పేరుకే నిషేధం..
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:01 AM
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుట్కా, పాన్‌మసాలా వంటి కొన్ని హానికరమైన పొగాకు ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(గుట్కా) యథేచ్ఛగా అమ్ముతున్నారు.
- యథేచ్ఛగా నిషేధిత పొగాకుఉత్పత్తుల విక్రయాలు
- షాపుల్లో తోరణాలుగా వేలాడదీసి అమ్మకాలు...
- చోద్యం చూస్తున్న అధికారులు
కరీంనగర్ క్రైం, జూలై 25 (ఆంఽద్రజ్యోతి): ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుట్కా, పాన్‌మసాలా వంటి కొన్ని హానికరమైన పొగాకు ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(గుట్కా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. పొగాకు ఉత్పత్తులతో మనుషులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులబారిన పడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించింది.
ఫ రోజుకు రూ. 30 లక్షల నుంచి 40 లక్షల వరకు అమ్మకాలు
జిల్లా వ్యాప్తంగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు కరీంనగర్‌లోనే రోజుకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు జరుగుతున్నాయి. ఇటువంటి నిషేధిత, ప్రాణాంతకమైన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నప్పటికీ ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల కిత్రం కరీంనగర్‌లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్నారు.
ఫ బీదర్ టు కరీంనగర్..
కర్ణాటకలోని బీదర్ నుంచి కరీంనగర్‌కు ఒక మినీట్రక్‌లో 304 బ్యాగ్‌లలో తరలిస్తున్న 2,500 నిషేధిత గుట్కా పాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.వీటి విలువ 76 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. ఇది బీదర్‌లో కొనుగోలు చేసిన ధర మాత్రమే. స్థానికంగా విక్రయిస్తే దీని విలువ కోటిరూపాయలపైగానే ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల నిషేధం ఉన్నప్పటికీ గుట్కా మాఫియా ఇంత బరితెగించి కరీంనగర్‌కు ఒక ట్రక్‌లో తీసుకువచ్చారు.
ఫ రెట్టింపు ధరకు విక్రయం
నిషేధం సాకు చూపుతూ గుట్కా మాఫియా రిటేల్ షాపులకు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. గుట్కాతో క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులు వస్తాయని చెబుతున్నా వాటికి అలవాటుపడ్డవారు మానుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా పాన్‌షాపులు, కిరాణషాపుల్లో గుట్కాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏ పాన్‌షాపు, కిరాణం షాపు చూసినా గుట్కా పాకెట్లు వేళాడుతూ దర్శనమిస్తాయి. రెండు రూపాయలకు లభించే గుట్కా ప్యాకెట్‌ను ప్రస్తుతం మార్కెట్‌లో 10 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిషేధిత గుట్కా విక్రయాలను అరికట్టడానికి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.