ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:09 AM
దేశంలో ఉగ్రవాదాన్ని తుద ముట్టించి మత సామరస్యతను కాపాడాలని, ఛత్తీస్‌గఢ్‌లో జరుపుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య అన్నారు.

భగత్‌నగర్, మే 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉగ్రవాదాన్ని తుద ముట్టించి మత సామరస్యతను కాపాడాలని, ఛత్తీస్‌గఢ్‌లో జరుపుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య అన్నారు. శనివారం సుగుణాకర్‌రావు భవన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్థంతి వారోత్సవాల్లో భాగంగా ‘పహెల్గాం ఉగ్రదాడి-అనంతర పరిణామాలు’ అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీరయ్య మాట్లాడుతూ పహెల్గాం ఉగ్రదాడి దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు చనిపోయారన్నారు. పర్యాటక ప్రాంతంలో భద్రత ఎందుకు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భావోద్వేగాలను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాశ్మీర్ ముస్లింలే పర్యాటకులను కాపాడారని, రైల్వే, ఎయిర్‌పోర్టులకు ఉచితంగా పర్యాటకులను చేరవేశారన్నారు. అదే కార్పొరేట్ శక్తులు ఎయిర్‌లైన్స్‌లో 6 వేలు ఉన్న టికెట్‌ను 60 వేలకు పెంచారన్నారు. ఈ ఉగ్రదాడిలో ఒక ముస్లిం హార్స్ రైడర్ చనిపోయారన్నారు. మత కల్లోలాలు సృష్టించాలని చూస్తే కాశ్మీర్ ముస్లిం ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా రోడ్ల మీదకు వచ్చి పాకిస్తాన్ డౌన్‌డౌన్ అంటూ నినదించి మూడు రంగుల జాతీయ జెండాలతో భారీ ర్యాలీ ఎలా తీశారని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో శాంతిభద్రతల సమస్యగా చూపెడుతూ అడవి ప్రాంతం నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు ప్రజలంతా ఉద్యమించాలన్నారు. ఈ సెమినార్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్‌రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సంపత్, ఎడ్ల రమేష్, జి రాజేశం, కోనేటి నాగమణి, జిల్లా నాయకులు తిప్పారపు సురేష్, జి తిరుపతి నాయక్, కొంపెల్లి అరవింద్, రాజమల్లు, నరసింహారెడ్డి, రామ్మోహన్, శ్రీధర్, మాతంగి శంకర్, పుల్లెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.