కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:54 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం వర్షంలోను భక్తులు రాజన్న ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
- వర్షంలోనూ రాజన్న దర్శనం కోసం బారులు
- ఆలయంలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు
వేములవాడ కల్చరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం వర్షంలోను భక్తులు రాజన్న ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. రాజన్నకు ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
- ఘనంగా గోకులాష్టమి వేడుకలు...
శ్రావణ మాసంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం 6.30 గంటలకు అర్చకులు అన్ని వైష్ణవ దేవాలయాల్లో అభిషేకము, అర్చనలను ఘనంగా నిర్వహించారు. భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాలమున మహాపూజ చేపట్టారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో ఉట్లు కొట్టుట, డోలోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజన్న ఆలయ ఈవో రాధాబాయి, ఏఈవోలు, సూపరింటెండెంట్‌లు తదితరులు హజరయ్యారు. వేములవాడ పట్టణంలోని యాదవ్ యూత్ ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టవి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువకులు పెద్ద సంఖ్యలో హజరై ఉట్టికొట్టుట కార్యక్రమంలో ఉత్సహంగా పాల్గొన్నారు.