కష్టసుఖాల కలనేత..
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:10 AM
మగువల మనసు దోచేలా రంగురంగుల దారాలతో అందమైన చీరలు నేయడం నేతన్నల గొప్పతనం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారులు తమ నైపుణ్యాన్ని ఖండాంతరాలు చాటారు. ఒకనాడు గొప్పగా ఉన్న చేనేత మగ్గాలు ఇప్పుడు మూగబోతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరమగ్గాలు అగ్ర భాగాన చేరి చేనేత ఉపాధిని దెబ్బతీసింది. చేనేతను వదిలి యువత పవర్‌లూమ్ పరిశ్రమ వైపు అడుగులు వేసి కష్టాలకు ఎదురీదుతుంటే, చేనేత మగ్గాలు వృద్ధులకే పరిమితమయ్యాయి.
- వృద్ధకార్మికులకే పరిమితమైన చేనేత రంగం
- మరమగ్గాల వైపే యువకుల మొగ్గు
- జిల్లాలో ఆరు సొసైటీల్లో వస్త్ర ఉత్పత్తి
- ఏటా రూ.2 కోట్ల విలువైన వస్త్రోత్పత్తి
- 169 చేనేత మగ్గాలు.. 325మంది కార్మికులు
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మగువల మనసు దోచేలా రంగురంగుల దారాలతో అందమైన చీరలు నేయడం నేతన్నల గొప్పతనం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారులు తమ నైపుణ్యాన్ని ఖండాంతరాలు చాటారు. ఒకనాడు గొప్పగా ఉన్న చేనేత మగ్గాలు ఇప్పుడు మూగబోతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరమగ్గాలు అగ్ర భాగాన చేరి చేనేత ఉపాధిని దెబ్బతీసింది. చేనేతను వదిలి యువత పవర్‌లూమ్ పరిశ్రమ వైపు అడుగులు వేసి కష్టాలకు ఎదురీదుతుంటే, చేనేత మగ్గాలు వృద్ధులకే పరిమితమయ్యాయి. చేనేత వస్త్ర పరిశ్రమను నిలబెట్టే దిశగా ప్రభుత్వం కార్మికుల కోసం పలు పథకాలు తీసుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. చేనేత కార్మికుల జీవన యానంలో కష్టసుఖాల కలనేత జీవితంగా ముందుకు సాగిపోతున్నారు. తాము బతకడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించిన చేనేత కార్మికులు కాలక్రమేణా సంభవిస్తున్న మార్పులతో కులవృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న వారున్నారు. జిల్లాలో చేనేత మగ్గం వృద్ధులకే పరిమితం కాగా యువకులు మరమగ్గాలవైపు మళ్లారు. కొంతమంది చేనేత కళను బతికించడానికి ప్రయత్నం చేస్తున్న వారున్నారు. సిరిసిల్లలో కొందరు యువకులు చేనేత మగ్గాలపై ఒకనాటి అగ్గిపెట్టెలో అమిరే చీర స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. విభిన్నమైన వస్త్రాలను తయారుచేస్తున్నారు. సిరిసిల్లలో మెట్‌పల్లి ఖాదీగ్రామోద్యోగ ప్రతిష్ఠాన్‌తో పాటు కొన్ని సహకార సంఘాలు కార్మికులకు కొంత చేయూతను, ఉపాధిని కల్పిస్తున్నాయి. చేనేత కార్మికుడికి పదిహేను రోజుల పాటు కష్టపడితే రూ 1500 నుంచి రూ.2000 వరకే కూలి లభిస్తోంది. చేనేత మగ్గాలకు కండెలు చుట్టే వృద్ధ మహిళలు ఒక నూలు లడి చుడితే రూ 10 రూపాయలు మాత్రమే లభిస్తాయి. పొద్దంతా చుడితే 50 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. చీరలోని గొప్పతనాన్ని చాటుతూ అగ్గిపెట్టెలో సైతం అమిరే చీర, కుట్టులేని దుస్తులు, మగ్గంపై మనుషుల చిత్రాలను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన సిరిసిల్ల చేనేత పరిశ్రమ ఉనికిని మాత్రం కొందరు యువకులు బతికించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని యెల్ది హరిప్రసాద్, నల్ల విజయ్ చేనేత, మరమగ్గాలపై వినూత్నంగా వస్త్రాలను తయారుచేస్తున్నారు. హరిప్రసాద్ తయారు చేసిన వస్త్రాలను ప్రధానమంత్రి మన్‌కీబాత్‌లో ప్రస్తావించడం, మూడవసారి ప్రమాణ స్వీకారానికి సైతం ఆహ్వానం అందుకొని వెళ్లారు. ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఒక అభిమాని ద్వారా డ్రెస్స్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చి తయారీ చేయించారు. హరిప్రసాద్, నల్ల విజయ్‌లు చేనేత రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులను కూడా అందుకున్నారు. హరిప్రసాద్ సతీమణి రేఖ కూడా చేనేత మగ్గంపై నేసిన పట్టు చీరకు రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకోబోతున్నారు.
