తొలి విడత ప్రచారానికి తెర
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:34 AM
జిల్లాలోని తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్ని రోజులు మోత మోగిన మైక్‌లు మంగళవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
జగిత్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్ని రోజులు మోత మోగిన మైక్‌లు మంగళవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాలు, ఇతర ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. ఇదిలా ఉంటే జిల్లాలోని వైన్ షాపులు మూతపడ్డాయి. దీనికి తోడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో పలు ప్రత్యేక సెక్షన్ల అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో రాజకీయం పతాక స్థాయికి చేరింది.
ఫ118 పంచాయతీలకు ఎన్నికలు
జిల్లాలో కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 122 పంచాయతీలు, 1,172 వార్డు స్థానాలు ఉన్నాయి. ఏకగ్రీమైన స్థానాలకు మినహాయించగా గురువారం తొలి విడతలో 118 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలు, వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్, బీమారం మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 461 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,952 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో చివరి రోజు విస్తృతంగా ప్రచారం చేశారు. తొలి విడతలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగుతుండగా, ఈ మూడు పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు ఓట్లను రాబుట్టుకోవడంపై దృష్టి పెట్టారు. అలాగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువ వార్డుల్లో ప్రచారం చేశారు.
ఫతొలి విడతలో 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
తొలి విడతలో 122 పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండగా 4 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 118 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 461 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,172 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, కథలాపూర్ మండలం రాజారాం తండా, మేడిపల్లి మండలం విలయతాబాద్‌లో ఒక్కో వార్డు స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. 349 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 821 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,952 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఫమద్యం దుకాణాలు బంద్..
ఎన్నికలకు మరొక్క రోజే గడువు ఉండటంతో అభ్యర్థులు ఓట్లు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ వస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ప్రలోభాలకు తెర లేపబోతున్నారు. పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టిన అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పగిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల ఏజెంట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాట్లాడి డబ్బులు సమకూర్చుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలపై దృష్టి కేంద్రీకరించి, వారికి పెద్దఎత్తున నగదు పంపిణీ చేసే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇలా గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఇన్నాళ్లు ప్రచారం చేయగా, ఇప్పుడు ప్రలోభాలకు తెర లేపబోతున్నారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు ముగిసేవరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచుతున్నారు.
ఫప్రత్యేక బృందాల తనిఖీలు
అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పోటీ పడుతున్నారు. కుల, సంఘాలు, మహిళలు, యువ ఓటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. మహిళా ఓటర్లే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. అయితే ఎన్నికలు నిష్పక్షపాత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే అభ్యర్థులతో పాటు ఇతరులపై కూడా చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అధికారులు అదనపు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఆంక్షలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటించారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.