కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం..
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:14 AM
ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగమయ్యారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగమయ్యారు. అరగంటలో నోటి కాడి ముద్ద తడిసిపోయింది. మండల కేంద్రాలతో పాటు రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి, రాచర్లతిమ్మాపూర్, రాచర్లగుండారం, పదిర, హరిదాస్‌నగర్, దుమాల, అల్మాస్‌పూర్, రాజన్నపేట, మద్దిమల్ల, అడవిపదిర, గర్జనపల్లి తదితర గ్రామాల్లోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. తేమ శాతం ఎక్కువగా ఉందని నిర్వాహకులు పేర్కొనడంతో రైతులు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టారు. అకాల వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. దాంతో రైతులు ధాన్యం ఒక దగ్గరకు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎల్లారెడ్డిపేటలో తూకం వేసిన ధాన్యం సంచులు తడిసిపోయాయి. కేంద్రాల్లో కొనుగోళ్లు జాప్యం వల్ల ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసిముద్దయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయడంతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.