ఇక మద్యం దుకాణాల జాతర
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:59 AM
మద్యం షాపుల లైసెన్స్‌లు నవంబరు 30వ తేదీ వరకు గడువు ఉంది.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల లైసెన్స్‌లు నవంబరు 30వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబరులో స్థానిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ రానుండడంతో రెండు నెలల ముందుగానే మద్యం షాపుల వేలం ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. గతంలో ఉన్న దరఖాస్తు ఫీజును (నాన్ రిఫండబుల్) రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది. మిగతా విషయాల్లో పాత పాలసీనే అనుసరించింది. జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజును వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30వ తేదీ వరకు నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
లాటరీ ద్వారా ఎంపిక
గతంలో మాదిరిగానే లాటరీ ద్వారా వైన్‌షాపుల లైసెన్స్‌దారులను ఎంపికచేయనున్నారు. మద్యం షాపు లైసెన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎక్సైజ్ టాక్స్‌ను గతంలో మాదిరిగా ఆరు విడతల్లో చెల్లించేందుకు వీలు కల్పించారు. కొత్త పాలసీ ప్రకారం మద్యం రిటైల్ షాపులన్నీ విధిగా మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కెమెరాలను ఎక్సైజ్ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తారని పాలసీలో పేర్కొన్నారు. వైన్స్ వద్ద విధిగా పార్కింగ్ స్థలాలను కూడా లైసెన్సుదారులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు
జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు ఏడాదికి 50 లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. 5001 జనాబా నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 55 లక్షలు, 50,001 జనాభా నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 60 లక్షల ఫీజును ఖరారు చేశారు. 1,00,001 జనాభా నుంచి ఐదు లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5,00,001 జనాబా నుంచి 20,00,000 జనాభా ఉన్న ప్రాంతాలకు 85 లక్షలు, 20 లక్షలపైగా జనాభా ఉన్న ప్రాంతాలకు కోటి 10 లక్షల లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. వైన్‌షాపులకు సింగిల్ దరఖాస్తు వచ్చిన సందర్భంలో ఆ మద్యం షాపులను ముందుగానే ఖరారు చేసి ప్రకటిస్తారు. ఒకటికి మించి దరఖాస్తులు వచ్చిన సందర్భంలో లాటరీ ద్వారా లైసెన్స్‌దారులను ఖరారు చేయనున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో గతంలో మాదిరిగానే 3 లక్షల రూపాయల డీడీ లేదా చాలన్ జతచేసి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు స్లాబ్‌లు
ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం షాపులు మూడు స్లాబ్‌ల పరిధిలోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, నగర పంచాయతీల పరిధిలోని వైన్‌షాపులకు 50 లక్షలు, 55 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 65 లక్షల రూపాయల ఎక్సైజ్ టాక్స్ వర్తిస్తుంది. ఈ ఎక్సైజ్ టాక్స్‌లోనే పర్మిట్‌రూంల ఫీజులు కూడా కలిసి ఉన్నాయి. మద్యం అమ్మకాలు లైసెన్సు ఫీజుల్లో 10 రెట్ల వరకు మార్జిన్ విధానాన్ని అమలు చేయనున్నారు. మద్యం అమ్మకాలు లైసెన్సు ఫీజు కంటే 10 రెట్లకు మించి జరిగితే లైసెన్సీల మార్జిన్ 4 శాతానికి తగ్గించారు. మద్యం వ్యాపారులకు ఆర్డీనరీ మద్యం అమ్మకాలపై 27 శాతం, మీడియం రకం అమ్మకాలపై 20 శాతం, బీర్‌పై 20 శాతం మార్జిన్‌ను ప్రభుత్వం ప్రకటించింది.
ఫ వైన్‌షాపుల వేళలు....
వైన్ షాపులు తెరచి ఉంచే సమయాలను ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
నేడు నోటిఫికేషన్
జిల్లాలోని 94 వైన్‌షాపుల వేలం ద్వారా లైసెన్స్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం కలెక్టర్ జారీ చేయనున్నారు. అదే రోజు (26వ తేదీ) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై అక్టోబరు 18వ తేదీ సాయంత్రం వరకు చివరి గడువుగా నిర్ణయించారు. 23వ తేదిన లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు. వైన్‌షాపుల లైసెన్స్‌కు ఎంపికైన వారికి 23న లైసెన్స్ ఫీజు మొదటి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. నవంబరు 30న కొత్త వైన్‌షాపులకు మద్యం స్టాక్‌ను జారీ చేస్తారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త లైసెన్స్‌దారులు మద్యం అమ్మకాలను ప్రారంభిస్తారు.
వైన్‌షాపులకు రిజర్వేషన్లు ఖరారు....
జిల్లాలోని 94 వైన్‌షాపులకు కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. వైన్‌షాపుల లైసెన్స్‌ల కేటాయింపులో గౌడ కులస్థుల, ఎస్సీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్‌సీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ సమక్షంలో గురువారం కలెక్టరేట్‌లో వైన్‌షాపుల రిజర్వేషన్‌లను లాటరీ ద్వారా ఖరారు చేశారు. మద్యం షాపుల లైసెన్స్‌లలో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు ఐదు శాతం రిజన్వేన్వేషన్లను అమలు చేస్తున్నారు. మిగతా 70 శాతం షాపులు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. జిల్లాలో మొత్తం 94 షాపులుండగా డ్రా ద్వారా ఎస్సీలకు -9, గౌడ కులస్థులకు-17 మొత్తం 26 షాపులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ 26 వైన్‌షాపులకు రిజర్వేషన్ ఉన్న కేటగిరీ వారే లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 68 వైన్‌షాపులకు అన్ని కేటగిరీలకు (ఓపెన్) చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీలకు 1, 13, 14, 17, 32, 56, 57, 76, 89 గెజిట్ షాపులు, గౌడ కులస్థులకు 2, 15, 19, 24, 26, 31, 43, 50, 52, 55, 63, 65, 71, 72, 78, 79, 91 షాపులు రిజర్వు అయినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి శ్రీనివాసరావు తెలిపారు.