Share News

ఓటెత్తిన చైతన్యం

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:40 AM

మలి విడత పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు చైతన్యం చూపించాయి.

ఓటెత్తిన చైతన్యం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మలి విడత పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు చైతన్యం చూపించాయి. గ్రామ పాలకవర్గాలను ఎన్నుకోవడానికి ఎంతో ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 84.41 శాతం ఓటింగ్‌ జరిగింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడతలో తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండలాల్లో 88 పంచాయతీలు ఉండగా 11 ఏకగ్రీవమయ్యాయి. 758 వార్డుల్లో 228 మంది ఏకగ్రీవం కాగా 77 సర్పంచ్‌, 530 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్‌ స్థానాలకు 279 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 1342 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎన్నికల ఓటింగ్‌, కౌంటింగ్‌ కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ చలితో ఓటర్లు నెమ్మదిగా వచ్చారు. 9 గంటల వరకు 20.27 శాతం పోలింగ్‌ జరగగా 11 గంటల వరకు వేగం పుచ్చుకుంది. 51.14 శాతం ఓటింగ్‌ జరిగింది. ఇదే వరుసలో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్‌నగర్‌లో మాత్రం ఓటర్లు 12.30 గంటల తర్వాతనే ఓటింగ్‌ వచ్చారు. దీంతో అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బిగితే, అదనపు కలెక్టర్‌ నగేష్‌లు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.

మలి విడతలో పోలైన ఓట్లు...88553

జిల్లాలో మలి విడతలో బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో 77 గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో 80.77 శాతం ఓటింగ్‌ జరిగింది. ఓటింగ్‌లో అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో 85.12శాతం, బోయినపల్లిలో 84.77 శాతం, తంగళ్ళపల్లిలో 83.47 శాతం ఓటింగ్‌ జరిగింది. మూడు మండలాల్లో 1,04,905 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 50,773 మంది మహిళలు 54,131 మంది ఉన్నారు. పోలింగ్‌లో 88,553 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 42,023 మంది, మహిళలు 46,529 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే 4,506 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. పురుషులు 82.77 శాతం, మహిళలు 85.96శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థుల అనుచరులు ప్రచారం చేశారు. అభ్యర్థుల మద్దతుదారులతో పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడిగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి స్వయంగా ఓటర్ల వద్దకు వెళ్లి వారిని పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు నానా పాట్లు పడ్డారు.

ఎన్నికల విధుల్లో 2003 మంది సిబ్బంది

రెండో విడతలోని బోయిన్‌పల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో 77 గ్రామాల్లో 530 పోలింగ్‌ కేంద్రాల ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో 2003 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు 910మంది, ఇతర సిబ్బంది 1093 మంది పాల్గొన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత చేపట్టే ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. 195 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం నుంచి పరిశీలించారు.

భారీగా పోలీసు బందోబస్తు

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా. ఎస్పీ మహేష్‌ బీగీతే పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు 700 మంది పోలీసులు, 26 రూట్లలో మొబైల్‌ బృందాలు, ఏడు జోనల్‌ బృందాలు, మూడు క్విక్‌ రియాక్షన్‌ బృందాలు, రెండు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు పనిచేశాయి జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తు పర్యవేక్షించారు. మూడు మండలాల్లో ముందుగానే 19 సమస్యాత్మక, సున్నితమైన గ్రామాలను గుర్తించి అదనపు బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది.

జోరుగా నగదు పంపిణీ

గెలుపే లక్ష్యంగా తగ్గేది లేదన్నట్లుగా అభ్యర్థులు పోలింగ్‌ జరుగుతుండగా కూడా రాని ఓటర్ల వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేస్తూ కేంద్రాలకు తరలించడం కనిపించింది. రెండో విడతలో ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు మద్యం, మాంసం నగదు పంపిణీ చేశారు. అయినా కొందరు పోలింగ్‌ మొదలైన రాకపోవడంతో వారిని మళ్లీ బుజ్జగించి పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇలా అన్ని గ్రామాల్లో ఓటరు రూ 2 వేల వరకు పంపిణీ చేశారు.

ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌

జిల్లాలోని మూడు మండలాల్లో 77 సర్పంచ్‌ స్థానాలు, 530 వార్డు సభ్యుల అభ్యర్థులపై ఓటర్లు తీర్పునివ్వగా అధికారులు ఫలితాలు వెల్లడించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మొదలైన కౌంటింగ్‌ ఉత్కంఠగా సాగింది కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, అభ్యర్థుల అనుచరులు పెద్దఎత్తున గుమిగూడి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. సర్పంచ్‌, వార్డుల పలితాలు వెల్లడిస్తుండగానే గెలిచిన అభ్యర్థుల అనుచరులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు.

పోలింగ్‌ సరళి ఇలా

మండలం 9గంటలకు 11గంటలకు 1.00గంటకు(ఫైనల్‌)

బోయిన్‌పల్లి 18.25శాతం 47.97 శాతం 84.77శాతం

ఇల్లంతకుంట 23.81శాతం 56.70 శాతం 85.12 శాతం

తంగళ్లపల్లి 18.57 శాతం 48.47 శాతం 83.47 శాతం

----------------------------------------------------------------------------------------

మొత్తం 20.27 51.14 84.41

----------------------------------------------------------------------------------------

మండలాల వారీగా పోలైన ఓట్లు

మండలం మొత్తం ఓటర్లు 9గంటలకు 11గంటలకు 1.00గంటకు(ఫైనల్‌)

బోయిన్‌పల్లి 30505 5568 14632 25858

ఇల్లంతకుంట 35932 8556 20372 30584

తంగళ్లపల్లి 38468 7144 18645 32111

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 104905 21268 53649 88553

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 15 , 2025 | 01:40 AM