Share News

టెట్‌.. టెన్షన్‌

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:02 AM

ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ టెన్షన్‌ పట్టుకుంది.

టెట్‌.. టెన్షన్‌

జగిత్యాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఉలిక్కి పడేలా చేసింది. ఐదేళ్లకు పైబడి సర్వీస్‌ ఉన్న ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) అర్హత పరీక్షలో ఉతీర్ణులు కానిపక్షంలో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత తమ జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేసిన టీచర్లను తక్షణమే పరీక్ష రాయాలని, లేకుంటే ఉద్యోగం కోల్పోవాలనే నిర్ణయం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టెట్‌ చట్టబద్ధతపై 2010 నోటిఫికేషన్‌ నేపథ్యం....

టెట్‌ అర్హతపై 2010 ఆగస్టు 23న నెషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీఈటీ) కీలక నోటిఫికేసన్‌ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి టెట్‌ ఉతీర్ణత తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీకి ముందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఈ పరీక్ష నుంచి తప్పించబడ్డారు. ఈ నోటిఫికేషన్‌ ఆధారంగానే గత పదిహేనేళ్లుగా పాలక ప్రభుత్వాలు ఉపాధ్యాయ నియామకాలు చేస్తున్నాయి.

రెండేళ్ల గడువుతో టీచర్లలో ఆందోళన .....

రెండేళ్లలోపు టీచర్లు టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది సీనియర్లు దశాబ్దాల తరబడి పాఠశాలల్లో బోధన చేస్తున్నారు. ఇప్పుడు వయసు, ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతలు వంటి కారణాలతో మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి లక్షలాది మంది ఉపాధ్యాయులు టెట్‌ పరీక్షకు హాజరు కావాల్సి వస్తే నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఎదురువుతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. టెట్‌ అర్హత వద్దే వద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు ఒకే స్వరం వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతున్నారు. 2010 నోటిఫికేషన్‌ కంటే ముందు..

రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

- తిరుక్కోవెల శ్యామ్‌సుందర్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

డిగ్రీ, బీఈడీతో ఎస్‌జీటీగా అపాయింట్‌ అయిన వారికి ప్రస్తుతం టెట్‌ పేపర్‌-1 రాయడానికి అర్హత ఉండదు. అయితే ఎన్‌సీటీసీ లోగడ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం వీరికి ఆరునెలల స్వల్ప కాలిక ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చిన తర్వాత పేపర్‌-1 కి అర్హత లభిస్తుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలి.

గందరగోళానికి దారితీస్తోంది

- బైరం హరికిరణ్‌, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

2009 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులు వచ్చే రెండు సంవత్సరాల్లో టెట్‌ ఉత్తీర్ణత పొందకపోతే, ఉద్యోగం కొనసాగించలేరని, ప్రమోషన్లకు అర్హత ఉండదని సుప్రీంకోర్టు నిర్ణయం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. టెట్‌ అర్హత తప్పని సరి నిర్ణయం గందరగోళానికి దారితీస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, న్యాయ నిపుణులతో సంప్రదించి, ఉపాధ్యాయులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి.

Updated Date - Sep 14 , 2025 | 01:02 AM