లక్ష్యం ఘనం..సాగు నామమాత్రం
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:16 AM
ఆయిల్‌పామ్ పంటను పెద్దఎత్తున సాగు చేయిస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించిన పాలకుల లక్ష్యం క్షేత్ర స్థాయిలో నెరవేరడం లేదు. ఇటు అధికారులు, అటు ఆయిల్‌పామ్ కంపెనీలు లక్ష్య సాధనలో చేతులెత్తేస్తున్నాయి.

జగిత్యాల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ పంటను పెద్దఎత్తున సాగు చేయిస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించిన పాలకుల లక్ష్యం క్షేత్ర స్థాయిలో నెరవేరడం లేదు. ఇటు అధికారులు, అటు ఆయిల్‌పామ్ కంపెనీలు లక్ష్య సాధనలో చేతులెత్తేస్తున్నాయి. అధికారులు, కంపెనీల తీరును తప్పు పడుతూ ఉన్నతాధికారులు పదేపదే హెచ్చరించినప్పటికీ పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 2023-24 సంవత్సరాల్లో మొత్తం 5 వేల ఎకరాల లక్ష్యానికి కేవలం 1832 ఎకరాల్లోనే పంటలు ఆయిల్ పాం పంటను సాగు చేయించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024-25 సంవత్సరంలో 3 వేల ఎకరాల లక్ష్యాన్ని కంపెనీలకు నిర్దేశించారు. కానీ అధికారులు, కంపెనీలు 602 ఎకరాల్లోనే పంటలు వేయించాయి.
ఫజిల్లాలో సాగు ఇలా...
జిల్లాలోని పలు మండలాల్లో 3 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పాం సాగు చేయాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ 893 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా సుమారు 2,289 ఎకరాలు సాగు చేయాలని సంకల్పించారు. 576 మంది రైతులకు గాను 1,462.75 ఎకరాల్లో సాగు చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు అందించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 602 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు అవుతోంది. జిల్లాలో ఆయిల్ పాం లక్ష్యం నెరవేర్చేడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా జిల్లా ఉద్యానవన అధికారి దేవప్రసాద్‌ను ఇటీవల కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు.
ఫఆశించిన మేర కాని సాగు..
పామాయిల్ సాగుకు ముందుగానే ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీలను ప్రభుత్వం గుర్తించగా నర్సరీల్లో మొక్కలు పెంచారు. పామాయిల్ తోటలు సాగు చేసిన నాలుగేళ్లకు పంట చేతికొస్తుంది. పంట చేతికొచ్చే లోపు ఫ్యాక్టరీ నెలకొల్పి ఆయిల్ ఉత్పత్తికి సిద్ధం చేస్తారు. జగిత్యాల జిల్లాకు రెండు కంపెనీలను ఇందుకు ఎంపిక చేశారు. ఈ కంపెనీలు నర్సరీలో మొక్కలు పెంచుతున్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన లక్ష్యాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆశించిన మేర సాగు అవడం లేదు. ముందుగా పామాయిల్ నాటిన రైతులు మొగి పురుగు సోకి, చెట్లు ఎదగక ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు శ్రమ అధికంగా ఉండడంతో పాటు పంట దిగుబడి వెంటనే రాకపోవడం, లాభసాటి ఫలితాలు కనిపించడం ఆలస్యం కావడంతో రైతులు ముందుకు రావట్లేదని భావిస్తున్నారు.
ఫఅందని ప్రోత్సాహకం..
రైతులకు ఆయిల్ పాం మొక్కలు రాయితీపై ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక్కో మొక్క ఖరీదు రూ.213 కాగా రైతు రూ.20 చెల్లిస్తే మిగితా రూ.193 ప్రభుత్వమే చెల్లించి రైతులకు సరఫరా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొక్కతో పాటు ఎరువులు, అంతరపంటల సాగుకు ఏడాదికి రూ.4,200 ఇస్తున్న ప్రోత్సాహంతో పలువురు రైతులు ఆయిల్ పాం తోటల సాగుకు ముందుకు వచ్చారు. మూడేళ్ల క్రితం నాటిన రైతులకు రెండేళ్ల వరకు ఏడాదికి రూ.4,200 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏడాదిగా ఇన్సెంటివ్ విడుదల కావడం లేదు. సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందనే ఉద్దేశంతో సాగుకు మందుకొచ్చిన రైతులు దిగులు చెందుతున్నారు. కాగా నూతనంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారిగా నియామకమైన శ్యామ్‌ప్రసాద్‌కు ఆయిల్ పాం సాగును లక్ష్యం మేరకు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.
ప్రోత్సాహ సొమ్ము రాలేదు
-దారిశెట్టి రాజేశ్, ఆయిల్ పాం రైతు, కోరుట్ల
ఆయిల్ పాం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహం అందడం లేదు. యేడాది కాలంగా ఇప్పటివరకు ఎకరానికి ప్రకటించిన రూ.4,200 ప్రోత్సాహక సొమ్ము రాలేదు. ఉద్యానవన శాఖ అధికారులను తరుచూ బదిలీ చేస్తుండడం సైతం సమస్యకు కారణమవుతోంది.
చెట్లకు పూత వస్తోంది
-నక్కల రవీందర్ రెడ్డి, రైతు, అంతర్గాం గ్రామం
అంతర్గాం గ్రామ శివారులో 2.20 ఎకరాల్లో ఆయిల్ పాం తోట సాగు చేస్తున్నా. 2023 ఫిబ్రవరిలో మొక్కలు నాటాను. ప్రస్తుతం 25 నెలలు పూర్తి కావస్తోంది. చెట్లకు పూత వస్తోంది. ఆయిల్ పాం సాగు మరింత పెరగాలంటే రైతులకు ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు ఇస్తూ ప్రోత్సహించాలి.
ఆయిల్ పాం సాగుపై ప్రత్యేక దృష్టి
-శ్యామ్ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
జిల్లాలో ఆయిల్ పాం సాగును లక్ష్యం మేరకు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో ఆయిల్ పాం సాగుపై సరియైున పర్యవేక్షణ జరగనందున లక్ష్యం నెరవేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయిల్ పాం సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. రైతులను ప్రోత్సహించి లక్ష్యం మేరకు సాగు చేస్తాం.
---------------------------------------------
జిల్లాలో ఆయిల్ పాం సాగు (ఎకరాల్లో)
---------------------------------------------
బీర్‌పూర్.......7
బీమారం.......25.225
బుగ్గారం.......44.35
ధర్మపురి.......55.275
ఎండపల్లి.......38.075
గొల్లపల్లి.......58.125
ఇబ్రహీంపట్నం......3.5
జగిత్యాల.......0
జగిత్యాల రూరల్.......48.8
కథలాపూర్.......16.725
కొడిమ్యాల.......43.925
కోరుట్ల.......14.575
మల్లాపూర్.......70.75
మల్యాల.......33.75
మేడిపల్లి.......5
మెట్‌పల్లి.......7.575
పెగడపల్లి.......31.65
రాయికల్.......45.175
సారంగపూర్.......4.725
వెల్గటూరు.......43.8
---------------------------------------------
మొత్తం......602
---------------------------------------------