ఫ తెగిపోతున్న పోగు బంధం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయం, తరువాత చేనేత రంగంపైనే అనేక దశాబ్దాలుగా ఉపాధి పొందారు. చేనేత మగ్గాలపై జరీ చీరల అంచులు తళుక్కున మెరిసేవి. మరమగ్గాల వైపు కార్మికులు మారడంలో వేలల్లో ఉన్న చేనేత మగ్గాలు వందల సంఖ్యకు చేరాయి. వాటి స్థానంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 35 వేల మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. దీంతో చేనేత మగ్గాలతో పోగు బంధం తెగిపోతోంది. జిల్లాలో చేనేత మగ్గాలు లయ తప్పాయి. చేనేత సహకార సొసైటీలు మూలనపడ్డాయి, ప్రస్తుతం జిల్లాలో ఆరు సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 35 వేల మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు ఆరు వేల వరకు ఉండగా, ఇప్పుడు జియోట్యాగింగ్ చేసిన ప్రకారం 169 మగ్గాలు ఉన్నాయి. ఈ మగ్గాలపై 325 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. ఉపాధి పొందుతున్నవారు కార్మికులు 212 మంది ఉన్నారు. చేనేత కళను బతికించడానికి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా గత ప్రభుత్వం 2017లో చేనేత లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులు 2662 మంది పథకంలో చేరారు. చేనేత లక్ష్మి పథకంలో చేరిన ఉద్యోగులు వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ పథకం మళ్లీ కొనసాగలేదు. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్ కింద రూ.1.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా రూ 50లక్షలతో మౌలిక వసతుల కేంద్రం ఆధునిక డిజైనతో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మొదటి విడతలో రూ 19.10 లక్షలు విడుదల చేయగా 300మంది లబ్ధిదారులు కొత్త డిజైన్ల అభివృద్ధి, చేనేత శిక్షణను పొందారు. జిల్లాలో ప్రతి సంవత్సరం రూ 2 కోట్ల చేనేత వస్త్రాలు ఉత్పత్తి జరుగుతున్నాయి. జిల్లాలో 169 చేనేత మగ్గాలు ఉండగా అందులో కొన్ని వినియోగంలో లేవు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ,చందుర్తి, బోయినపలి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేటలో మగ్గాలు ఉన్నాయి. ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ, సిరిసిల్ల సొసైటీ, జగదాంబ సోసైటీ, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపెల్లి సొసైటీలతో పాటు ఖాదీగ్రామోద్యోగు, తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి.
