రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కల్వకుంట్ల కుటుంబం
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:54 AM
తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, కర్మాగార, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, కర్మాగార, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి పంక్షన్ హాల్‌లో సకల జనుల ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరైన్నారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తాలో ఆయనకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ, మహేష్ బి. గీతే, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి రాగుల రాములు అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌వెంకటస్వామి మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి కోరిక మేర కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో జౌళిశాఖ నుంచి కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీలుగా పార్లమెంట్‌లో కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడినాక తొమ్మిదన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల గురించి మర్చిపోయిందని, కల్వకుంట్ల కుటుంబం కోసమే పనిచేసిందని ఆరోపించారు. సిరిసిల్లలో ఒకప్పుడు ఇసుక మాఫియా ఉండేదని, ఆ మాఫియాతోనే దళితులు చనిపోయారని, మరికొందరిపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి అండగా నిలిచిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ఖజానా ఖాళీ చేసినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో బొట్టు నీళ్లు కూడా ఉపయోగపడలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైందని, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిందని కేటీఆర్ ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు అందించాలని గతంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం రూ 30 వేల కోట్లతో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ఆ ప్రాజెక్టు కోసం రూ 11 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే తప్ప కాళేశ్వరం ద్వారా హైదరాబాద్‌కు చుక్క నీరు రాలేదన్నారు. కమీషన్ల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంనకు మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ కోసం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి దోపిడీ జరిగిందని కేటీఆర్ సొంత చెల్లే కవిత చెబుతుంటే దానిపై కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నాడని అన్నారు. జిల్లా అభివృద్దికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నాడన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక ధార్మిక క్షేత్రమైన సిరిసిల్ల జిల్లాకు కార్మిక మంత్రిగా వివేక్‌వెంకటస్వామి మొదటి సారిగా వచ్చారని, జౌళిశాఖపై అవగాహన ఉన్న వివేక్‌వెంకటస్వామి సిరిసిల్ల కార్మికులకు అండదండలు అందించాలని కోరారు. నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవశ్యకతను నాడు ఏఐసీసీని మెప్పించి ఒప్పించిన వారిలో మొదటివాడు కాకానే అని అన్నారు. ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న వివేక్‌వెంకటస్వామి ఎంపీగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్స్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, సబేరా బేగం, విజయతిరుపతి, రాణి, రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రొడ్డ రాంచంద్రం, మాజీ కౌన్సిలర్లు రాగుల జగన్, సిరిగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.