాన్యువల్ ఫీ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయని చెబుతున్నారు. సర్వర్‌లు బిజీగా ఉండడం, ఆన్‌లైన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు దరఖాస్తుదారులకు నేరుగా ఆటో జనరేట్ మేసేజ్‌లు వెళ్లకపోవడం, సర్వర్‌లు మోరాయించడం వంటి ఇబ్బందులను దరఖాస్తుదారులు ఎదుర్కుంటున్నారు. దీంతోపాటు ఎన్నో వ్యయప్రయసాలకు ఓర్చి దరఖాస్తులు చేసుకున్న వారికి సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఎల్ 1 దశలోనే దరఖాస్తులకు బ్రేక్‌లు పడుతున్నాయని వాపోతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు మూడంచెల విధానం ఉండడంతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పథకంగా ఉండడంతో గడువు ముగిసినా మే 31 వరకు మళ్లీ పొడిగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుదారులకు చెల్లింపునకు 25 శాతం రాయితీ కల్పించినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతంత మాత్రంగానే దరఖాస్తుదారుల నుంచి స్పందన వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో అధికారుల మధ్య సమన్వయలోపం, దరఖాస్తుదారులను ప్రొత్సహించకపోవడంతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మార్చి 31 వరకు ఇచ్చిన రాయితీ గడువు ముగిసినా ఎల్‌ఆర్‌ఎస్ అట్టర్ ప్లాప్‌గానే కొనసాగింది. దీంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెలలోనైనా అధికారులు దరఖాస్తుదారులను ప్రొత్సహించి ఎల్‌ఆర్‌ఎస్ పక్రియను వేగవంతం చేసి ఇటు ప్రజల సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం ఎంత మేరకు చేకూరుస్తారనే దానిపై అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ కింద 42,942 దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో 37,071 మంది దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించే విధంగా సమాచారం అందించారు. 4,896 దరఖాస్తులను తిరస్కరించారు. మార్చి 31 వరకు రూ.17.33 కోట్లు ఆదాయం ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా సమకూరింది. తరువాత ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చారు. సాంకేతిక సమస్యలతో మే 3 వరకు అవకాశం ఇచ్చారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. రూ 19 కోట్ల వరకే పెరిగింది. గడువు పొడిగిస్తున్నా అనుమతి లేని ప్లాట్లు లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌లో 25శాతం రాయితీ నిర్ణయంతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం భావించినా అనుకున్న మేరకు సక్సెస్‌గా ముందుకు వెళ్లడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామపంచాయతీల పరిఽధిలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ కోసం 42,942 దరఖాస్తులు వచ్చాయి. 2020 సెప్టెంబరులో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రజలపై మోయలేని భారం మోపిందనే అభిప్రాయంతో ఎవరూ దరఖాస్తులు చేసుకున్నా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలు గ్రామపంచాయతీల్లో అక్రమ లేఅవుట్‌లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు సెప్టెంబరు 1, 2020న బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 26 ఆగస్టు 2020లోపు సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసిన లే అవుట్‌ల యజమానులు ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఇంటి పన్నులు చెల్లించి క్రయవిక్రయాలు జరిపిన వారు కూడా ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించే పరిస్థితి నెలకొంది. లేనిపక్షంలో క్రయ విక్రయాలు జరిపే అవకాశం లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రకటనలు చేసి సర్వేలు చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. గత సంవత్సరం జూలై నెలలో మున్సిపాలిటీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు సమాచారం అందించారు. 25 శాతం రాయితీని ప్రకటించినా అనుకున్న మేరకు వేగం పెరగలేదు. మళ్లీ తాజాగా ప్రభుత్వం ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేస్తే 25 శాతం రాయితీపై గడువు పొడిగించింది. లే అవుట్‌లలో కేవలం పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి.. మిగిలినవి రిజిస్ట్రేషన్ కాకపోతే 90 శాతం ప్లాట్లు క్రమబద్ధీకరణకు అనుమతిస్తున్నారు. చాలా మంది రియల్టర్లు అనుమతి లే అవుట్ ప్లాట్లు కొన్నవారు రూ 10 వేల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత రూ 1000 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం రాయితీతోనైనా ఎల్‌ఆర్‌ఎస్ ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నా వేగం మాత్రం కనిపించడం లేదు.
ఫ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ఇలా...
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు వచ్చిన 42,942 దరఖాస్తుల్లో 37,071 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,493 దరఖాస్తులు, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 16,336 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా 16113 దరఖాస్తులు వచ్చాయి. బోయినపల్లి మండలంలో 20 గ్రామపంచాయతీల్లో 645 దరఖాస్తులు, చందుర్తిలో 15 గ్రామపంచాయతీల్లో 213, ఇల్లంతకుంటలో 24 గ్రామపంచాయతీల్లో 1054, గంభీరావుపేటలో 17 గ్రామపంచాయతీల్లో 861, కోనరావుపేటలో 15 గ్రామపంచాయతీల్లో 277, వేములవాడ అర్బన్ మండలంలో తొమ్మిది గ్రామపంచాయతీల్లో 3702, ముస్తాబాద్ మండలంలో 1074, ఎల్లారెడ్డిపేట మండలంలో 16 గ్రామపంచాయతీల్లో 3949, తంగళ్లపల్లిలో 26 గ్రామపంచాయతీల్లో 3784, వేములవాడ రూరల్ మండలంలో 15 గ్రామపంచాయతీల్లో 214, రుద్రంగిలో రెండు గ్రామపంచాయతీల్లో 304, వీర్నపల్లిలో మూడు గ్రామపంచాయతీల్లో 71 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో ప్లాట్‌కు గత మార్కెట్ ధరలకు అనుగుణంగా కనీసం రూ 20 నుంచి రూ 50 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 25 శాతం రాయితీ ప్రకటించినా దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో భూముల ధరలు ఆశాజనకంగా లేకపోవడం, అమ్మకాలు లేకపోవడం, భూ సంబంధ వివాదాలు కేసులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడం వంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. మరోవైపు నిషేధిత ఖాతాల్లోకి అనేక ప్లాట్లు వెళ్లాయి. ఆ ప్లాట్ల క్రమబద్ధీకరణ కష్టమేనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.