ధర్మపురి క్షేత్రంలో శ్రావణ సందడి
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:59 AM
శ్రావణ మాసం పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం భక్త జన సందడి నెలకొంది. అనేక మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు.
ఆలయాల్లో ఉద్యాపన, కుంకుమ పూజలు
ధర్మపురి, ఆగస్టు 15 ( ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసం పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం భక్త జన సందడి నెలకొంది. అనేక మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. తమ కుటుంబ సౌభాగ్యం కోసం మహిళలు నదీ తీరాన గల సంతోషీమాత, మహాలక్ష్మి, వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయాల్లో ఉద్యాపన పూజలు, కుంకుమ పూజలు జరిపారు. మహాలక్ష్మి ఆలయంలో అష్టోత్తరం, పంచామృతాభిషేకం, హరతి పూజలు చేసి నివేదన సమర్పించారు. ఆలయ అర్చకులు కొరిడె బాలక్రిష్ణ, మధ్వాచారి రాధికాపవన్‌కుమార్ అందంగా అలంకరణ చేసిన అమ్మవారలకు ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గల యాగశాల వద్ద ఆలయ ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు మోహనాచార్యా, విజయ్ లక్ష్మీ హవనం నిర్వహించారు. అనేక మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాల్లో స్వామివారలను దర్శనం చేసుకున్నారు. రాత్రి వరకు భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
మహిళ సామూహిక కుంకుమార్చన
ఽధర్మపురి క్షేత్రంలోని లక్ష్మినరసింహస్వామి అనుబంధ రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మహిళలు సామూహిక కుంకుమార్చన శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు లక్ష్మి అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి హారతి, మంత్రపుష్పం కార్యక్రమాల అనంతరం తీర్థ, ప్రసాద వితరణ చేశారు.
యమధర్మరాజు ఆలయంలో అభిషేకం
ఽధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి అనుబంధ యమ ధర్మరాజు ఆలయంలో శుక్రవారం స్వామి వారలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భరణి నక్షత్రం సందర్భంగా ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ, ఒద్దిపర్తి కళ్యాణ్‌కుమార్ స్వామి వారికి రుద్రాభిషేకం, పురుషసూక్తం, లక్ష్మీసూక్తం, మన్యసూక్తంతో అభిషేకం, ఆయుష్య హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వరకు భక్తులు గండ దీపంలో నూనె పోసి స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ధర్మకర్త రాపర్తి సాయికిరణ్, అభిషేక్ పౌరోహితులు బొజ్జ సంతోష్‌కుమార్, సంపత్‌కుమార్, రాజగోపాల్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.