Share News

వీడని ‘డీఎస్‌ఆర్‌’ పంచాయితీ

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:13 AM

గ్రామపంచాయతీలో పారదర్శకత పాలను పెంపొందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల యాప్‌లు, పోర్టర్లులు తీసుకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన డైలీ శానిటేషన్‌ రిపోర్ట్‌(డీఎస్‌ఆర్‌) యాప్‌ పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వానికి మధ్య వివాదాన్ని సృష్టించింది.

వీడని ‘డీఎస్‌ఆర్‌’ పంచాయితీ

- యాప్‌ను బహిష్కరించిన కార్యదర్శులు

- రెండు వారాలుగా అటెండెన్స్‌ వేయని తీరు

- ఉదయం హాజరుపై తీవ్ర వ్యతిరేకత

- షోకాజ్‌ నోటీసులు ఇచ్చేయోచనలో ఉన్నతాధికారులు..

- జిల్లాలో 236 మంది కార్యదర్శులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల )

గ్రామపంచాయతీలో పారదర్శకత పాలను పెంపొందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల యాప్‌లు, పోర్టర్లులు తీసుకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన డైలీ శానిటేషన్‌ రిపోర్ట్‌(డీఎస్‌ఆర్‌) యాప్‌ పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వానికి మధ్య వివాదాన్ని సృష్టించింది. పంచాయతీల్లో మెరుగైన పాలన కోసం తెచ్చిన కొత్త విధానం డీఆర్‌ఎస్‌ యాప్‌లో ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 8 గంటలలోపే అటెండెన్స్‌తో వేయాలి. దీంతోపాటు గ్రామపంచాయతీలో జరిగే శానిటేషన్‌ ఇతర పనులకు సంబంధించిన ప్రక్రియ ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఒత్తిడికి గురవుతున్న కార్యదర్శులకు కొత్తగా వచ్చిన డీఎస్‌ఆర్‌ యాప్‌ మరింత ఇబ్బందికరంగా మారడంతో దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వారాలుగా యాప్‌ ద్వారా అటెండెన్ప్‌ వేయడం లేదు. యాప్‌ను రద్దు చేయాలని కార్యదర్శులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో 260 గ్రామాలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా 260 గ్రామపంచాయతీలు ఉండగా, 236 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న కార్యదర్శుల ఆందోళనలో భాగంగా జిల్లా కార్యదర్శులు కూడా అదేబాటలో కొనసాగుతున్నారు. అటెండెన్స్‌ వేయకుండా వ్యతిరేకతను తెలుపుతున్నారు. యాప్‌లో అటెండెన్స్‌తోపాటు ఇతర వివరాలు ఫొటోలు కూడా అప్‌లోడ్‌ చేయవద్దని తీర్మానించారు. గ్రామ కార్యదర్శి యాప్‌ ద్వారా హాజరు నమోదు కాకుంటే సీఎల్‌గా పరిగణించాలని పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో పాటు షోకాజ్‌ నోటీసులు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే కొనసాగితే కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. గ్రామపంచాయతీలో పారదర్శకత పెంచే దిశగా తెచ్చిన డైలీ శానిటేషన్‌ రిపోర్ట్‌ యాప్‌లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య కార్యదర్శి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ నుంచి ప్లేస్‌ రికనైజేషన్‌, లైవ్‌ లొకేషన్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి. తరువాత పంచాయతీ కార్యాలయం లోపల బయట ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఎనిమిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా హాజరుపడదు. గ్రామంలోని పారిశుధ్యం తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రత, స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి వాటి ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. ఇంటింటికి వెళ్లి తీసుకువచ్చే తడి, పొడి చెత్త వేరు చేయించి వాటిని తూకం వేయించాలి. ఈ సమాచారాన్ని కూడా యాప్‌లో పొందపరచాలి. పల్లె ప్రగతి పనులతో పాటు విద్యుత్‌ బిల్లులు, బర్త్‌, డెత్త్‌ వివరాలను నమోదు చేయాలి. ఇందులో ప్రధానంగా గ్రామ కార్యదర్శులు ఉదయం హాజరు నమోదు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కుంటుపడనున్న పంచాయతీ పాలన..

జిల్లాలోని 260 గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేక పంచాయతీ కార్యదర్శుల ద్వారానే పారిశుధ్యం, ఇతర కార్యక్రమాలు నిర్వహణ కొనసాగుతోంది. పంచాయతీలో నిధులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న గ్రామాల్లో కొంతమేరకైనా పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో నిధుల ఇబ్బందితో కనీసం పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కూడా గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో పోయించలేని పరిస్థితిపై ఆవేదన చెందుతున్నారు. గ్రామపంచాయతీలో సిబ్బంది కొరత కారణంగా తీవ్ర పనిభారాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీఎస్‌ఆర్‌ ద్వారా పనులు కావాలంటే సిబ్బందిని పెంచాలని కోరుతున్నారు.

ఇప్పటికే అనేక యాప్‌లు..

ప్రభుత్వం ఇప్పటికే అనేక యాప్‌లను తీసుకురావడంతో ఫోన్లు పనిచేయని పరిస్థితి ఉందని కార్యదర్శులు వాపోతున్నారు. ప్రభుత్వపరంగా దాదాపు పదికి పైగా యాప్‌లను ఫోన్లో డౌన్లోడ్‌ చేసుకుని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాల సర్వేలు, ఇతర పనులు గ్రామాల్లో నిర్వహిస్తున్న తమకు డీఎస్‌ఆర్‌ ఇబ్బందికరంగానే ఉందని, అలాగే థర్డ్‌ పార్టీ యాప్‌ల వల్ల సైబర్‌ నేరగాళ్ల చేతిలో తమ వివరాలు వెళ్లే ప్రమాదం కూడా ఉందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 01:13 AM