నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:46 AM
అంగన్‌వాడీ టీచర్‌పై అఘాత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించడంతోపాటు ఆమెకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ టీచర్‌పై అఘాత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించడంతోపాటు ఆమెకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌లకు స్కూటీలను అందించాలన్నారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామ శివారులోని లోద్ది తండాలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న మాజోజు స్వరూప తన విధులను ముగించుకుని సోమవారం సాయంత్రం మద్దిమల్ల గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో అదే దారిలో ఒక వ్యక్తి ఇంటి వద్ద దింపుతానని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లి గ్రామానికి కాకుండా మరోవైపు దారి మళ్లించాడన్నారు. గమనించిన స్వరూప కేకలు వేయడంతో అతడు వాహనాన్ని వేగం పెంచ డంతో ఆమె వాహనంపై నుంచి దూకడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. గాయపడిన స్వరూపను ఎల్లారెడ్డిపేటలోని అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ టీచర్‌పై అఘాత్యా నికి పాల్పడిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నపిల్లలకు సేవలను అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్క టీచర్‌కు స్కుటీలను అందిం చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, నాయకులు సూరం పద్మ, జిందం కమలాకర్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.