కొండెక్కిన గుడ్డు
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:32 AM
కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి తగ్గడంతోపాటు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
గణేశ్‌నగర్ జూలై 15 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి తగ్గడంతోపాటు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కోడిగుడ్ల ధర తగ్గాలి. ఈసారి ఆ పరిస్థితి లేదు. మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏడు రూపాయలకు పైనే పలుకుతోంది. రెండు నెలల క్రితం వరకు గుడ్డు ధర ఐదు రూపాయలే ఉండేది. గ్రామాల్లో ఎనిమిది రూపాయల వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం గుడ్ల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతుండడంతో ఉత్పత్తిదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వినియోగదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ అమ్మకాలు తగ్గాయి..
- శెట్టి ప్రభాకర్, ఎగ్ సెంటర్ యాజమాని, కరీంనగర్
కోళ్ల దాణా ధరలు, లేబర్ ఖర్చులు పెరగడంతో కోడి గుడ్ల రేటు పెరిగింది. కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం కూడా ఓ కారణం. ధర పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. నెల రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.