ఫ నేతన్నకు ‘అభయ హస్తం’
ప్రభుత్వం చేనేత, మరమగ్గాల కార్మికులకు మూడు పథకాలు అందించడానికి ఒకే గొడుగు కిందికి తీసుకవచ్చే చర్యలు చేపట్టింది. అభయహస్తం పేరుతో పొదుపు నిధి, బీమా భరోసా, చేనేత భరోసా, పథకాలను అందించే దిశగా చర్యలు చేపట్టింది. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు బతుకమ్మ చీరలస్థానంలో స్వశక్తి మహిళలకు అందించే చీరల ఆర్డర్లు, సర్వశిక్ష అభియాన్ వంటి ఆర్డర్లను అందించిన క్రమంలోనే నేతన్న పొదుపు నిధి, నేతన్న బీమా, నేతన్న భరోసా పథకాలను ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి నేతన్నకు అభయ హస్తం పేరుతో పథకాలను ముందుకు తీసుకరావడం, చేనేత భరోసా మార్గదర్శకాలు ప్రకటించడం కార్మికుల్లో హార్షం వ్యక్తం అవుతోంది. నేత కార్మికుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని భావిస్తున్నారు. ప్రాథమికంగా మూడు పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ 168 కోట్లు విడుదల చేశారు. నేతన్నకు అభయహస్తంలో భాగంగా మూడు పథకాలు ఒకే గొడుగు కిందికి చేర్చడంతో పాటు చేనేత కార్మికులు పొదుపు నిధికి అవకాశం కల్పించింది. చేనేత భరోసా పధకానికి 212 మంది కార్మికులను గుర్తించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ పథకంలో రూ 45 లక్షలు మంజూరు చేశారు. కార్మికులకు పావలా వడ్డీ పథకంలో 212 మంది కార్మికులకు రూ.15.6 లక్షలు సహకార సంఘాలకు అందించారు.
ఫ ఆగిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు
చేనేత సహకార సంఘాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. చేనేత జౌళి శాఖ రంగాల్లో ఉన్న సొసైటీల ఎన్నికల గడువు ముగిసి ఆరేళ్లు దాటిపోయినా పర్సన్ ఇన్‌చార్జిలతోనే సుదీర్ఘంగా కాలం వెల్లదీస్తున్నారు. గత సంవత్సరం జూన్‌లో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కాస్తా హడావిడి చేయడంతో కార్మికులు ఎన్నికలు జరుగుతాయని భావించారు. ఏర్పాట్ల వరకు వెళ్లి సంవత్సరం దగ్గర పడుతున్నా ఎన్నికల ఊసే మరిచారు. ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలు పెట్టినా ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. పాలకవర్గాల గడువు ముగిసి అరేళ్లు దాటినా పర్సన్ ఇన్‌చార్జీల కాలమే పొడిగిస్తున్నారు. గత సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న అన్ని సహకార సంఘాల కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికల అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చేనేత సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఐదేళ్లకొకసారి నిర్వహించాల్సిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013లో చివరిసారిగా నిర్వహించారు. వీరి పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది. ఆ సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని 40 రోజుల ముందే నోటిఫికేషన్ జారీచేసే విధంగా చేనేత కార్మికులతో ఓటు హక్కు అర్హత కలిగిన జాబితాను జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత సంవత్సరం మరోసారి ఎన్నికల నిర్వహణకు జాబితాలు సిద్ధం చేసినా ఎన్నికల వైపు అడుగులు పడలేదు.
ఫ సిరిసిల్లలో చేనేత విగ్రహం..
సిరిసిల్ల అనగానే మొదట గుర్తుకు వచ్చేది చేనేత, పవర్‌లూం కార్మికులు. వస్త్ర సంక్షోభంతో ఎప్పుడూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు సిరిసిల్ల సమస్యలతో ముందుంటుంది. సిరిసిల్లలో చేనేత మగ్గాలతో పాటు 35 వేల మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమలతో ఉంది. ఈక్రమంలో సిరిసిల్ల పాత బస్టాండ్‌లో 2010లో ఏర్పాటు చేసిన భారీ చేనేత కార్మికుడి కాంస్య విగ్రహం ఒక ప్రత్యేకతగా నిలిచింది.