పంచాయతీ నుంచే తొలిఅడుగు
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:29 AM
ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు స్థానిక సంస్థలు పెద్దపీట వేస్తాయి. స్వతంత్రంగా, వివిధ రాజ కీయ పార్టీల ద్వారా అనేక మంది రాజకీయాల్లోకి వస్తారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు స్థానిక సంస్థలు పెద్దపీట వేస్తాయి. స్వతంత్రంగా, వివిధ రాజ కీయ పార్టీల ద్వారా అనేక మంది రాజకీయాల్లోకి వస్తారు. మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సేవకు సిద్ధం అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందే నాయకులు ప్రజల సంక్షేమం కోరుతూ, గ్రామాలు పట్టణాల అభివృద్ధి కోసం పాటుపడే వారికి ప్రజల ఆదరణ ఉంటుంది. స్థానిక సంస్థల్లో వరుసగా గెలుపొంది వివిధ పదవులను అలంకరించడమే కాకుండా చట్టసభలకు వెళ్లేందుకు కూడా పలువురు నాయకులకు అవకాశం దక్కింది. అలా పెద్దపల్లి జిల్లాకు చెందిన గీట్ల ముకుంద రెడ్డి, బిరుదు రాజమల్లు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతకుంట విజయరమణారావు, చంద్రుపట్ల రాంరెడ్డి, పుట్ట మధుకర్, సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్, కాసిపేట లింగయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతుండగా, చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఫ సర్పంచ్‌లుగా..
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన గీట్ల ముకుందరెడ్డి మొదట స్వగ్రామమైన కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సర్పంచ్‌గా 1975లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1981లో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1994లో పోటీ చేసిన ప్పటికీ ఓటమి చెందారు. మరోసారి 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఫ ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామానికి చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ ద్వారా రాజకీయాల్లో అడుగు పెట్టారు. తొలిసారిగా ఆయన 1988లో జరిగిన పంచాయతీ ఎన్ని కల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం. ఆ తర్వాత 1995లో జరిగిన మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి ధర్మారం మండలం నుంచి జెడ్పిటిసిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పొత్తులో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం బీజేపీకి కేటాయించింది. దీంతో రామకృష్ణారెడ్డి జెడ్పిటిసి పదవికి రాజీనామా చేసి ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలు పొందారు. అనంతరం మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు.
ఫ సుల్తానాబాద్ కి చెందిన బిరుదు రాజమల్లు స్థానిక సంస్థల నుంచే చట్టసభలకు వెళ్లారు. ఆయన 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. అనంతరం 1985లో సుల్త్తానాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1988లో ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఫ ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రామ్‌రెడ్డి 1976, 1981లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రెండు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి మాజీ స్పీకర్ శ్రీపాదరావుపై విజయం సాధించారు.
ఫ ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా..
ప్రస్తుత పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు స్థానిక సంస్థల నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 1995లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో జూలపల్లి జెడ్పిటిసి గా పోటీ చేసే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓదెల జడ్పిటిసిగా పోటీ చేసినప్పటికీ గెలపొందలేదు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పెద్దపల్లి టికెట్ సాధించిన విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుం దరెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, 2023లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఫ గోదావరిఖనికి చెందిన కాసిపేట లింగయ్య టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2001లో జరిగిన మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో జూలపల్లి జెడ్పిటిసిగా గెలుపొందారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోగా ఉమ్మడి జిల్లాలోని నేరెళ్ల నియోజకవ ర్గాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. అక్కడి నుంచి పోటీచేసి ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.
ఫ గోదావరిఖనికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్‌ఎస్ యుఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అప్పటి మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ గెలుపొం దలేదు. దీంతో 2006లో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో ధర్మారం మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వరుసగా ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ, 2023లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా మంత్రి పదవి సైతం దక్కడం విశేషం.
ఫ మంథనికి చెందిన పుట్ట మధుకర్ ఎన్‌ఎస్‌యుఐ ద్వారా రాజకీయాల్లోకి రాగా ఆయన 2001లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలు పొందారు. అలాగే ఎంపీపీ కూడా చేశారు. 2006లో జరిగిన ఎన్నికల్లో మంథని నుంచి జెడ్పిటిసిగా పోటీ చేసి జిల్లా పరిషత్ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసిన పుట్ట మధుకర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెం దినప్పటికీ, 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కమాన్‌పూర్ మండలం నుంచి జెడ్పిటిసిగా పోటీ చేసి గెలుపొంది జెడ్పి చైర్మన్ అయ్యారు.
ఫ మున్సిపాలిటీ ద్వారా..
రామగుండం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొం దిన సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ సైతం మొదట రామగుండం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేసే గెలుపొందిన వారే. 1999లో రామగుండం మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన సోమారపు సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత 2009లో రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మె ల్యేగా పోటీచేసి విజయం సాధించారు. 2014లో టిఆర్‌ఎస్ అభ్య ర్థిగా పోటీ చేసిన ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2004లో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. 2014లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా గట్టి పోటీనిచ్చి ఓటమి చెందగా, 2018లో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ టికెట్ దక్కక పోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2023లో టిఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసినప్పటికీ విజయం సాధించ లేదు. జిల్లా నుంచి చట్టసభలకు ఎన్నికైన దాదాపు పది మంది నాయకులు స్థానిక సంస్థల నుంచే రావడంతో ఆ ఎన్నికలకు జిల్లాలో ప్రాధాన్యం ఏర్పడింది.