Share News

ముగిసిన తొలి విడత ప్రచారం

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:36 AM

తొలి విడతలో ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఈనెల 11న కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పంచాయతీలకు పోలింగ్‌ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

 ముగిసిన తొలి విడత ప్రచారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తొలి విడతలో ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఈనెల 11న కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పంచాయతీలకు పోలింగ్‌ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. తొలి విడతలో ఐదు మండలాల్లోని 92 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.

తొలి విడత ఎన్నికల వివరాలు

-----------------------------------

మండలం సర్పంచ్‌ స్థానాలు వార్డు సభ్యులు

----------------------------------------------------------------------

గంగాధర 33 296

రామడుగు 23 222

చొప్పదండి 16 154

కొత్తపల్లి 6 62

కరీంనగర్‌ రూరల్‌ 14 132

==========================================

చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో సర్పంచ్‌, ఎనిమిది వార్డులకు సింగిల్‌ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ పంచాయతీలో వడ్లకొండ తిరుమల ఏకగ్రీవ సర్పంచు ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం పెద్దకురమపల్లి పంచాయతీ సర్పంచ్‌గా మావురం సుగుణ, రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచ్‌గా ఒంటెల సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విడతలో ముగ్గురు సర్పంచ్‌లతోపాటు 276 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 89 సర్పంచ్‌ పదవులకు 338, 590 వార్డు సభ్యుల పదవులకు 1762 మంది పోటీపడుతున్నారు. ఈనెల 11న వీరి భవితవ్యం తేలనున్నది.

ఫ ప్రచారం బంద్‌....

తొలి విడత పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న ఐదు మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. మద్యం దుకాణాలను మూసివేశారు. మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 11న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామాగ్రిని సంబంధిత మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు ఇప్పటికే అందజేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ గౌస్‌ఆలం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఫ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం: కలెక్టర్‌

పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్‌ పీరియడ్‌ అమల్లోకి వస్తుందని, పోలింగ్‌ ముగిసే వరకు సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా పంచాయతీల పరిధిలో ఉండకూడదని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రశాంతవ ాతవరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని కలెక్టర్‌ సూచించారు.

ఫ మూడో విడత పంచాయతీల్లో ఉపసంహరణ పూర్తి

మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. ఈ విడతలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్‌, సైదాపూర్‌ మండలాలకు చెందిన 111 గ్రాపంచాయతీల సర్పంచ్‌ పదవులకు, 1,034 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మండలాల్లో ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం తర్వాత మంగళవారం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఈ విడతలో సైదాపూర్‌ మండలం ఆరెపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ పంచాయతీలో సర్పంచ్‌గా వర్నె లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇల్లందకుంట మండలం బోగంపాడు సర్పంచ్‌గా నిర్మల రఘుపతిరెడ్డి, వీణవంక మండలం మల్లన్నపల్లి సర్పంచుగా కలకొండ సరోజన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- హుజూరాబాద్‌ మండలంలో 20 గ్రామపంచాయతీల సర్పంచ్‌ పదవులకు 81 మంది పోటీలో ఉన్నారు. 196 వార్డుల్లో 30 వార్డుసభ్యులు ఏకగ్రీవం కాగా మిగిలిన 166 వార్డుల్లో 430 మంది పోటీచేస్తున్నారు.

- జమ్మికుంట మండలంలోని 20 పంచాయతీల్లోని సర్పంచ్‌ పదవులకు 90 మంది పోటీలో ఉన్నారు. 188 వార్డుల్లో 33 సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 155 వార్డులకు 461 మంది బరిలో ఉన్నారు.

- ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో ఒక సర్పంచ్‌ ఏకగ్రీవమైంది. 17 సర్పంచ్‌ పదవులకు 78 మంది పోటీలో ఉన్నారు. 166 వార్డుసభ్యుల స్థానాల్లో 34 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 132 స్థానాలకు 378 మంది పోటీలో ఉన్నారు.

- వీణవంక మండలంలోని 26 గ్రామాల్లోని సర్పంచ్‌ స్థానాల్లో ఒకటి ఏకగ్రీవమైంది. 25 పదవులకు 110 మంది పోటీలో ఉన్నారు. 246 వార్డుల్లో 25 ఏకగ్రీవమయ్యాయి. 221 వార్డులకు 622 మంది పోటీలో ఉన్నారు.

- సైదాపూర్‌ మండలంలోని 27 గ్రామాల్లో ఒక సర్పంచ్‌ స్థానం ఏకగ్రీవమైంది. 26 సర్పంచ్‌ పదవులకు 94 మంది పోటీలో ఉన్నారు. 238 వార్డుల్లో 62 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 176 వార్డులకు 438 మంది పోటీలో ఉన్నారు.

- మూడో విడత ఎన్నికలు జరిగే 108 సర్పంచ్‌ స్థానాలకు 453, 850 వార్డులకు 2,329 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు మంగళవారం గుర్తులు కేటాయించడంతో వారు ప్రచారాన్ని ప్రారంభించారు.

ఫ ఊపందుకున్న రెండో విడత ప్రచారం

రెండో విడతలో ఎన్నికలు జరుగనున్న గ్రామపంచాయతీల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో తిమ్మాపూర్‌, మానకొండూర్‌, చిగురుమామిడి, శంకరపట్నం, గన్నేరువరం మండలాల పరిధిలోని 113 గ్రామపంచాయతీలకు రెండు సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 111 సర్పంచు పదవులకు 438 మంది, 849 వార్డులకు 2,472 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఆయా గ్రామాల్లో ప్రచారంతో రాజకీయాలు వేడెక్కాయి.

Updated Date - Dec 10 , 2025 | 01:36 AM