‘స్థానిక’ పోరుకు మోగిన నగరా
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:05 AM
‘స్థానిక’ సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
- ఎన్నికల షెడ్యూల్ విడుదల
- 9న నోటిఫికేషన్ జారీ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
‘స్థానిక’ సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీనితో ఈరోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే నవంబరు 11వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఐదు విడతల్లో మండల, జిల్లా ప్రాదేశిక, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.
ఫ జిల్లాలో 5,07,531 మంది ఓటర్లు
జిల్లాలో 15 జడ్పీటీసీ, 15 ఎంపీపీ, 170 ఎంపీటీసీ, 318 గ్రామపంచాయతీ సర్పంచ్, 2,962 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించారు. జిల్లాలో 5,07,531 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం 934 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్టోబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. అక్టోబరు 23,27 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత అక్టోబరు 31, నవంబరు 4,8 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు పంచాయతీ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు 50 వేలకు మించి నగదును తీసుకొని వెళ్ళేఅవకాశముండదు.
ఫ ‘స్థానిక’ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నవంబరు 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటి వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పారు.