Share News

తీరని ‘కౌలు’ కష్టం

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:49 AM

సొంత భూములు లేని రైతులు వ్యవసాయం చేయడానికి కౌలుకు తీసుకొని పంటలు వేస్తున్నా యేటేటా పెరుగుతున్న కౌలు ధరలు కృంగదీస్తున్నాయి. పొద్దంతా ఎవుసంతోనే కష్టపడుతున్నా కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగానే కొనసాగుతోంది. భూతల్లిని నమ్ముకొని బతుకుతున్న కౌలు రైతులకు యేటా పెరుగుతున్న కౌలు ధరలకు తోడుగా పంటలకు తెచ్చిన అప్పుల వడ్డీ భారంగానే మారుతోంది. గత ప్రభుత్వం రైతుబంధు ప్రయోజనం కేవలం పట్టాదారులకు మాత్రమే కల్పించింది.

తీరని ‘కౌలు’ కష్టం

- నేరవేరని ఆత్మీయ భరోసా

- పెరుగుతున్న కౌలు ధరలతో నలిగిపోతున్న రైతులు

- పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులే దిక్కు

- పట్టాదారులకే పరిమితమైన పథకాలు

- సాగులో సగంపైగా కౌలు రైతులే

- జిల్లాలో 80 వేలకు పైగా కౌలు రైతులు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సొంత భూములు లేని రైతులు వ్యవసాయం చేయడానికి కౌలుకు తీసుకొని పంటలు వేస్తున్నా యేటేటా పెరుగుతున్న కౌలు ధరలు కృంగదీస్తున్నాయి. పొద్దంతా ఎవుసంతోనే కష్టపడుతున్నా కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగానే కొనసాగుతోంది. భూతల్లిని నమ్ముకొని బతుకుతున్న కౌలు రైతులకు యేటా పెరుగుతున్న కౌలు ధరలకు తోడుగా పంటలకు తెచ్చిన అప్పుల వడ్డీ భారంగానే మారుతోంది. గత ప్రభుత్వం రైతుబంధు ప్రయోజనం కేవలం పట్టాదారులకు మాత్రమే కల్పించింది. బ్యాంక్‌ రుణాలు కూడా పట్టాదారులకే ఇచ్చే అవకాశం ఉండడంతో కౌలు రైతులు పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకవచ్చింది. రైతు భరోసాలో కౌలు రైతులకు సాయం అందిస్తామని క్షేత్ర స్థాయిలో సర్వే చేసినా కౌలు రైతులకు మాత్రం అందడంలేదు. కౌలు రైతులకు ఆత్మీయ భరోసా అగమ్యగోచరంగానే మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 80 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రతీసారి వానాకాలం సీజన్‌లో రెండు పంటలకు కలిపి కౌలు ధరలు నిర్ణయించుకుంటారు. కొన్నిచోట్ల సీజన్ల వారీగా కౌలు ధరలు ఉన్నాయి. ప్రతియేటా కౌలు ధరలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులతో పాటు కౌలుదారులకు కూడా సాయం అందించడానికి హామీ ఇచ్చినా ఇంకా అమల్లోకి రాలేదు. జిల్లాలో రైతులకు యేటా ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కౌలుదారులకు రూ.12వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. పట్టాదారు రైతులకు మాత్రమే యాసంగిలో భరోసా అందించారు. కౌలు రైతుల ఊసే ఎత్తలేదు. వరి సాగులో సన్నరకానికి బోనస్‌గా రూ.500 ఇవ్వడం కొంత రైతులకు ఊరటగా మారింది.

కౌలు ధరలతో అయోమయం..

జిల్లాలో కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్‌, మిడ్‌ మానేరు, అనంతారం ప్రాజెక్ట్‌లతో పాటు చెరువుల్లోకి ఎత్తిపోతలతో నీళ్లు నింపడం, సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌లో 2లక్షల 43వేల 773ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని ప్రాంతాలను బట్టి కూడా కౌలు ధరలు, ఒప్పందాలు మారుతున్నాయి. పత్తి ఒకే పంట వస్తుండడంతో ఒకే రేటు ఉండగా వరి, ఇతర పంటలకు సంబంధించి ఖరీఫ్‌, యాసంగి పంటకు కలిపి కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎకరానికి నీటి వసతి తక్కువగా ఉంటే రూ.10వేల నుంచి రూ.12వేల వరకు, సమృద్ధిగా నీటి వసతి ఉంటే రూ.15 నుంచి రూ.18 వేల వరకు కౌలు ధర నడుస్తోంది. జిల్లాలో 255 గ్రామపంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 5 లక్షల ఎకరాల వరకు సాగు భూములు ఉన్నా, సీజన్‌ను బట్టి 2 లక్షల పైచిలుకు ఎకరాల్లోనే సాగు జరుగుతుంది. జిల్లాలో ఒక ఎకరంలోపు సాగు భూములు ఉన్నవారు 79,354 మంది ఉన్నారు. వీరు తోటి రైతుల వద్ద మరో 2 నుంచి 5 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరితో పాటు మరో 15 వేల మంది ఎలాంటి భూములు లేకపోవడంతో కౌలు భూములపైనే ఆధారపడుతున్నారు. కౌలు రైతులకు గత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా రుణ అర్హత కార్డులు ఇచ్చారు. ప్రస్తుతం కార్డులు దూరమయ్యాయి. పట్టాదారులకు గత ప్రభుత్వం రైతు బంధు, ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందిస్తున్న కౌలు ధరలు మాత్రం తగ్గడం లేదు.

ప్రకృతి వైపరీత్యాలతో నష్టం...

కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్దనే అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన క్రమంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో కౌలు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగినప్పుడు కనీసం పరిహారం కూడా అందుకోలేని పరిస్థితుల్లో కౌలు రైతులు చితికిపోతున్నారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేకుండా ఉంది.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు 2.43 లక్షల ఎకరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సాగులో 2 లక్షల 43 వేల 773 ఎకరాల్లో వివిధ పంటలు వేయడానికి రైతులు సిద్ధమైనా ప్రధానంగా వరి, పత్తిసాగు ప్రధాన పంటలుగా సాగు చేస్తారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి లక్షా 84 వేల 860 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, జొన్నలు 14 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేశారు. ఇందుకోసం 56,568 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 1.84 లక్షల ఎకరాల వరి సాగు కోసం 56,568 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా, పెసర 4.08 క్వింటాళ్లు, మొక్కజొన్న 27.04 క్వింటాళ్లు, పత్తి 1,28,650 ప్యాకెట్లు, కందులు 122.5 క్వింటాళ్లు అవసరం కానున్నాయి. ఇందుకు ఎరువులు 56,060 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,370 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3,460 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,390 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4,115 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 725 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.

Updated Date - Jun 06 , 2025 | 12:49 AM