రైస్‌మిల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:04 AM
రైస్‌మిల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు.
భగత్‌నగర్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో సీఐటీయూ అనుబంధ కరీంనగర్ రైస్, ఆయిల్, సీడ్‌మిల్స్ ఆపరేటర్స్ లేబర్ యూనియన్ జిల్లా 11వ మహాసభలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వంద పడకల ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. పీఎఫ్ క్లెయిమ్స్, పెన్షన్స్‌లో వస్తున్న సమస్యలను రైస్‌మిల్లర్స్ పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు గడుస్తున్నా రైస్‌మిల్ ఆపరేటర్ల కనీస వేతన జీవో సవరణకు నోచుకోలేదనానరు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. సదాశివపల్లి చౌరస్తా వద్ద జంక్షన్‌ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను నియమించాలన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
రైస్‌మిల్, ఆయిల్ సీడ్ మిల్స్ ఆపరేటర్స్ లేబర్ యూనియన్ జిల్లాఅధ్యక్షులుగా గీట్ల ముకుందరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చల్ల లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సీహెచ్ భద్రయ్య, గట్టు సతీష్, ఎడ్ల మల్లారెడ్డి, దండు నర్సయ్య, కార్యదర్శులుగా కొప్పుల శంకర్, చల్ల చంద్రారెడ్డి, ముత్యాల శ్రీనివాస్‌రెడ్డి, ఎం వెంకటేష్, బైరం సమ్మయ్య, కోశాధికారిగా ఎస్ రమేష్, పది మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు.