Share News

తెలంగాణలో ఆగమైన ఉద్యోగుల బతుకులు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:28 AM

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

  తెలంగాణలో ఆగమైన ఉద్యోగుల బతుకులు
సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి

సుభాష్‌నగర్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంప్లాయిస్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌, టీఎన్‌జీవో ఫంక్షన్‌హాలులో వ్వయసాయశాఖ మినిస్ట్రియల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌(టీఏఎంఎస్‌ఏ) ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖలో ఉన్న క్యాడర్‌స్ట్రెంత్‌, విభాగ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, సంఘానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అధికారులతో చర్చలు జరిపి పరిష్కరించేందుకు కృషి చేయాలని సంఘం నిర్ణయించింది. అనంతరం దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరుతో 33 జిల్లాలుగా విభజన చేసి ఆర్డర్‌ టు సర్వీస్‌ పేరిట అర్ధరాత్రి వాట్సాప్‌లలో ఆర్డర్లు ఇస్తే వాటి ఆధారంగా జిల్లాలను ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు కానీ క్యాడర్‌ స్ట్రెంత్‌ను పెంచలేదని, అశాస్త్రీయంగా జోన్లను విభజించి స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలి చేశారని అన్నారు. ఉద్యోగులను అవినీతిపరులుగా చిత్రీకరించారని, భౌతిక దాడులను ప్రేరేపించారని, ప్రభుత్వ ఆఫీసుల్లో పెట్రోలు దాడులు జరిగాయని, తాళ్లు కట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీనెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు, స్టాటిస్టికల్‌ డిపార్ట్‌మెంట్‌, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖలో కేడర్‌స్ట్రెంత్‌ పెంచినట్లు చెప్పారు. మిగతా శాఖల్లోనూ క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంచి ఉద్యోగుల్లో పనిభారం తగ్గించి పరిపాలన సౌలభ్యం కోసం కృషి చేస్తోందన్నారు. త్వరలోనే ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు, పీఆర్‌సీ, హెల్త్‌కార్డుల విషయంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థంతంగా అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీల పేరిట కాలయాపన చేయకుండా సత్వరమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వ్యవసాయ మినిస్ట్రీయల్‌ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీహరి, సెక్రెటరీ అరుణ్‌కుమార్‌, టీఎన్‌జీఓఎస్‌ జిల్లా సెక్రెటరీ సంగం లక్ష్మణ్‌రావు, టాంసా జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, సెక్రెటరీ లవకుమార్‌, ఒంటెల రవీందర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:28 AM