బల్దియాలపై బకాయిల భారం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:59 AM
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 275 భవనాలు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
బల్దియాలకు ఆస్తి పన్నుల ఆదాయమే ప్రధానంగా భావిస్తారు. మున్సిపల్ నిర్వహణ, పట్టణాల అభివృద్ధికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మాసాల్లో కమిషనర్ నుంచి మొదలుకొని బిల్‌కలెక్టర్ల వరకు పన్నుల వసూళ్లు ప్రధాన పనిగా భావిస్తారు. ప్రజల నుంచి పన్నుల వసూళ్లు పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే రెండు మున్సిపాలిటీలకు సర్కార్ నుంచి రావాల్సిన ఆస్తి పన్నుల బకాయిలు భారంగా మారుతున్నాయి. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గృహ, కమర్షియల్ ఆస్తిపన్నుల వసూళ్లలో ముందు వరుసలో నిలుస్తున్న ప్రభుత్వ బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. రెండు మున్సిపాలిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాల నుంచి రావలసిన బకాయిలు ఎప్పుడు వస్తాయో స్పష్టత కూడా ఉండడం లేదు.
ఫ సగానికి పైగా వడ్డీ భారమే..
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 275 భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ 19.79 కోట్లు ఆస్తి పన్నుల బకాయిలు రావాల్సి ఉంది. ఆస్తి పన్నుల బకాయిలు సగానికి పైగా వడ్డీ భారమే ఉంది. సిరిసిల్ల మున్సిపాలిటీకి రావాల్సిన డిమాండ్‌లో 63 భవనాల నుంచి రూ 3.47 కోట్లు వసూళు లక్ష్యంగా ఉంది. బకాయిల్లో వడ్డీ రూ.2.01 కోట్లు ఉంది. ఇందులో ప్రతి సంవత్సరం రూ 24.05 లక్షలు పన్నులు రావాల్సి ఉంది. ఇందులో మూడు కేంద్ర ప్రభుత్వ భవనాలకు రూ 1.29 లక్షలు పాత బకాయిలు కలుపుకొని రూ 25.79 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 63 భవనాల నుంచి రూ 22.76లక్షలు ఉండగా పాత బకాయిలు కలుపుకొని రూ 3.21కోట్లు వసూళ్ల లక్ష్యం ఉంది. ఇందులో రూ 9.53 లక్షలు వసూలు కాగా ప్రభుత్వం నుంచి రూ 3.37కోట్లు వసూలు కావలసి ఉంది. ఇందులో వడ్డీ రూ 2కోట్లు ఉన్నాయి. వేములవాడ మున్సిపాలిటీలో 212 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ 16.68 కోట్ల బకాయిల వసూలు లక్ష్యం ఉంది. బకాయిలపై వడ్డీ రూ8.42 ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు భవనాలు ఉండగా రూ 1.29 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 210 భవనాల నుంచి రూ 16.67 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ 26.27లక్షలు వసూలు కాగా, బకాయిలు రూ 16.42 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు అసలు కంటే వడ్డీని రెట్టింపు అవుతోంది. మున్సిపాలిటీలో నుంచి నోటీసులు వెళ్లిన అధికారులు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదని సమాధానం వస్తోంది.
ఫ గతేడాది రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం..
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు గృహాలు, కమర్షియల్ భవనాలకు సంబంధించి ఆస్తి పన్నుల వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలుస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు రూ 9.60 కోట్లు పన్నులు వసూలు చేసి రికార్డ్ సాధించాయి. సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలోనే ప్రధమంగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నులు మినహా సిరిసిల్ల మున్సిపాలిటీలో 23487 ఇళ్లకు రూ 6.36 కోట్లు లక్ష్యానికి రూ 6.13కోట్లతో 96.99 శాతంతో ముందంజలో నిలిచారు. వేములవాడ మున్సిపాలిటీలో రూ 4.07 కోట్ల లక్ష్యానికి రూ 3.47కోట్లు వసూలు చేసి 85.14 శాతం సాధించింది. 2025-26 ఆస్తి పన్నులకు సంబంధించి సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ 9.75 కోట్ల లక్ష్యంగా ఉండగా, ఇందులో ఎర్లీబర్డ్‌లో 5 శాతం రాయితీని 5117ఇళ్లకు సంబంధించి రూ2.37 కోట్లు వసూలు కాగా, 24.31శాతం ఉంది. మిగిలిన బకాయిలు 23738 ఆస్తులకు సంబంధించి రూ.3.27 కోట్లు ఉంది. ఇందులో గృహాలు,కమర్షియల్ 2947 ఉండగా రూ.91.09 లక్షలు, 2634 కమర్షియల్ భవనాలు ఉండగా రూ 83.27లక్షలు. 18157 గృహాలు ఉండగా రూ 1.52కోట్ల పన్నులు వసుళ్లు చేస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 14831 ఆస్తులకు సంబంధించి రూ 4.33 కోట్ల లక్ష్యంగా ఉండగా ఇందులో ఎర్లీబర్డ్‌లో 5 శాతం రాయితీతో పాటు ఇప్పటివరకు రూ 1.83 కోట్లు వసూలు కాగా మిగిలిన బకాయిలు రూ.2.50 కోట్లు ఉంది. ఇందులో గృహాలు, కమర్షియల్ 1171 ఉండగా రూ 38.67 లక్షలు, 2297 కమర్షియల్ భవనాలు ఉండగా రూ 50.70 లక్షలు. 11363 గృహాలు ఇండగా రూ 37.85 కోట్ల పన్నులు వసుళ్లు చేస్తున్నారు.