Share News

ఆదమరిస్తే అంతే..

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:50 AM

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల, రాష్ట్ర రహదారి ఏదైనప్పటికీ దారి పక్కన బావులు, కాలువలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. మనుషులతో పాటు కారు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు రోడ్డు పక్కన కాలువలు, బావుల్లో పడిపోతున్నాయి. జిల్లాలో ఇటువంటి ఘటనలు పదికిపైగా చోటుచేసుకోగా అదే సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆర్‌అండ్‌బీ, ఇతర అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో తీవ్ర నిర్లక్ష్యం పదర్శిస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత రోడ్లు, ప్రధాన రహదారుల పక్కన ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వదిలేసిన సాగునీటి కాలువలు, బావులు ప్రయాణికుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి.

ఆదమరిస్తే అంతే..
గునుకుల కొండాపూర్‌ నుంచి జంగపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో బావిలోకి కుంగిన రోడ్డు

- దారి పక్కన బావులతో ‘మృత్యు’ ఘంటికలు

- పలుచోట్ల ప్రమాదకరంగా బావులు, కెనాల్స్‌

- అధికారుల నిర్లక్ష్యం.. రక్షణ చర్యలు శూన్యం

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల, రాష్ట్ర రహదారి ఏదైనప్పటికీ దారి పక్కన బావులు, కాలువలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. మనుషులతో పాటు కారు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు రోడ్డు పక్కన కాలువలు, బావుల్లో పడిపోతున్నాయి. జిల్లాలో ఇటువంటి ఘటనలు పదికిపైగా చోటుచేసుకోగా అదే సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆర్‌అండ్‌బీ, ఇతర అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో తీవ్ర నిర్లక్ష్యం పదర్శిస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత రోడ్లు, ప్రధాన రహదారుల పక్కన ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వదిలేసిన సాగునీటి కాలువలు, బావులు ప్రయాణికుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ప్రమాద సంఘటన జరిగిన సమయాల్లో అధికారులు హడావుడి చేసి నియంత్రణ చర్యలు చేపడతామని చెప్పడం మినహా శాశ్వతంగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రమాదకరమైన బావుల యజమానులకు నోటీసులు జారీ చేస్తూ వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాగునీటి కాలువల వద్ద రక్షణ గోడలు, పెన్సింగ్‌లు నిర్మించారు.

ఎన్ని ప్రాంతాల్లో..

జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత రోడ్లకు ఆనుకుని చాలా ప్రాంతాల్లో బావులు, పెద్ద పెద్ద కందకాలు ప్రమాదకరంగా ఉన్నాయి. రాజీవ్‌రహదారిపై పలు చోట్ల రోడ్డు పక్కన ప్రమాదకరమైన బావులు ఉన్నాయి. కరీంనగర్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై మానకొండూర్‌ నుంచి పచ్చునూర్‌ వరకు దాదాపు 10 వ్యవసాయబావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. మానకొండూర్‌ నుంచి వేగురుపల్లి వరకు రోడ్డు పక్కన 8 వ్యవసాయ బావులు ప్రమాదకరంగగా ఉన్నాయి. చిగురుమామిడి మండలంలో సీతారాంపూర్‌- కరీంనగర్‌ రహదారి పక్కన రెండు చోట్ల, బొమ్మనపల్లి-హుజూరాబాద్‌ రహదారిలో 3 చోట్ల, నవాపేట-కోహెడ్‌ దారిలో 2 చోట్ల, సుందరగిరి-హుస్నాబాద్‌ మార్గంలో 3 చోట్ల రోడ్డు పక్కన ప్రమాదకరంగా వ్యవసాయ బావులు ఉన్నాయి. గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్‌-జంగపల్లి, గుండ్లపల్లి రహదారిపై 2 చోట్ల రోడ్డును ఆనుకుని వ్యవసాయబావులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. జిల్లాలోని పలు చోట్ల రహ దారి పక్కన వ్యవసాయబావులు, కాలువలు ప్రమాదకరంగా ఉన్నాయి.

ప్రమాదకరంగా ప్రయాణం

గత ఆగస్టు 27న వేకువజామున లింగాపూర్‌ గ్రామానికి చెందిన గాలిపెల్లి ఆంజనేయులు కరీంనగర్‌ బస్టాండ్‌కు వెళుతుండగా మానకొండూర్‌ మండలం శ్రీనివాసనగర్‌ వద్ద రోడ్డు పక్కన ఉన్న వ్యవసా యబావిలో బైక్‌తోసహా పడిపోయి మరణించాడు. చీకటి సమయంలో బైక్‌ అదుపుతప్పి బావిలో పడగా ఎవరూ గమనించలేదు. వ్యవసాయబావి యజమాని తన బావిలో మృతదేహం చూసి పోలీసులకు సమా చారం అందించాడు. అలాగే కొంత కాలం క్రితం చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌ వద్ద రోడ్డు పక్క బావిలో కారు పడి రిటైర్డ్‌ ఎస్‌ఐ పాపయ్యనాయక్‌ దుర్మరణం చెందాడు. రాజీవ్‌ రహదారి పక్కన అలుగునూర్‌ వద్ద కాకతీయ కాలువలో కారు అదుపుతప్పి పడిపోగా తండ్రి, కూతురు మృతి చెందారు. 2003లో కరీంనగర్‌ మండలం కొత్తపల్లి శివారులో కాకతీయ కాలువలో ఒక మారుతి ఓమ్ని బస్‌ అదుపుతప్పి పడి పోవటంతో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంరేపింది. ప్రమాదం జరిగిన స్థలంలో సాగునీటి కాలవపై నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రదాన రోడ్డు వంతెన ఉన్నది. ఈ రోడ్డుపై వంతెన నిర్మించినప్పటికీ అక్కడే మూలమలుపు ఉండటంతో వాహనం అదుపుతప్పి కాలువలోకి జారి పోయింది. అయితే కాలువకు కొంత దూరం వరకు ఫెన్సింగ్‌ లేదా గోడ లేకుండా వదిలేయటంతో ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే కాలువలో చొప్పదండి ప్రాంతంలో 2015లో ఒక జీపు అదుపుతప్పి పడి పోవటంతో చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు చెందిన ఇద్దరు మహిళలు (ఒక ఏఎన్‌ఎం, మరో సహాయకురాలు) మృతి చెందారు. అంతకు ముందు కూడా ఎన్నో ప్రమాదాలు జరుగగా పలువురు మృతి చెందారు.

Updated Date - Sep 12 , 2025 | 12:51 AM